శ్రీలంకలో అధికారపార్టీకే మరోసారి పట్టం

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ యూఎన్‌పీ మరోసారి విజయం సాధించింది. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్‌లో 196 స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగాయి. అధికార యునైటెడ్ నేషనల్ పార్టీ యూఎన్‌పి 106 స్థానాలు గెలుచుకొని అధికారం కైవసం చేసుకోనుంది. తమిళ్ నేషనల్ అలయెన్స్ పార్టీతో పాటు ఇతర చిన్న పార్టీల సహకారంతో యూఎన్‌పి సునాయాసంగా అధికారం చేపట్టనుంది. అధికారం కోసం ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నేత రాజపక్సకు మరోసారి పరాభవం ఎదురైంది. యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ పార్టీ యూపీఎఫ్‌ఏ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన రాజపక్సకు నిరాశే మిగిలింది. రాజపక్స ఎంపీగా గెలిచినా ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీఎఫ్‌ఏ‌కు 83 స్థానాలు మాత్రమే దక్కాయి. 2004-2005 కాలంలో శ్రీలంక ప్రధానిగా ఉన్న రాజపక్స ఆ తర్వాత 9 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఆ సమయంలోనే ఎల్‌టిటిఈపై పోరు పేరుతో ఆ సంస్థ అధినేత ప్రభాకరన్‌ను, అతడి కుమారుడ్ని సైన్యంతో చంపించారు. అదే సమయంలో లంక తమిళులను ఊచకోత కోయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. శ్రీలంకకు ఎల్‌టిటిఈ పీడ విరగడయ్యేలా చేసినందుకు తనకు మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవి కొనసాగుతుందనే భ్రమతో మధ్యంతర ఎన్నికలు జరిపించారు. అయితే ప్రజలు ఆయన్ను నమ్మలేదు. చిత్తుగా ఓడించారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రాజపక్స నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఈ నెల 17న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనకు షాక్‌నిచ్చే ఫలితాలు వెలువడ్డాయి. అటు ఎన్నికల్లో యూఎన్‌పి విజయం సాధించినందుకు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందించారు.