నోటుకు సాయం చేశారా?

ఓటుకు నోటు కుంభ‌కోణంలో మీ పాత్ర ఏంటి?   రేవంత్‌రెడ్డి అరెస్టైన మే 31, అంత‌క‌ముందు రోజు మీతో ఆయ‌న ఏం మాట్లాడారు? డ‌బ్బు విష‌యంలో మీరేమైనా సాయం చేశారా? ఇవీ… మాజీఎంపీ ఆదికేశ‌వులు నాయుడు, ప్ర‌స్తుతం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే స‌త్య‌ప్ర‌భ కుమారుడు శ్రీ‌నివాసులు నాయుడికి ఏసీబీ సంధించిన‌ ప్ర‌శ్న‌లు. ఓటుకు నోటుకు కుంభ‌కోణం కేసులో విచార‌ణ‌కు రావాల‌ని 3 రోజుల క్రితం బెంగ‌ళూరులోని ఆయ‌న కార్యాల‌యంలో తెలంగాణ ఏసీబీ పోలీసులు నోటీసులు అందించిన సంగ‌తి తెలిసిందే! విచార‌ణ‌లో భాగంగా ఆయ‌న మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఏసీబీ కార్యాల‌యానికి హాజ‌ర‌య్యారు. కానీ, ఆయ‌న పీఏ విష్ణు చైత‌న్య డుమ్మా కొట్టాడు. ఏసీబీ అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కు శ్రీ‌నివాసులు నాయుడు స‌మాధానాలు దాట‌వేసిన‌ట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి త‌న‌కు మామూలు మిత్రుడేన‌ని ఇంత‌కు మించి ప్ర‌త్యేక‌త ఏమీలేద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే మే 30, 31లో రేవంత్ మీకు ఎక్కువ‌గా ఎందుకు కాల్ చేశార‌ని ప్ర‌శ్నించ‌గా శ్రీ‌నివాసులు నాయుడు మౌనం వ‌హించిన‌ట్లు తెలిసింది. విచార‌ణ‌కు రావాల్సిన పీఏ విష్ణు చైత‌న్య గైర్హాజ‌రీపైనా పొంత‌న‌లేని స‌మాధానాలు చెప్పాడని స‌మాచారం. దీంతో కావాల‌నే విచార‌ణ‌కు విష్ణు చైత‌న్య డుమ్మా కొట్టిన‌ట్లు ఏసీబీ అనుమానిస్తోంది. దాదాపు 7 గంట‌ల‌పాటు సాగిన సుదీర్ఘ విచార‌ణ‌లో శ్రీ‌నివాసులు నాయుడు చెప్పిన స‌మాధానాల‌తో ఏసీబీ సంతృప్తి చెందిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. విష్ణు చైత‌న్య డుమ్మా కొట్ట‌డంపై ఏసీబీ ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తోంది. ఈ కేసులో ఏ ఇద్ద‌రికి నోటీసులు జారీ చేసినా ఒక వ్య‌క్తి మాత్ర‌మే విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న తీరును గుర్తు చేసుకుంటోంది. ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు ఒకే ర‌క‌మైన ప్ర‌శ్న‌ల‌ను వేర్వేరు గ‌దుల్లో కూర్చోబెట్టి వేస్తారు. వాటికి భిన్న‌మైన స‌మాధానాలు వ‌స్తే.. ఏసీబీకి చిక్కిపోతార‌న్న భ‌యంతోనే ఈకేసులో సాక్షులు, నిందితులు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది ఏసీబీ ప్ర‌ధాన అనుమానం.  పీఏ విష్ణు చైత‌న్య విచార‌ణ‌కు వ‌చ్చేలా త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై ఏసీబీ దృష్టి సారించింది.