మొక్కులు చెల్లించి వాగుకు బ‌లైన భ‌క్తులు 

గిరిజ‌న దైవం గుబ్బ‌ల మంగ‌మ్మ క‌రుణ‌తో లారీ కొన్నామ‌న్న ఆనందంతో మొక్కు తీర్చ‌డానికి వెళ్లిన ఓ కుటుంబంలోని ఇద్ద‌రితో స‌హా మ‌రో ముగ్గురు భ‌క్తుల‌ను కొండ‌వాగు మింగేసింది. విషాద‌క‌ర‌మైన ఈ సంఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బుట్టాయ‌గూడెం మండ‌లం కామ‌వ‌రం గ్రామ శివారులోని గుబ్బ‌ల మంగ‌మ్మ ఆల‌యం వద్ద జ‌రిగింది. విజ‌య‌వాడ మ‌ధురాన‌గ‌ర్‌కు చెందిన ఏనుగుల మంగ‌మ్మ‌కు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు లారీ కొనుగోలు చేయ‌డంతో కొడుకులు, కోడ‌ళ్లు, కూతురు, అల్లుడు, మ‌న‌మ‌ళ్లు క‌లిసి మంగ‌మ్మ ఆల‌యానికి బ‌య‌లుదేరి వెళ్లారు. ఆదివారం తెల్ల‌వారుజామున దేవాల‌యంలో పూజ‌లు జ‌రిపిస్తుండ‌గా, కొండ‌ల్లో కురుస్తున్న వ‌ర్షానికి అక‌స్మాత్తుగా వాగు పొంగి ఆల‌యం గుహ పైనుంచి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఊహించ‌ని సంఘ‌ట‌న‌తో భ‌క్తులు త‌లోదిక్కుకు ప‌రిగెత్తారు. కొంత‌మంది గ‌ట్టు పైకి చేరుకోగా సుమారు ఇర‌వై మంది వాగులో కొట్టుకు పోయారు. స్థానిక వ్యాపారులు ఐదుగురి మృత‌దేహాల‌ను ప‌ట్టుకున్నారు. వారిలో విజ‌య‌వాడ‌కు చెందిన ఏనుగుల మాధ‌వి (22), వేముల లోకేష్ (13), కృష్ణాజిల్లా అగిరిప‌ల్లి మండ‌లం నెక్క‌లం గొల్ల‌గూడెం గ్రామానికి చెందిన మారీదు న‌ర‌స‌మ్మ (62),  ఆకుల క‌ళ్యాణి (38), ఉప్ప‌ల‌పాటి దీప‌క్ సాయి (15) ఉన్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన వేముల ఉమాదేవి(40) ఇంకా కనిపించలేదు. తీవ్రంగా గాయ‌ప‌డిన ముగ్గుర్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వాగుకు ఎగువున చెక్ డ్యాం కూలిపోవ‌డంతో వ‌ర‌ద ఒక్క‌సారిగా విరుచుకు ప‌డింద‌ని స్థానికులు అంటున్నారు.