Telugu Global
Others

స్వాతంత్ర్యం నాకేమిచ్చింది..?

అరవై తొమ్మిదేళ్ల స్వాతంత్ర్యం మనకేమీ ఇవ్వలేదనడం నిరాశ. మనం ఎంచుకున్న ఈ వ్యవస్థలో అందరికీ అన్నీ సమకూరుతాయనుకోవడం దురాశ. అనేక రంగాలలో మనం అభివృద్ధి సాధించిన మాట వాస్తవం. తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ముందు చూపు కారణంగా అంతరిక్ష రంగంలో మనం అగ్ర రాజ్యాలకు ఏ మాత్రం తీసిపోని దశలో ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ జనాభా 33 కోట్లు. ఇప్పుడు అది 125 కోట్లు అంటే 69 ఏళ్ల కాలంలో దేశ జనాభా దాదాపు […]

స్వాతంత్ర్యం నాకేమిచ్చింది..?
X

RV Ramaraoఅరవై తొమ్మిదేళ్ల స్వాతంత్ర్యం మనకేమీ ఇవ్వలేదనడం నిరాశ. మనం ఎంచుకున్న ఈ వ్యవస్థలో అందరికీ అన్నీ సమకూరుతాయనుకోవడం దురాశ. అనేక రంగాలలో మనం అభివృద్ధి సాధించిన మాట వాస్తవం. తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ముందు చూపు కారణంగా అంతరిక్ష రంగంలో మనం అగ్ర రాజ్యాలకు ఏ మాత్రం తీసిపోని దశలో ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ జనాభా 33 కోట్లు. ఇప్పుడు అది 125 కోట్లు అంటే 69 ఏళ్ల కాలంలో దేశ జనాభా దాదాపు నాలుగు రెట్లయింది. 1960ల మధ్యలో తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత ఎదుర్కున్నాం. కాని ఆ తర్వాత మూడు నాలుగేళ్ల లోపే సస్య విప్లవ బావుటా ఎగరేసి ఆహార ధాన్యాల విషయంలో గణనీయమైన పెరుగుదల సాధించాం. కాని అన్నార్తుల సంఖ్య తగ్గించలేక పోయాం. జనాభా ఈ 69 ఏళ్ల కాలంలో నాలుగు రెట్లు పెరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి కనీసం అయిదారు రెట్లు పెరిగింది. అయినా సామాన్యుల ఆకలి తీర్చే మార్గం కనిపించడంలేదు. జనాభా పెరుగుదలను మించి పెరిగిన ఆహార ధాన్యాలు ఏమై పోతున్నాయన్న ప్రశ్నకు సమాధానమే లేదు.

2013లో మనం 39బిలియన్ డాలర్ల విలువగల ఆహారధాన్యాలను ఎగుమతి చేసి వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలో ఏడో స్థానంలో నిలిచాం. అన్నార్తుల ఆకలి తీరకపోవడానికి ఆహార ధాన్యాల కొరత కారణం కాదని అనేక సార్లు రుజువైంది. వలస పాలనలో మగ్గిపోతున్నప్పుడు 1943నాటి బెంగాల్ కరువుకు సైతం ఆహార ధాన్యాల కొరత కారణం కాదని శాస్త్రీయంగా రుజువు చేసిన ఆర్థికవేత్తలున్నారు. వలస పాలనలోనూ ఆకలి ఉంది. స్వతంత్ర భారతంలోనూ ఆకలి కొనసాగుతోంది. అంటే “అన్నపు రాసులు ఒక చోట-ఆకలి మంటలు ఒక చోట” అనే పరిస్థితిని 69 ఏళ్ల స్వాతంత్ర్యం మార్చలేక పోయింది.

