Telugu Global
Others

పిల్లల భవిష్యత్‌ని కాటేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌!

ప్ర‌భుత్వం స‌కాలంలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లించ‌క పోవ‌డంతో అందుకు విద్యార్ధులు మూల్యం చెల్లిస్తున్నారు.  తెలంగాణ‌ స‌ర్కార్ వైఫ‌ల్యంతో విద్యార్ధులు త‌మ విలువైన విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోతున్నారు. వివ‌రాల్లోకి వెళితే ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌వేశ పెట్టిన ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని తెలంగాణ స‌ర్కార్ కూడా కొన‌సాగిస్తోంది. అయితే, ప‌థ‌క నిర్వ‌హ‌ణ‌పై మాత్రం తీవ్ర అల‌స‌త్వం ప్రదర్శిస్తోంది. ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని డ‌బ్బులు లేవ‌ని సాకులు చెబుతూ కాలేజీల‌కు 2014-15 సంవ‌త్స‌రం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను ఇంకా విడుద‌ల […]

పిల్లల భవిష్యత్‌ని కాటేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌!
X
ప్ర‌భుత్వం స‌కాలంలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లించ‌క పోవ‌డంతో అందుకు విద్యార్ధులు మూల్యం చెల్లిస్తున్నారు. తెలంగాణ‌ స‌ర్కార్ వైఫ‌ల్యంతో విద్యార్ధులు త‌మ విలువైన విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోతున్నారు. వివ‌రాల్లోకి వెళితే ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌వేశ పెట్టిన ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని తెలంగాణ స‌ర్కార్ కూడా కొన‌సాగిస్తోంది. అయితే, ప‌థ‌క నిర్వ‌హ‌ణ‌పై మాత్రం తీవ్ర అల‌స‌త్వం ప్రదర్శిస్తోంది. ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని డ‌బ్బులు లేవ‌ని సాకులు చెబుతూ కాలేజీల‌కు 2014-15 సంవ‌త్స‌రం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను ఇంకా విడుద‌ల చేయ‌లేదు. దీంతో ఈ విద్యాసంవ‌త్స‌రంలో బీటెక్ వంటి ప‌లు ప్రొఫెష‌న‌ల్ కోర్సులు పూర్తి చేసి పై చ‌దువుల‌కు వెళ్లాల్సిన విద్యార్ధుల‌కు క‌ళాశాల‌లు స‌ర్టిఫికెట్‌లు ఇవ్వ‌డం లేదు. దీంతో విద్యార్ధుల త‌ల్లిదండ్రులు ఇంట్లోని న‌గ‌లు, పొలాలు అమ్మి ఫీజులు క‌ట్టి స‌ర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. నిరుపేద విద్యార్ధులు మాత్రం ప్ర‌భుత్వం మంజూరు చేసే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ విద్యాసంవ‌త్స‌రంలో సుమారు 23 వేల మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించ‌లేక స‌ర్టిఫికెట్‌లు తీసుకోలేదు. ఈ ఏడాది జ‌రిగిన ఎంసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో 38,882 మంది అర్హ‌త సాధించ‌గా, అందులో 16 వేల మంది మాత్ర‌మే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ చేయించుకున్నారంటే, ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. బీటెక్ విద్యార్ధులే కాదు ఈ ఏడాది ఫైన‌లియ‌ర్ పూర్తి చేసిన విద్యార్ధులంద‌రి ప‌రిస్థితీ ఇదే విధంగా ఉంది. ఇక‌నైనా ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని విద్యార్ధులు కోరుతున్నారు.
నిజానికి నిధులు సమస్య కాదు…
బకాయిలు విడుదల కాకపోవటానికి నిధుల కొరత కారణం కానేకాదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. నిధుల కొరతే నిజమైతే రైతుల రుణమాఫీ, పుష్కరాల నిర్వహణ, బతుకమ్మ, బోనాలు, రంజాన్‌ పండుగ సందర్భంగా నిధులెలా విడుదల చేశారంటూ ఆయా వర్గాలు ప్రశ్నించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే, నిధులు సమస్య కాదన్న అభిప్రాయం ఉంది. ఇదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం సుమారు రూ.300 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్స్‌ (బిఆర్వో) కూడా వెలువడ్డాయి. మరి మిగిలిన విద్యార్థుల సంగతి ఏమిటంటే సమాధానం చెప్పేవారే కరవవుతున్నారు. అంతా కేసీఆర్‌ దయ అంటూ నీళ్ళు నములుతున్నారు.
అసలు కారణాలు వేరు…
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సదభిప్రాయం లేదు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాకపోవటానికి ఇదే అసలు కారణం. అయినా కాలేజీలకు నిధుల విడుదల విషయంలో ఆయన లెక్కలాయనకు ఉన్నాయని తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమచారం ప్రకారం… ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిస్తున్నవారు, బిటెక్‌, ఎంటెక్‌ చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది సెటిలర్లు, ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే ఉన్నారని సిఎం భావిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిస్తే వీరికే లబ్ది చేకూరుతుంది..కదా? అని ఆయన భావిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అత్యధిక శాతం టిడిపి, బిజెపికి చెందిన నేతలు, వారి అనుయాయులు, మిత్రులు, సన్నిహితులకు చెందినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు బకాయిలు విడుదల చేస్తే లబ్ది చేకూరేది ఆ రెండు పార్టీల నాయకగణానికే కదా? ఇంతేగాకుండా టిడిపి, బిజెపి రెండూ ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు బద్ధ శత్రువులుగా ఉన్నాయి. అలాంటప్పుడు బకాయిలు విడుదల చేయటం ద్వారా రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు ఒరిగేదేముంది? అని సిఎం పేర్కొంటున్నట్లు సమాచారం. ఇక మూడో అంశం… తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చాలా వరకు బోగస్‌వే ఉన్నాయన్నది నగ్న సత్యం. ఈ కారణాలతోనే ఆయన నిధుల విడుదలకు మోకాలడ్డుతున్నారని తెలుస్తోంది. అయితే దాదాపు రెండు వేల కోట్ల బకాయిలున్నా ఒక్కపైసా కూడా విడుదల కాకపోవడాన్ని కాలేజీలు నిరసిస్తున్నాయి. సర్టిఫికెట్లు ఇచ్చేస్తే తమకు ఫీజులు ఎవరు చెల్లిస్తారని, విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవడం ఒక్కటే తమకున్న ఏకైక మార్గమని వారంటున్నారు.
First Published:  16 Aug 2015 3:00 AM GMT
Next Story