Telugu Global
Family

గ్రహణం-మంత్రం (For Children)

ఒక బ్రాహ్మణుడు, అతనికొక శిష్యుడు. శిష్యుడు గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ గురుశుశ్రూష చేస్తూ కాలం గడిపేవాడు. ఒకరోజు సాయంత్రం గురుశిష్యులిద్దరూ అరణ్యానికి బయల్దేరారు. గ్రామం వదిలి కొంత దూరం వెళ్ళేసరికి చీకటిపడింది. అడవిలో అడుగుపెట్టారు. అంతలో హఠాత్తుగా నలుగురు దొంగలు చెట్ల వెనక నించీ వచ్చి గురుశిష్యుల్ని బంధించారు. వారి నాయకుడి దగ్గరకు తీసుకెళ్ళారు. వారి నాయకుడి ముందే గురుశిష్యుల్ని చూసి మీ దగ్గరున్న డబ్బు ఇవ్వమన్నాడు. వారి దగ్గర ఏమీలేదు. కానీ నాయకుడు వాళ్ళని […]

ఒక బ్రాహ్మణుడు, అతనికొక శిష్యుడు. శిష్యుడు గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ గురుశుశ్రూష చేస్తూ కాలం గడిపేవాడు. ఒకరోజు సాయంత్రం గురుశిష్యులిద్దరూ అరణ్యానికి బయల్దేరారు. గ్రామం వదిలి కొంత దూరం వెళ్ళేసరికి చీకటిపడింది. అడవిలో అడుగుపెట్టారు.

అంతలో హఠాత్తుగా నలుగురు దొంగలు చెట్ల వెనక నించీ వచ్చి గురుశిష్యుల్ని బంధించారు. వారి నాయకుడి దగ్గరకు తీసుకెళ్ళారు. వారి నాయకుడి ముందే గురుశిష్యుల్ని చూసి మీ దగ్గరున్న డబ్బు ఇవ్వమన్నాడు. వారి దగ్గర ఏమీలేదు. కానీ నాయకుడు వాళ్ళని వదలదలచుకోలేదు. అప్పుడు వారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. శిష్యుడు గ్రామానికి వెళ్ళి డబ్బు తీసుకుని వస్తే గురువును వదిలి పెడతామని చెప్పారు.

శిష్యుడు గ్రామానికి బయల్దేరుతూ గురువు దగ్గరికి వెళ్ళి చెవిలో మెల్లగా ‘గురువుగారూ! నేను వచ్చేదాకా తొందరపడి ఆ మంత్రం చెప్పకండి. ఈ రాత్రే చంద్రగ్రహణం. ఈ దొంగల ముందు మీరు ఆ మంత్రం చెబితే దానివల్ల మీ ప్రాణాలకే ముప్పు జాగ్రత్త’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

గురువును చెట్టుకు కట్టేశారు. మెల్లగా చంద్రగ్రహణం ప్రారంభమయింది. గురువు ఆలోచనలో పడ్డాడు. శిష్యుడు వెళ్ళి డబ్బు తీసుకురావడం ఆలస్యం కావచ్చు. ఆలోగా ముహూర్తం మించిపోవచ్చు అనుకున్నాడు.

గురువుకు ఒక మంత్రం వచ్చు. అది చంద్రగ్రహణం రోజున ఆకాశంలోకి చూసి ఆ మంత్రం చెబితే ఆకాశంనించీ పిడికెడు వజ్రాలు నేలరాలుతాయి. ఆ మంత్రం సంవత్సరానికి ఒకసారి చంద్రగ్రహణమప్పుడే పనిచేస్తుంది. బ్రాహ్మణుడు తన శిష్యుడితో ప్రతి సంవత్సరం చంద్రగ్రహణమప్పుడు అడవికి వచ్చి ఆ మంత్రోచ్ఛాటన చేసి వజ్రాలు ఏరుకుని పోతాడు. సంవత్సరమంతా వాటిలో నిశ్చింతగా గడుపుతాడు.

