బ్యాంకాక్‌లో భారీ పేలుడు… 27 మంది దుర్మరణం

బ్యాంకాక్‌లోని ఓ హిందూ ఆలయం వెలుపల సోమవారం రాత్రి జరిగిన శక్తిమంతమైన పేలుడులో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రధాన వాణిజ్య కూడలిలో ఉన్న బ్రహ్మ దేవుడు (ఎరవన్) ఆలయం వద్ద జరిగిన ఈ భారీ పేలుడులో మరో నలుగురు విదేశీయులు సహా 117 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో భారతీయులు ఉన్నారా అనే విషయంపై స్పష్టమైన సమాచారమేమీ లేదని, మృతి చెందిన విదేశీయుల్లో ఇద్దరు చైనా, మరో ఇద్దరు ఫిలిఫైన్స్‌కు చెందిన వారని అధికారులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటన స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు చోటుచేసుకుంది. థాయ్‌ల్యాండ్‌ రాజధానిలో ఇలాంటి పేలుడు తొలిసారి చోటుచేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఘటనా స్థలమంతా హృదయ విదారకంగా మారింది. ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. పేలుడు ప్రభావంతో మోటారు వాహనాలన్నీ దగ్ధమయ్యాయి. ఆలయం ముందు మాంసం ముద్దలు ఇంకా ఉన్నాయని ఆయన అన్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన రెండో బాంబును నిర్వీర్యం చేయడంతో పెద్ద ముప్పు తప్పిందని, క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించామని అధికారులు తెలిపారు. 
బ్యాంకాక్‌లోని ప్రధాన వాణిజ్య కూడలి, మూడు షాపింగ్ మాల్స్, హయత్ ఫైవ్‌స్టార్ హోటల్‌కు సమీపంలో ఉన్న ఎరవన్ ఆలయాన్ని ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు, విదేశీ పర్యాటకులు సందర్శిస్తారు. పేలుడుకు ఉపయోగించిన బాంబు టీఎన్‌టీ బాంబే. పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి, విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అని థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి ప్రవిత్ వాంగ్‌సువాంగ్ మీడియాతో అన్నారు. మోటారు వాహనానికి బాంబు బిగించి బాంబును పేల్చివేశారని, ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మరికొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కొద్దికాలంగా రాజకీయ అనిశ్చితి వెంటాడిన నేపథ్యంలో గతేడాది మే నెల నుంచి సైన్యం పర్యవేక్షణలో పాలన కొనసాగుతోంది. కాగా బాంబు పేలుడు ఘటనను ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ బాంబుదాడిని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.