Telugu Global
Family

హిమాల్‌-నగరి (For Children)

పూర్వం ఒకప్పుడు అనంతనాగ్‌లో ఒక పేద కాశ్మీరీ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య ఎప్పుడూ అతన్ని పోరుతూ ఉండేది. ఒకరోజు ‘ఇంట్లో ఒక బియ్యపు గింజ కూడా లేదు. ఇదిగో ఈసంచి తీసుకుని ఇంట్లోంచి వెళ్ళు. సంపాదిస్తావో, దొంగిలిస్తావో, అప్పు తెస్తావో నాకు తెలీదు. ఖాళీ చేతుల్తో మాత్రం ఇంటికి తిరిగి రాకు’ అంది. దిక్కుతోచని బ్రాహ్మణుడు ఇంటినించీ బయటపడ్డాడు. ఏం చెయ్యాలో ఎవర్ని అడగాలో ఏమడగాలో తోచలేదు. అనంతనాగ్‌లో ఉన్న ఒకసరస్సు దగ్గర ఆగి ఏమీ […]

పూర్వం ఒకప్పుడు అనంతనాగ్‌లో ఒక పేద కాశ్మీరీ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య ఎప్పుడూ అతన్ని పోరుతూ ఉండేది. ఒకరోజు ‘ఇంట్లో ఒక బియ్యపు గింజ కూడా లేదు. ఇదిగో ఈసంచి తీసుకుని ఇంట్లోంచి వెళ్ళు. సంపాదిస్తావో, దొంగిలిస్తావో, అప్పు తెస్తావో నాకు తెలీదు. ఖాళీ చేతుల్తో మాత్రం ఇంటికి తిరిగి రాకు’ అంది.

దిక్కుతోచని బ్రాహ్మణుడు ఇంటినించీ బయటపడ్డాడు. ఏం చెయ్యాలో ఎవర్ని అడగాలో ఏమడగాలో తోచలేదు. అనంతనాగ్‌లో ఉన్న ఒకసరస్సు దగ్గర ఆగి ఏమీ తోచక భార్య ఇచ్చిన సంచిని పక్కన పెట్టుకుని గట్టుమీద పడుకున్నాడు. నిద్రలేచేసరికి సంచిలో ఏదో జారబడినట్లనిపించింది. అది పాము అని గ్రహించాడు. వెంటనే సంచిని కట్టేశాడు. ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే ఏదో తెచ్చానని భార్య అనుకుని మూతి విప్పితే పాము ఆమెను కరిస్తే పీడ విరగడవుతుందని లేనిపోని ఆలోచనలు చేశాడు.

బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి భార్యకు ఆ సంచి ఇచ్చాడు. ఆమె ఆతృతగా సంచి మూత విప్పడంతోనే బుస్సుమని పాము బుసకొట్టింది. ఆమె భయపడేంతలోనే ఆ పాము ఒక పసిబిడ్డగా మారిపోయింది. ‘మీరు నన్ను మీ బిడ్డగా అంగీకరించండి. మీకు అన్నీ మంచి పనులే జరుగుతాయి’ అంది.

ఆ దంపతులకు పిల్లలు లేరు. దైవమిచ్చిన ఆ బిడ్డను సంతోషంగా స్వీకరించారు. సంబరం జరుపుకున్నారు. ఆ బిడ్డకు ‘నాగరి’ అని పేరు పెట్టుకున్నారు. ఆపసివాడు పెరిగి పెద్దవాడయి ఎంతో అందగాడయ్యాడు.

నాగరి తన గ్రామాన్ని వదిలి రాజభవనం వేపు వెళ్ళి అక్కడ పాముగా రూపమెత్తి రాళ్ళ సందుల గుండా స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసేవాడు. స్నానమప్పుడు మానవరూపం ఎత్తేవాడు. స్నానానంతరం రాళ్ళ సందుల గుండా పామై బయటపడి మనిషి రూపమెత్తి ఇల్లు చేరేవాడు.

ఒకరోజు స్నానం చేస్తూ ఉంటే కిటికీ గుండా రాజకుమారి అతన్ని చూసింది. ఆమె పేరు ‘హిమాల్‌’. ఆశ్చర్యపోయింది. ఆమె అంత అందగాణ్ణి చూసి అబ్బురపడింది. రహస్యంగా తన చెలికత్తెను పంపి అతన్ని అనుసరించమని చెప్పింది. చెలికత్తె అతన్ని అనుసరించి వెళ్ళి రాజకుమారి దగ్గరకు వచ్చి ‘అతను పేదబ్రాహ్మణకుమారుడయిన ‘నాగరి’ అని చెప్పింది.

కానీ అప్పటికే రాజకుమారి అతన్ని గాఢంగా ప్రేమించింది. అతన్నే పెళ్ళి చేసుకుంటానని తల్లిదండ్రుల్తో చెప్పింది. రాజకుమారి ఒకపేద బ్రాహ్మణుణ్ణి పెళ్ళి చేసుకుంటాననడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆమె మనసు మార్చడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఆమె మొండిపట్టుపట్టింది.

కూతురి పట్ల మమకారంతో వాళ్లు పెళ్ళికి అంగీకరించారు. రాజు బ్రాహ్మణుణ్ని పిలిచి ఆ విషయం చెప్పడంతో అతను మూర్ఛపోయినంత పనిచేశాడు.

బ్రాహ్మణుడు ‘రాజా! నేను పేదబ్రాహ్మణుణ్ణి. నా కొడుకును నీ కూతురు చేసుకుంటాననడమేమిటి?’అన్నాడు.

రాజు ‘నువ్వు నిజమే చెప్పావు కానీ మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడింది. తప్పదు. పెళ్ళి ఏర్పాట్లు చూడు| అన్నాడు.

పేదబ్రాహ్మణుడు చిన్ని ఇంటినించే ఉరేగింపు జరపడం తలచుకుని సిగుపడ్డాడు. నాగరి ‘నాన్నా! నువ్వు నేను ఎక్కడ దొరికానో అక్కడికి వెళ్లి దైవానికి నమస్కరించిరా!’ అన్నాడు. వచ్చేసరికి చిన్న ఇల్లు స్థానంలో రాజభవనం ఉంది. మందీ మార్బలంతో, జన సందోహంతో కళకళలాడుతోంది. బ్రాహ్మణుడు దిగ్భ్రమ చెందాడు. పరవశించాడు.

నాగరి, హిమాల్‌ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. దైవశక్తుల్తో ఉన్న నాగరి ప్రజల్ని సుఖశాంతులు కలిగేలా పాలించాడు.

– సౌభాగ్య

First Published:  10 Aug 2015 1:02 PM GMT
Next Story