శిష్యుడు రావడం ఆలస్యమయింది. ముహూర్తం మించిపోతోంది. బ్రాహ్మణుడు ఆగలేకపోయాడు. దొంగల నాయకుణ్ణి పిలిచి ‘నాకు ఒక మంత్రం తెలుసు. అది చంద్రగ్రహణం రోజు చెబితే ఆకాశం నించీ ఒక పిడికెడు వజ్రాలు నేలరాలుతాయి. వాటిని తీసుకుని మీరు నన్ను వదిలిపెడతారా?’ అన్నాడు.

దొంగల నాయకుడు దాందేముంది. తప్పక వదిలిపెడతాం అన్నాడు. దొంగలంతా చిత్రంగా చూశారు.

ఆకాశం వేపు తిరిగి బ్రాహ్మణుడు ఏవో మంత్రాలు చదివాడు. చిత్రంగా మంచుపూలు కురిసినట్లు పిడికెడు వజ్రాలు ఆకాశం నించీ నేలపై పడ్డాయి. దొంగలు ఆశ్చర్యపోయారు. ఆ వజ్రాల్ని ఏరుకుని బ్రాహ్మణుణ్ణి వదిలిపెట్టారు. ‘నేను ఇక వెళ్ళవచ్చా?’ అన్నాడు.

‘నీ ఇష్టమొచ్చిన దిక్కుకు వెళ్ళు’ అన్నారు. దొంగలు కూడా తమ దారంట తాము వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అంతలో పెద్దగా గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. పెద్దదొంగల గుంపు వాళ్ళని చుట్టుముట్టింది. వీళ్ళు మామూలు దొంగలు. కానీ వచ్చినవాళ్ళు గజదొంగలు.

ఆ పెద్దదొంగలు వీళ్ళని చుట్టుముట్టారు. ఈ దొంగలనాయకుడి దగ్గర ఉన్న వజ్రాల సంచి లాగాడు. ఇతను ఇవ్వలేదు. ఆ దొంగలు ఈ దొంగలు తలపడ్డారు. బ్రాహ్మణుడు మెల్లగా జారుకోడానికి ప్రయత్నించాడు. ఈ దొంగల నాయకుడు ‘మాకు వజ్రాలిచ్చింది ఆ బ్రాహ్మణుడే. ఆకాశంలోకి చూసి వజ్రాల వాన కురిపించాడు’ అన్నాడు. గజదొంగల్లో కొందరు బ్రాహ్మణుడి వెంటపడి పట్టుకున్నారు.

తక్కిన దొంగల మధ్య ఘర్షణ జరుగుతోంది. కత్తుల్తో నరుక్కుంటున్నారు. దొంగలు బ్రాహ్మణుణ్ణి మంత్రాలు చెప్పమన్నారు. బ్రాహ్మణుడు అవి పనిచెయ్యవు. చంద్రగ్రహణమప్పుడు అదీ సంవత్సరానికొక్కసారే పనిచేస్తాయన్నాడు. వాళ్ళు వినకుండా బ్రాహ్మణుడిపై కోపంతో కడుపులో పొడిచారు.

ఈ మధ్యలో వజ్రాలకోసం ఎవరికి వారే ఇంకొకరిపై దాడికి దిగారు. నరుక్కున్నారు. చంపుకున్నారు. చివరికి ఎవరూ మిగల్లేదు. అందరూ చనిపోయారు.

తెలతెలవారుతుండగా శిష్యుడు వచ్చాడు. ఎక్కడ చూసినా శవాల గుంపులే. ఆశ్చర్యంతో అందర్నీ చూసుకుంటూ గురువు శవాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దగ్గర్లోనే కనిపించిన వజ్రాలు సంచిని చూసి జరిగిన విషయం ఊహించుకున్నాడు. వజ్రాల సంచి తీసుకుని నిట్టూరుస్తూ గ్రామానికి తిరుగు ముఖం పట్టాడు.

– సౌభాగ్య

First Published:  18 Aug 2015 1:02 PM GMT
Next Story