Telugu Global
Family

ఎర్రకోడి (For Children)

సుందర్‌ కాశ్మీర్‌ రైతు. చలికాలం నాలుగు నెలలు మంచుకురుస్తూ ఉండడంతో వ్యవసాయం సాగదు. పేదరైతులు కాశ్మీర్‌ పర్వత ప్రాంతం నించీ పంజాబు మైదానాల్లోకి వచ్చి పనుల్లో చేరి ఎంతో కొంత సంపాదించుకుని కాలం గడిపేవాళ్ళు. సుందర్‌ అట్లా శీతాకాలం పంజాబు ప్రాంతానికి వచ్చి ఏవో పనులు చేశాడు. ఎంతోకొంత సంపాదించాడు. ఎప్పటినించో అతనికి కోళ్ళఫారం పెట్టాలన్నది కోరిక. అతని మిత్రుడు కూడా అతన్ని ప్రోత్సహించేవాడు. సుందర్‌ పంజాబులో సంపాదించిన డబ్బుతో ఒక ఎర్రకోడి పెట్టను కొన్నాడు. దాన్ని […]

సుందర్‌ కాశ్మీర్‌ రైతు. చలికాలం నాలుగు నెలలు మంచుకురుస్తూ ఉండడంతో వ్యవసాయం సాగదు. పేదరైతులు కాశ్మీర్‌ పర్వత ప్రాంతం నించీ పంజాబు మైదానాల్లోకి వచ్చి పనుల్లో చేరి ఎంతో కొంత సంపాదించుకుని కాలం గడిపేవాళ్ళు.

సుందర్‌ అట్లా శీతాకాలం పంజాబు ప్రాంతానికి వచ్చి ఏవో పనులు చేశాడు. ఎంతోకొంత సంపాదించాడు. ఎప్పటినించో అతనికి కోళ్ళఫారం పెట్టాలన్నది కోరిక. అతని మిత్రుడు కూడా అతన్ని ప్రోత్సహించేవాడు. సుందర్‌ పంజాబులో సంపాదించిన డబ్బుతో ఒక ఎర్రకోడి పెట్టను కొన్నాడు. దాన్ని ఎంతో ప్రేమగా పెంచాడు. దానికి తనే గింజలు తినిపించేవాడు. అది ఎన్నో గుడ్లు పెట్టింది. కొన్ని అమ్మాడు. మరికొన్నింటిని పొడిగించాడు. మరిన్ని కోడిపిల్లలు సిద్ధమయ్యాయి. డబ్బు పెట్టి మరికొన్ని కోళ్ళు కొన్నాడు. మొదట చిన్ని కొట్టంలో కోళ్ళను పెట్టి పెంచాడు. కొన్నాళ్ళకు పెద్దకోళ్ళ ఫారం కట్టాడు. కోళ్ళ వ్యాపారం భారీ ఎత్తున చేశాడు. డబ్బు సంపాదించాడు.

గ్రామంలో అందరూ అతన్ని గౌరవించేవాళ్ళు. ఆహ్వానించేవాళ్ళు. తన కోరిక తీరి తను కోళ్ళఫారం పెట్టి ఈ స్థాయికి వచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

ఐతే అతను ఆ స్థాయికి వచ్చినా తనకు ఆరంభంలో ఆనందమిచ్చిన ఎర్రకోడిని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎర్రకోడిని వెంటబెట్టుకు వెళ్ళేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఎర్రకోడి గురించి చెప్పేవాడు.

కొన్నాళ్ళకు జనానికి అతనంటే విసుగుపుట్టింది. ఎందుకంటే కనిపించిన మరుక్షణం ‘ఎర్రకోడి’ అంటూ ఊదరగొట్టేవాడు. మొహమాటం కూడా వదిలి జనం తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు.

పైగా అతను వస్తున్నాడంటే ‘ఎర్రకోడి వస్తున్నాడు రోయ్‌’ అనేవాళ్ళు. జనం సుందర్‌ అన్న పేరే మరచిపోయారు. పెద్దలు, పిల్లలు, ఆడ, మగా అందరూ ‘ఎర్రకోడి’ అనే వాళ్ళు. దాంతో చిరాకు పడి సుందర్‌జనాల్ని కలవడం మానేశాడు. ఇంట్లోనే ఉండేవాడు. కనిపిస్తే ‘ఎర్రకోడి’ అంటారని కలవరపడిపోయాడు. గ్రామస్థులు అతని పరిస్థితి చూసి అతను కొంతకాలం ఆ ప్రాంతం వదిలి వేరే చోటుకు వెళితే జనం అలా పిలవడం మానేస్తారని సూచించారు.

ఆ సలహా నచ్చి సుందర్‌ పంజాబు ప్రాంతానికి వెళ్ళి వేరే వ్యాపారం ప్రారంభించాడు. స్థానికులతో స్నేహంగా మెలిగాడు. అందరూ అతన్ని గౌరవించారు. మూడేళ్ళు గడిచాయి. ఊరిమీద మనసు పోయింది. అందరూ తన ‘ఎర్రకోడి’ పేరు మరచిపోయి ఉంటారనుకుని బయల్దేరాడు.

ఇక తన గ్రామం పదిమైళ్లు ఉందనగా ఒక వ్యక్తి ఎదురయ్యారు. సుందర్‌ని చూశాడు. ఎక్కడికి వెళుతున్నావన్నాడు. ఫలానా గ్రామం వెళుతున్నానన్నాడు. అతను సుందర్‌ని ఎగాదిగా చూసి “నువ్వు ‘ఎర్రకోడి’లా వున్నావు. కొంపదీసి అతను నువ్వేకాదు కదా!” అన్నాడు.

ఆ మాటల్తో తన ఎర్రకోడి పేరు జనం మరచిపోయి ఉంటారనుకున్న సుందర్‌ హతాశుడయ్యాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటకు బదులివ్వకుండా అప్పుడే వెనుదిరిగి పంజాబు వెళ్లిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ జీవితంలో స్వగ్రామం వెళ్ళలేదు.

– సౌభాగ్య

First Published:  15 Aug 2015 1:02 PM GMT
Next Story