Telugu Global
Others

ప్రత్యేక హోదా అసాధ్యం: కుండబద్దలు కొట్టిన జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కుండబద్దలు కొట్టారు. 14 ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జైట్లీ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ టీడీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలతో మాట్లాడిన జైట్లీ విభజనతో ఏపీకి ఆర్థికంగా నష్టం జరిగిందని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీకి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ […]

ప్రత్యేక హోదా అసాధ్యం: కుండబద్దలు కొట్టిన జైట్లీ
X

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కుండబద్దలు కొట్టారు. 14 ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జైట్లీ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ టీడీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలతో మాట్లాడిన జైట్లీ విభజనతో ఏపీకి ఆర్థికంగా నష్టం జరిగిందని, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీకి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించిన కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు గుప్పించిందని జైట్లీ ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే ప్రత్యేకహోదాపై ఆందోళనలు చేస్తున్నారని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం రానున్న మూడేళ్ళు శక్తివంచన లేకుండా ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. తనను కలిసిన వారంతా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఆందోళనగా ఉన్నారని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో పరిశీలన చేస్తున్నామని, పేరు ఏదైనా సరే.. ఏపీకి రాబోయే కొన్నేళ్లపాటు నిరంతరాయంగా ప్రత్యేక మద్దతు ఇస్తామని చెప్పారు. రాష్ట్రం అవసరాలు, ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గకుండా ఇది ఉంటుందని, ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఇది ఉంటుందని చెప్పారు. రాయితీలు, ఆదాయ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహాయం, ఇప్పుడు ఇచ్చిన ప్రాజెక్టులకు అదనంగా మరికొన్ని ఇవ్వటం వంటివి ఇందులో ఉంటాయన్నారు. వీటిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఆందోళన పూర్తిగా రాజకీయమయమని కొట్టిపారేశారు. అసలు ప్రత్యేక హోదాపై ఆందోళన చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి హక్కు లేదన్నారు. ఆర్థికలోటును పూరించడం, రాజధాని నిర్మాణానికి నిధులు అందించడం, ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడం చేస్తామని జైట్లీ చెప్పారు. అరుణ్‌జైట్లీని కలిసిన టీడీపీ ప్రతినిధులు ఏపీ అవసరాల్ని, సమస్యల్ని వినిపించడంలో విఫలమయ్యారని ఆయన అన్నట్టు తెలిసింది. అనంతరం టీడీపీ ప్రతినిధుల బృందం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఆయన కూడా ప్రత్యేక హోదాపై సంతృప్తికర సమాధానం ఇవ్వలేదు. ఏపీ విభజన చట్టం అమల్లో తలెత్తుతున్న సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం మీద గత నెలరోజుల నుంచి ఏమైతే చెప్పారో అది ఈరోజు విస్పష్టంగా వినిపించారు. ఒకపక్కన ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాంటి ప్రకటన చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని నూటికినూరు పాళ్ళు ఇరకాటంలో పెట్టేదే. అయితే ఈ ప్రకటన విన్న వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ప్రకటన చేస్తూ ప్రత్యేక ప్యాకేజీలు అవసరం లేదని, హోదా ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు.

First Published:  11 Aug 2015 7:13 PM GMT
Next Story