శ్రీ‌నివాస‌నాయుడు మెడ‌కు ఓటుకు కోట్లు

నోటీసులు జారీ చేసిన తెలంగాణ ఏసీబీ
ఓటుకు కోట్లు కేసులో ఊహించ‌ని విధంగా కొత్త కొత్త ముఖాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు డీకే శ్రీనివాసనాయుడికి  ఏసీబీ నోటీసులు జారీచేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. సీఆర్పీసీ 160 ప్రకారం ఆయ‌న‌కు నోటీసుల‌ను అందించిన‌ట్లు తెలంగాణ ఏసీబీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటక బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ సంస్థకు ఎండీగా ఉన్న శ్రీనివాసనాయుడికి ఏసీబీ సోమవారం బెంగుళూరులోని ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేసింది. ప్రస్తుతం శ్రీనివాసనాయుడు స్విట్జర్లాండ్‌లో ఉన్నారని, దీంతో ఆయన కార్యాలయంలో నోటీసులు అందించామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. శ్రీనివాసనాయుడుతోపాటు ఆయన సహాయకుడు విష్ణుచైతన్యకు కూడా నోటీసులు జారీచేసినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిని మంగళవారం సాయంత్రం 5గంటలకల్లా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించామని తెలిపారు. రెండ్రోజుల్లో ఏసీబీ ఎదుట తాను విచారణకు హాజరవుతానని సన్నిహితులకు శ్రీనివాసనాయుడు ఫోన్‌లో చెప్పారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు జిల్లాకు చెందిన శ్రీనివాసనాయుడుకు నోటీసులివ్వడంతో టీడీపీ వర్గాలు కంగుతిన్నాయి. కర్ణాటకలో మద్యం వ్యాపారంలో ఉన్న‌ డీకే శ్రీనివాసనాయుడుడికి పక్కా ఆధారాలతోనే ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. విచారణలో శ్రీనివాసనాయుడు వెల్లడించే విషయాలతో రూ.50లక్షల వ్యవహారంతో పాటు రూ.4.5కోట్ల సంగతి కూడా తేలిపోతుందని ఏసీబీ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. స్టీఫెన్‌సన్‌తోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను కొనాలన్న టీడీపీకుట్రకు శ్రీనివాసనాయుడు కంపెనీ నుంచే నగదు సరఫరా జరిగిందన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నార‌ని అర్ధ‌మౌతోంది.  ఈ కేసులో నగదు వ్యవహారాన్ని ఛేదించేందుకు శ్రీనివాసనాయుడుతోపాటు ఆయన అసిస్టెంట్ విష్ణుచైతన్యను విచారించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఏసీబీ వ‌ర్గాలు చెబుతున్నాయి.