ప్రధానోపాధ్యాయుల ప్రేమాయణం!

ప్రేమ గుడ్డిది… ఈ ఇద్దరు హెడ్మాస్టర్ల విషయంలో ఈ నానుడి అక్షరాలా నిజం. ఎందుకంటే వారి ప్రేమకు అడ్డుగా ఉంటారనే కారణంతో విద్యార్థులందరికీ సెలవు మంజూరు చేసేశారు. మామూలుగా ఎప్పటి మాదిరిగానే స్కూలు ప్రారంభమైంది. ఈలోగా వేరే పాఠశాలలో హెడ్మాస్టరుగా పని చేస్తున్న ప్రియురాలు ఈ స్కూలుకు వచ్చింది. ఇంకేముంది… ఈ హెడ్మాస్టరుగారి మనసు ప్రేమలో తేలిపోయింది. దాంతో ఉదయం పది గంటలకు స్కూలుకు వచ్చిన పిల్లల్ని సెలవు ప్రకటించి ఇంటికి పంపేశాడు. ఈ ఇద్దరు హెడ్మాస్టర్లు కలిసి స్కూలుకు లోపలి నుంచి గొళ్ళెం పెట్టుకుని ప్రేమ విహారం చేస్తున్నారు. పిల్లలు అనుకోకుండా ఇంటికి వచ్చేయడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని స్కూలుకు వెళ్ళిన తల్లిదండ్రులకు విషయం బోధపడింది. ఈ ఇద్దరు హెడ్మాస్టర్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఈ ఇద్దరినీ పోలీసులకు అప్పగించి లవ్‌లో ఎంత డెప్త్‌లో ఉన్నారో తెలుసుకోమన్నారు. ఈ సంఘటన యూపీలోని మీరట్‌ జిల్లా బిజనోర్‌ గ్రామంలో జరిగింది. పబ్లిక్ ప్లేస్‌లో ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలిన ఈ ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై 294 సెక్షన్‌ కింది కేసు నమోదు చేశారు. తరగతి గదుల్లోనే ప్రేమాయణం సాగించిన ఈ ఇద్దరినీ విద్యాశాఖ విధుల నుంచి తప్పించింది. అయితే ‘మేమెలాంటి తప్పు చేయలేదని… జస్ట్‌ తలుపులు మూసుకుని మాట్లాడుకున్నామంతే’ అంటూ ఈ ఇద్దరు టీచర్లు వాదించడం కొసమెరుపు!