Telugu Global
Family

నాణెం (For Children)

పూర్వం గ్రామస్థులకు నాణేలు తెలీవు. సరుకుల మార్పిడి జరిగేది. వస్తువులు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు, కాశ్మీర్‌లో ఒక సరస్సు ఒడ్డున ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంచుట్టూ కోటగోడల్లా కొండలున్నాయి. ఆ గ్రామంలో రకరకాల పళ్ళ తోటలు, పొలాలు ఉన్నాయి. వాళ్ళు తమ అవసరాలకోసం ఎక్కడికీ వెళ్ళాల్సిన పనిలేదు. ఆ గ్రామం గురించి తెలిసిన వాళ్ళు కొందరే. ఎప్పుడో గానీ అపరిచితులు ఆ గ్రామానికి వచ్చేవాళ్ళు కారు. అట్లా ఉండే ఊళ్ళోకి ఒక కొత్త వ్యక్తి పనిమీద ఆగ్రామం […]

పూర్వం గ్రామస్థులకు నాణేలు తెలీవు. సరుకుల మార్పిడి జరిగేది. వస్తువులు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు, కాశ్మీర్‌లో ఒక సరస్సు ఒడ్డున ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంచుట్టూ కోటగోడల్లా కొండలున్నాయి. ఆ గ్రామంలో రకరకాల పళ్ళ తోటలు, పొలాలు ఉన్నాయి. వాళ్ళు తమ అవసరాలకోసం ఎక్కడికీ వెళ్ళాల్సిన పనిలేదు. ఆ గ్రామం గురించి తెలిసిన వాళ్ళు కొందరే. ఎప్పుడో గానీ అపరిచితులు ఆ గ్రామానికి వచ్చేవాళ్ళు కారు.

అట్లా ఉండే ఊళ్ళోకి ఒక కొత్త వ్యక్తి పనిమీద ఆగ్రామం గుండా వెళుతూ ఒకరి ఇంట్లో ఆతిథ్యం తీసుకుని అక్కడినించీ వెళుతూ వాళ్ళకు ఒక వెండినాణేన్ని ఇచ్చి వెళ్ళాడు.

ఈ విషయం గ్రామమంతా కార్చిచ్చులా వ్యాపించింది. అందరూ ఆ వెండినాణేన్ని చూడడానికి వాళ్ళింటికి వచ్చారు. ఆ గృహస్థుడు గ్రామ పెద్దఇంటికి వెళ్ళి ఆ వెండినాణేన్ని అతనికి ఇచ్చాడు. గ్రామపెద్ద కళ్ళింతలు చేసుకుని అద్భుతాన్ని చూసినట్లు ఆ నాణేన్ని చూశాడు. ఊళ్లో అందరూ కలిసి ఆ అపూర్వమైన నాణేన్ని రాజుగారికి అందించాలని నిర్ణయించారు. దాన్ని ఎలా తీసుకెళ్ళాలన్న సమస్య వచ్చింది. బాగా బలమైన నలుగురు యువకులు సిద్ధమయ్యారు. ఒక పల్లకీ సిద్ధం చేశారు. దాంట్లో వెండి నాణేన్ని పెట్టారు. దాన్ని మోసుకుని నగరానికి చేరారు.

దారిలో అందరూ ఏమిటిది? అని అడిగితే వాళ్ళు ‘ఇది రాజుగారికి మేము సమర్పించే విలువైన బహుమతి’ అన్నారు.

వాళ్ళు రాజభవనం ముందు ఆగి రాజుగారికి బహుమతి సమర్పించడానికి వచ్చామన్నారు. రాజు వారికి మర్యాదలు చెయ్యమని మరుసటిరోజు వాళ్ళని కలుస్తానని చెప్పారు. రాచమర్యాదలతో వాళ్ళు ఆనందించారు.

మరుసటిరోజు వాళ్ళు రాజు ముందుకు వెళ్ళారు. వాళ్ళు తలలు వంచి రాజు పాదాలకు నమస్కరించి ‘మేము మీ సేవకులం. మీ సేవలోనే మా జన్మ తరిస్తుంది. మీ పట్ల గౌరవంతో మీకు ఒక విలువైన బహుమానం మీకు సమర్పించడానికి తెచ్చాము’ అన్నారు.

రాజు చిరునవ్వుతో ఆమోదం తెలిపాడు.

నలుగురిలో ఒకడు పల్లకీ దగ్గరకు వెళ్ళాడు. సభికులంతా ఆతృతగా చూశారు. అతను తెర తొలగించి లోపల ఉన్న వెండినాణెం కొరకు వెతికాడు. కనిపించలేదు. లోపలికి వెళ్ళి చూశాడు. లేదు. పల్లకీని నలుగురు కలసి తలకిందులు చేశారు. లేదు. దిగులుపడ్డాడు. సభికులంతా విచిత్రంగా గమనిస్తున్నారు.

నలుగురు వచ్చి రాజుగారి పాదాల మీద పడి ‘రాజుగారూ! మన్నించాలి. మీకోసం మోసుకొచ్చిన విలువైన బహుమానం ఎక్కడో జారిపోయింది’ అన్నారు.

సభలో వాళ్లు అసహనంతో ‘మీరు తెచ్చిన బహుమానం ఏమిటి?’ అని అడిగారు. వాళ్ళని శిక్షించాలని అన్నారు. కానీ రాజుగారు వాళ్ళని గమనిస్తున్నాడు. వాళ్ళు నిరాడంబరులు. నిజాయితీపరులు. అమాయకులయిన గ్రామీణులుగా తెలుసుకున్నాడు. వాళ్ళు మోసగాళ్ళు కాదని గ్రహించాడు. ఐనా ఆ రాత్రికి నలుగుర్నీ ఒక గదిలో బంధించమన్నాడు. వాళ్ళు భయంతో తాము పోగొట్టుకున్న వెండినాణెం గురించి చర్చించుకోవడం రహస్యంగా విన్నాడు. ‘అంత విలువైన వెండినాణెం రాజుకు సమర్పించుకోలేకపోవడం తమ దురదృష్టం’ అనుకున్నారు.

తనకోసం పల్లకీలో మోసుకొచ్చింది వెండినాణెమా! అని తెలుసుకుని రాజు నవ్వుకున్నాడు. పాపం ఎక్కడో జారిపోయి ఉంటుందని జాలిపడ్డాడు.

ఉదయాన్నే వాళ్ళని సభకు పిలిపించాడు. భయపడుతూ వచ్చి నిలబడ్డారు. రాజు వంద వెండినాణేల సంచుల్ని నాలుగు తెప్పించి ఒక్కొక్కరికి ఒక్కొటి ఇచ్చాడు.

వాళ్లు ఆనందంగా రాజుగారి పాదాలపై పడ్డారు.

– సౌభాగ్య

First Published:  11 Aug 2015 1:02 PM GMT
Next Story