ఆర్థికాంశాల విషయానికి వస్తే స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పెరిగింది. అయినా సామాన్యుల దారిద్ర్యం తీరడం లేదు. వ్యవసాయ పారిశ్రామికోత్పత్తులు ప్రజల ఆకలి, అవసరాలు తీర్చడానికి చాలినన్ని ఉన్నా పేదరికం కొనసాగుతూనే ఉంది. సంపద పెరగలేదనడం అవాస్తవం. పెరిగిన సంపద ఎవరి బొక్కసాల్లోకి చేరింది అంటే స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. స్వాతంత్ర్యం సంపాదించిన దశలో గుప్పెడు మంది కోటీశ్వర్లు మాత్రమే ఉండే వారు. ఇప్పుడు వారి సంఖ్య అపారంగా పెరిగింది. పారిశ్రామిక వేత్తల, వ్యాపారుల సంపద మాత్రమే పెరగలేదు. రాజకీయ నాయకుల సంపదా పెరిగింది. పార్లమెంటులో ఆసీనులయ్యే ప్రజా ప్రతినిధుల్లో బహు కోటీశ్వర్లే ఎక్కువ మంది. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలన్నది రాజ్యాంగ ఆదేశిక సూత్ర నిర్దేశం. 1991లో, నిజం చెప్పాలంటే అంతకు నాలుగైదేళ్ల ముందే ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల ఆసరాతో కుబేరుల సంఖ్య పెరిగిపోతోంది. సంపదను కొల్లగొట్టడంలో ఆ కుబేరుల మధ్య విపరీతమైన పోటీ.

ఇలాంటి రుగ్మతలను పక్కన పెడితే మనం ఎంచుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ ప్రజాస్వామ్యం అన్న నిర్వచనానికి మాత్రమే పరిమితమై చూస్తే అపారమైన తృప్తి మిగులుతుంది. కాని ప్రజాస్వామ్యం రాజకీయాలకే పరిమితం కాదని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలోనూ ప్రజాస్వామ్యం నెలకొన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అనుకునే వారికి మిగిలింది మాత్రం నిరాశే. అంబేద్కర్, నెహ్రూ లాంటి వారు కోరుకున్నది రెండవ రకం ప్రజాస్వామ్యాన్నే. కానీ అందులోనే మనం ఊహకందనంత వెనుకబడి పోయాం. తొలి తరం దేశ నిర్మాతల దూరదృష్టి వల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థలు పటిష్ఠంగా ఉన్నాయి. కాని దాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థ మరీ నాసిరకంగా ఉన్నందువల్లే స్వాతంత్ర్యం సకల రుగ్మతలకు సంజీవినిలా పని చేస్తుందన్న నమ్మకం కేవలం అత్యాశేనని తేలి పోయింది.

ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలనూ కుళ్లబొడిచే క్రమం పకడ్బందీగానే కొనసాగుతోంది. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ఈ క్రమానికి శ్రీకారం చుడితే ఎమర్జెన్సీ ఊసు లేకుండానే ప్రజాస్వామ్య వ్యవస్థలను, ముఖ్యంగా పార్లమెంటును కుళ్ల బొడిచే పని నిరాటంకంగా సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు శాసనాల రూపకల్పనకు, ప్రజా సమస్యలు, అవసరాల ప్రస్తావనకు వేదికలుగా ఉండడం ఆగి పోయి రభసలు, రచ్చలు, వాయిదాలకు ఆలవాలంగా మారిపోయాయి. ఉత్తమ పార్లమెంటేరియన్లకు అవార్డులు ఇచ్చే సంప్రదాయం కొంత కాలంగా కొనసాగుతోంది. పార్లమెంటు సమావేశాలకు అంతరాయం అనివార్యం కావడం ఆగక పోతే నాలుగు రోజులు పోతే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇవ్వడానికి తగిన పార్లమెంటు సభ్యులే దొరకకపోవచ్చు. “ఉత్తమ” అన్న మాటకు నిర్వచనాన్ని మారస్తే తప్ప.

ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడూ బలహీనంగా ఉన్నప్పుడూ పార్లమెంటు సమావేశాలకు ఆటంకం నిత్యకృత్యమై పోయింది. స్పీకర్ ఎదుట స్థలానికి వెళ్లి గోల చేయడం ఇప్పుడు వెనక బెంచీల్లో కూర్చొనే వారికో, జబ్బ పుష్టిని, కంఠ సత్తువను ప్రదర్శించే వారికో పరిమితం కాలేదు. అగ్ర నాయకులే సభ మధ్యలోకి దూసుకెళ్తున్నారు. సభలో అరుదుగా నోరు తెరిచే సోనియాగాంధే ఆ పని చేయడం మరీ విడ్డూరం. ప్రతిపక్షాలు చర్చకు సిద్ధంగా లేవు గనకే సభా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం అధికార పక్షంగా ఉన్న పక్షమే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సరిగ్గా ఇలాగే వ్యవహరించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి తమకు ప్రజలు పట్టం కట్టారు గనక తమకు అడ్డుతగలకూడదని వాదిస్తోంది. ప్రజలు తమకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షాల వాదనను వినిపించుకోవాల్సిన అగత్యం లేదనుకునే ప్రభుత్వాలు కొనసాగుతున్న దురవస్థ ఇది.

భూపేశ్ గుప్తా, హిరేన్ ముఖర్జీ లాంటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే సభా ప్రాంగాణంలో ఎక్కడున్నా సభలోకి పరుగెత్తుకొచ్చే నెహ్రూ లాంటి పార్లమెంటరీ సంప్రదాయాల మీద మోహం ఉన్న వారు లేరు. మూడు వారాల పాటు సభ కొలువు దీరితే సభ మొహమే చూడని ప్రధానులు ఏలుతున్న కాలం ఇది. ఎంత గట్టిగా వాదించినా సభ మధ్యలోకి దూసుకెళ్లడం అమర్యాద అనుకునే ప్రతిపక్ష నాయకులూ ఇప్పుడు కరువే. వాజపేయి రాజ్య సభ సభ్యుడిగా ఉన్నప్పుడు సభలోకి ప్రవేశించగానే మొదట సీపీఐ నాయకుడు భూపేశ్ గుప్తా కూర్చున్న చోటకు వెళ్లి నమస్కరించి తన స్థానంలో ఆసీనులయ్యే వారు. వాజపేయి లాంటి “అమాయకులు” ఇప్పుడు కలికానికి కూడా కనిపించరు.
శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ప్రవర్తించిన తీరును లోక సభ టీవీలో చూపించాలని స్పీకర్ హుంకరించారు. అదే నోటితో 2010, 2012లో బీజేపీ పార్లమెంటును స్తంభింపచేసిన దృశ్యాలను కూడా లోక సభ టీవీలో చూపిస్తే ప్రజలకు చైతన్యం పెరుగుతుందిగా. అంత సాహసిక నిర్ణయం తీసుకునే స్వాతంత్ర్యం సుమిత్రా మహాజన్ కు కచ్చితంగా ఉండి ఉండదు.

1962 నుంచి 1967 దాకా రాష్ట్రపతిగా ఉన్న డా. సర్వేపల్లి రాధా కృష్ణన్ ప్రధానుల తీరు మారడాన్ని గురించి చెప్పారు. ఆయన నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే పనుల్లో 75 శాతం గురించి నాకు వివరించే వారు. శాస్త్రి హయాంలో అది 50 శాతానికి, ఇందిరా గాంధీ ఏలుబడిలో 25 శాతానికి దిగజారిందని రాధాకృష్ణన్ చెప్పారు. ఆ తర్వాత కాల చక్రంలో దాదాపు 50 ఏళ్లు గడిచాయి. “చట్ట సభలు సంవాదాలకు, చర్చలకు కాకుండా పోట్లాటలకు నిలయాలైనాయి” అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేసిన ఆవేదన వినిపించుకునే వారు ఉన్నారా! ఉంటారా! ఈ దుస్థితికి ప్రజలు బాధ్యులు కారు. రాజకీయ నాయకుల, రాజకీయ వ్యవస్థదే దోషం. రజకీయ పక్షాలు గుణపాఠం నెచుకోకపోతే ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాల గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సిందే.
-ఆర్వీ రామారావ్

First Published:  15 Aug 2015 1:38 AM GMT
Next Story