Telugu Global
Others

దుబాయ్ నుంచి భారత్‌కు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు!

70 వేల మంది పాల్గొన్న సభలో ప్రధాని నరేంద్రమోడి ప్రకటన దుబాయ్‌ నుంచి భారత్‌కు నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి అవకాశాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడి తెలిపారు. భారత్‌ను ఎల్లప్పుడూ మిత్రదేశంగానే దుబాయ్‌ పరిగణించడాన్ని ఆయన స్వాగతించారు. దుబాయ్‌ ప్రభుత్వమే కాదు… ఇక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు కూడా ఎల్లవేళలా భారత్‌కు అండగా ఉంటున్నారని ఆయన అన్నారు. పోఖ్రాన్‌ అణుపరీక్షల తర్వాత అగ్రరాజ్యాలు ఇష్టారీతిగా భారత్‌పై ఆంక్షలు విధించి దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తే… ఆ సమయంలో వాజ్‌పేయ్ […]

దుబాయ్ నుంచి భారత్‌కు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు!
X

70 వేల మంది పాల్గొన్న సభలో ప్రధాని నరేంద్రమోడి ప్రకటన

దుబాయ్‌ నుంచి భారత్‌కు నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి అవకాశాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడి తెలిపారు. భారత్‌ను ఎల్లప్పుడూ మిత్రదేశంగానే దుబాయ్‌ పరిగణించడాన్ని ఆయన స్వాగతించారు. దుబాయ్‌ ప్రభుత్వమే కాదు… ఇక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు కూడా ఎల్లవేళలా భారత్‌కు అండగా ఉంటున్నారని ఆయన అన్నారు. పోఖ్రాన్‌ అణుపరీక్షల తర్వాత అగ్రరాజ్యాలు ఇష్టారీతిగా భారత్‌పై ఆంక్షలు విధించి దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తే… ఆ సమయంలో వాజ్‌పేయ్ పిలుపుతో గల్ప్ దేశాల్లో ఉన్న భారతీయులు తమ ఖజానా నింపి ఆదుకున్నారని ప్రధాని నరేంద్రమోడి అన్నారు. భారతీయులు శక్తి మంతులుగా వెలుగొందాలని ఇక్కడి ప్రవాస భారతీయులు ఆకాంక్షించారని ప్రధాని మోడీ అన్నారు. దుబాయ్ మినీ ఇండియానే కాకుండా మినీ ప్రపంచం కూడానన్నారు. శీతల దేశాల్లోని ప్రజలు కూడా 50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నా ఇక్కడే ఉండేందుకు ఇష్టపడతారని పేర్కొన్నారు. దుబాయ్ మినీ భారత్‌గానే కాదు.. మినీ ప్రపంచంలా రూపాంతరం చెందిందన్నారు. అభివృద్ధి విషయంలో ఇక్కడ ఎలాంటి అయస్కాంతం ఉందో తెలియదు గానీ.. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి వాలుతోందని దుబాయ్‌నుద్దేశించి ప్రశంసలు గుప్పించారు. అరబ్ దేశాల పర్యటనలో భాగంగా సోమవారం దుబాయ్‌లోని క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. మోదీ ప్రసంగం వినేందుకు దాదాపు 70 వేల మంది ప్రవాస భారతీయులు స్టేడియానికి తరలివచ్చారు. దీంతో ఆ స్టేడియం మోడీ నామస్మరణతో మారు మోగింది. తొలుత భారత్ మాతాకీ జై అంటూ నినదించి ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోడీ.. స్టేడియంలోని భారతీయులను చూసి.. ‘నేను ఇక్కడ మినీ భారతదేశాన్ని దర్శిస్తున్నాను’ అని అన్నారు. గల్ఫ్‌లోని కార్మికుల్లో అత్యధికులు భారతీయులేనని ఇక్కడికివచ్చి ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్నారని ప్రవాసీలను మోడీ ప్రశంసించారు. ఇక్కడ అద్భుతమైన కట్టడాల్లో భారత్‌ కార్మికుల పని తనం ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు.
భారత్‌లో వర్షం పడితే దుబాయ్‌లో ఉన్న భారతీయుల మనసు ఉప్పొంగుతుందన్నారు. అదే సమయంలో భారత్‌లో ఏ ఆపద వచ్చినా దుబాయ్‌లో భారత వాసుల కంటిమీద కునుకు ఉండదని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి దుబాయ్‌కి 700లకు పైగా విమానాలు నడుస్తున్నాయని, ఇంతటి సౌకర్యం ఉన్న దేశానికి భారత ప్రధాని రావడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు. 34 ఏళ్ల తరువాత భారత్ ప్రధాని వచ్చినా దుబాయ్, అబుదాబి రాజులు ఎంతో అప్యాయంగా స్వాగతం పలికారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నాకు లభించిన గౌరవం కాదు… అంటూ 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన అరుదైన గౌరవంగా మోడీ అభివర్ణించారు. దేశంలోని తెలుగుసహా పలు భాషల్లో మాట్లాడి భారతీయులకు ప్రధాని నమస్కారం తెలిపారు. ఇక్కడి ప్రవాస భారతీయులు భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసలు గుప్పించారు. ఓవైపు సంప్రదాయం పేరుతో ఉగ్రవాదం పెచ్చురిల్లుతున్నప్పటికీ.. అబుదాబి రాజు తమ దేశంలో హిందూ మందిరం నిర్మించారని కీర్తించారు. ఈ విషయంలో ఆయనకు ఎంతో రుణపడి ఉంటామన్నారు. ప్రపంచంలోని భారతీయులందరూ దీనిని అభినందించాల్సిందేనన్నారు.

First Published:  17 Aug 2015 12:11 PM GMT
Next Story