టీ.సర్కార్ కు ‘ఐటీ’ తలనొప్పులు

తెలంగాణ ప్రభుత్వానికి ఐటీ శాఖ తలనొప్పులు పట్టుకున్నాయి. తాజాగా హెచ్ఎండిఎ, కాకతీయ, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీతోపాటు మరికొన్ని కార్పొరేషన్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. వందల కోట్ల రూపాయల పన్నులు కట్టాల్సిందేనని.. లేకపోతే ఆస్తులను జప్తు చేస్తామని ఐటీ శాఖ హెచ్చరించింది. ఐటీ శాఖ నోటీసులతో తెలంగాణ ఆర్థికశాఖ ఆందోళనలో పడింది. ఇప్పటికే బ్రెవరేజ్‌ కార్పొరేషన్‌ నుంచి 1274 కోట్లు జప్తు చేసిన ఇన్‌కం టాక్స్‌ శాఖ తాజాగా హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, కాకతీయ అర్బన్‌ డెవ్‌లప్‌మెంట్‌ అథారిటీ తదితర సంస్థలకు నోటీసులు జారీ చేయడంతో టీ-సర్కారుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు విడుదల చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైగా ఇప్పటివరకు ఇచ్చిన నిధులకు లెక్కలు చెబితే తప్ప భవిష్యత్‌ నిధులు విడుదల చేయబోమని స్పష్టంగా కేంద్రం తేల్చి చెప్పింది. దాంతో అధికారులు ఆ లెక్కలను తీసే పనిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి.