29న బంద్‌ విజయవంతానికి జగన్‌ వ్యూహరచన

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ ఈనెల 29న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహరచన ప్రారంభించింది.  ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేస్తున్నారు. బంద్‌ను విఫలం చేయడానికి అధికార పార్టీ వేసే ఎత్తులను ఎదుర్కొవటంపై వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ అదే వేడిని కొనసాగిస్తూ కేంద్ర, రాష్ర్టాల వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఈ అంశంపై ప్రత్యేకం దృష్టి సారించిన జగన్‌ బంద్‌ను విజయవంతం చేసే బాధ్యతను వ్యక్తిగతంగా అప్పగించారు. ఇందులో భాగంగానే 13 జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించారు. జిల్లాల్లో గ్రూప్‌ రాజకీయాల నేపథ్యంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని, ఐకమత్యంతోనే బంద్‌ను విజయవంతం చేయగలమని పార్టీ ముఖ్యులకు జగన్‌ సూచించారు. దీనిలో భాగంగా 13 జిల్లాల ప్రతినిధులను ప్రకటించారు. విశాఖ జిల్లాకు విజయసాయిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు ధర్మాన ప్రసాదరావు, పశ్చిమగోదావరి జిల్లాకు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కృష్ణాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుంటూరుకు బొత్స సత్యనారాయణ, ప్రకాశం జిల్లాకు గోవిందరెడ్డి, నెల్లూరుకు వైవీ సుబ్బారెడ్డి, చిత్తూరు జిల్లాలకు రవీంధ్రనాథ్‌ రెడ్డిలకు జగన్‌ బాధ్యతలు అప్పగించారు.