దొంగలనాయకుడు (For Children)

ఒక కాశ్మీరీ బ్రాహ్మణుడు గొప్ప ఆందోళనలో ఉన్నాడు. అదేమిటంటే అతని కూతురికి పెళ్ళీడు వచ్చింది. వరులు దొరకరా అంటే బోలెడు మంది అడుగుతున్నారు. కానీ సమస్య ఏమిటంటే పండితుని దగ్గర ధనం లేదు. కానీ ఆ సంగతి ఊళ్లో ఎవరూ ఒప్పుకోరు. లంకంత కొంప, పొలాలు ఉన్న ఆసామి అంటారు. పెద్దల ఆచారాల్ని గౌరవిస్తూ పండుగలకి, పబ్బాలకు భారీగా ఖర్చుపెడతారు. ఆడంబరాలకు అడ్డులేదు. అందుకని అలవి మీరిన అప్పులు కూడా చేశాడు. ఆదాయం తక్కువ భారీ ఖర్చులు.

 ఈ మధ్యలో అతనికి ఇంకో సమస్య వచ్చింది. సుందర్‌ అతని ఒకప్పటి మిత్రుడు. అవసరం పడి డబ్బు అడిగాడు. పండితుడి దగ్గర లేదు. లేదు అని చెప్పాడు. దాంతో శత్రువయ్యాడు.

సుందర్‌ సన్నిహితులు పండితుడంటే ఇష్టం లేనివాళ్ళు సుందర్‌తో ‘ఒక గజదొంగ నాయకుడు ఉన్నాడు కదా! అతన్ని పండితుడి ఇంటి మీదకు పంపితే పండితుడు బికారీ అవుతాడు’ అని ఎగదోశారు.

దొంగల నాయకుడితో ఒప్పందం కుదిరింది. పండితుడికి ఈవ్యవహారం తెలీదు. నిద్రపోబోయే ముందు అతని భార్య ‘మన అమ్మాయికి పెళ్ళి వయసు వచ్చింది కదా! ఎందుకు మీరు వాయిదా వేస్తున్నారు’ అంది.

పండితుడు భార్యతో ‘వున్న విషయం చెబుతున్నా. పండగలకు, విందులకు ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అమ్మాయికి పెళ్ళి చేయాలంటే నా దగ్గర డబ్బులేదు. అదీ సమస్య’ అన్నాడు.

ఆమె కన్నీళ్ళు ఒత్తుకుంటూ ‘ఈ దరిద్రపు దినాల్ని చూడడానికి ఇంకా బతికి ఉండాలేమో’అంది.

భార్య ఏడుపు చూసి భర్త కూడా ఏడ్చాడు. పడకగది అంతా ఏడుపుల్తో నిండి పోయింది.

ఇదంతా పడకగదిలో జరిగిన విషయం. దీనికంతటికి అపరిచితుడయిన ఒక సాక్షి ఉన్నాడు. అతడు దొంగల నాయకుడు.

రాత్రి రహస్యంగా అక్కడ చేరి భారీ దొంగతనానికి అతను పథకం వేస్తున్నాడు. ఇంతలో ఈ దృశ్యం. ఇదంతా విని అతను చలించిపోయాడు. సుందర్‌ ఇల్లు పురాతన భవనం. ప్రాచీనులు దాచిన విలువైన వస్తువులెన్నో దాచిపెట్టి ఉంటారు. దాంతో నీ దశ తిరిగి పోతుంది అని దొంగల నాయకుణ్ణి రెచ్చగొట్టాడు. ఆ నమ్మకంతోనే అతను వచ్చాడు. వచ్చాకా అసలు సంగతి తెలిసింది. ఆగ్రహం మనసులో రేగింది. పండితుడు, అతని భార్య నిద్రపోయేదాకా ఉండి వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు భారీదోపిడీతో దొంగలనాయకుడు తన ఇంటికి వస్తాడని, తనకు వాటా దక్కుతుందని సుందర్‌ ఎదురుచూస్తున్నాడు. కానీ ఆ రాత్రే సుందర్‌ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. వజ్రాలు, నగలు దోపిడీకి గురయ్యాయి.

ఉదయాన్నే పండితుడి భార్యనిద్రలేచే సరికి ఆమె తల దగ్గర ఒక సంచి పడి ఉంది. దాని పక్కన ఒక చీటీ ఉంది. అందులో ఇందులో నగలు, వజ్రాలు ఉన్నాయి. మీ అమ్మాయి పెళ్ళి అంగరంగ వైభోగంగా జరపండి. ‘ఇట్లు దొంగలనాయకుడు’ అని రాసుంది!

– సౌభాగ్య