Telugu Global
Family

మరణం గురించిన రెండు కథలు (Devotional)

జీవితం సరళంగా ఉంటుంది. మనమే సంక్లిష్టంగా ఉంటాం. మనం నిశ్చలమైన నిద్ర నుండి పుడతాం. మరణంతో నిర్మలమయిన మెలకువలోకి కళ్ళు తెరుస్తాం. మొదటి కథ: మన ప్రపంచంలో ఒక ప్రత్యేకమయిన భ్రాంతి ఉంది. మన ప్రాచీనులు దాన్ని “దేవతల ఆట” అన్నారు. జీవితాన్ని “అంతరిక్షం వేసిన చమత్కార”మన్నారు. అప్పుడు మరణాన్ని కూడా మనం అలాగే చూడాలి. తన గురువు గారు చనిపోయినపుడు ఛిన్‌షి “దహనక్రియలకు వచ్చి చుట్టూ చూసి మూడుసార్లు గట్టిగా అరిచాడు”. ఇంకో శిష్యుడు అది […]

జీవితం సరళంగా ఉంటుంది. మనమే సంక్లిష్టంగా ఉంటాం. మనం నిశ్చలమైన నిద్ర నుండి పుడతాం. మరణంతో నిర్మలమయిన మెలకువలోకి కళ్ళు తెరుస్తాం.

మొదటి కథ:

మన ప్రపంచంలో ఒక ప్రత్యేకమయిన భ్రాంతి ఉంది. మన ప్రాచీనులు దాన్ని “దేవతల ఆట” అన్నారు. జీవితాన్ని “అంతరిక్షం వేసిన చమత్కార”మన్నారు. అప్పుడు మరణాన్ని కూడా మనం అలాగే చూడాలి.

తన గురువు గారు చనిపోయినపుడు ఛిన్‌షి “దహనక్రియలకు వచ్చి చుట్టూ చూసి మూడుసార్లు గట్టిగా అరిచాడు”. ఇంకో శిష్యుడు అది చూసి ఛిన్‌షితో “నువ్వు మన గురువు గారికి దాదాపు స్నేహితుడి లాంటివాడివనుకుంటాను” అన్నాడు. ఛిన్‌షి “అవును” అన్నాడు. అతను “మరి అట్లాంటప్పుడు నీ ప్రవర్తనలో ఏమైనా అర్థముందా?” అన్నాడు.

ఛిన్‌షి “అవును. మొదట నేను ఇక్కడికి వచ్చినపుడు గురువుగారి ఆత్మ ఇక్కడ ఉందనుకున్నాను. కానీ అదిక్కడ లేదు. ఇక్కడ మౌనం పాటించడానికి వచ్చాను. కానీ ఇక్కడ అంతా వేరుగా ఉంది. ఏడుపుల్తో పెడబొబ్బల్తో నిండి ఉంది. ఇదంతా నాకు చాలా అసహజంగా అనిపించింది. గురువుగారు ఈ లోకంలోకి వచ్చారు, ఉన్నారు. ఇది వెళ్ళిపోవాల్సిన సమయం. వెళ్ళిపోయారు. ఇక్కడ బాధ పడాల్సినదేమీ లేదు. ఇది గొప్ప స్వేచ్ఛ ఆవిష్కరింపబడిన, హద్దులు బద్దలయిన దినం. కట్టె కాలుతున్నపుడు అదొక ప్రయోజనాన్ని ఉద్దేశించి కాలుతోంది. కాలి అదెక్కడికి పోతోందో మనకేం తెల్సు?” అన్నాడు.

రెండవ కథ:

ట్జూలావో “మరణ శయ్యపై ఉన్నాడు. భార్యా పిల్లలు చుట్టూ చేరి ఏడుస్తున్నారు. అతని స్నేహితుడు ట్జూలి వచ్చి ఆ దృశ్యం చూసి వాళ్ళతో “నిశ్శబ్దంగా ఉండండి. అతను గొప్ప రూపాంతర స్థితిలో ఉన్నాడు. అతన్ని డిస్ట్రబ్‌ చెయ్యకండి. ఏడవకండి” అని తన మిత్రుడు తనతో చెప్పిన మాటల్ని వాళ్ళకు వివరించాడు.

“జీవితాన్ని సృష్టించినవాడు ఎంత గొప్పవాడు. వచ్చే జన్మలో నువ్వు ఎలుకగా, దోమగా పుడతావో నీకు తెలుసా?” అని నేనంటే నా మిత్రుడు నవ్వుతూ ”పసివాడికి తల్లిదండ్రుల్తో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే వాళ్ళు ఏం చెబితే అది చేస్తాడు. వాటి పర్యవసానాల్ని గురించి పట్టించుకోడు. దైవం నన్ను మరణించమని ఆదేశిస్తే ఇప్పుడే మరణిస్తాను. ఈ గొప్ప భూమి నాకు ఒక రూపాన్నిచ్చింది. దాన్నిబట్టి నేను శ్రమించాలి. దానివల్ల నేను వృద్ధాప్యంలో విశ్రాంతి పొందుతాను. ఫలితంగా మరణంలో ఆనందం పొందుతాను. దానివల్లే జీవన్మరణాలు ఉత్తమోత్తమమయినవవుతాయి” అన్నాడు.

– సౌభాగ్య

First Published:  13 Aug 2015 1:01 PM GMT
Next Story