ర్యాగింగ్‌కు రాలిన మరో విద్యాకుసుమం

వరుసగా విద్యాసుమాలు రాలిపోతున్నాయి. మొన్న గుంటూరు… నిన్న కడప… ఇప్పుడు నెల్లూరు… ప్రాంతాలు వేరైనా చనిపోతున్నది విద్యార్ధినీలే. కొందరు ర్యాగింగ్, మరికొందరు ఒత్తిడి…. కారణం ఏదైనా అమాయక అమ్మాయిలు సమిధలవుతున్నారు. గుంటూరు, కడప ఘటనలు మరవక ముందే… నెల్లూరులో మరో దారుణం జరిగింది. రాపూరు మండలం పెనుబర్తికి చెందిన రవళి అనే విద్యార్థిని గూడూరులోని డిఆర్‌డబ్ల్యు డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో రవళి తను ఉంటున్న హాస్టల్‌లో ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణం వల్లే ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థినులు అంటున్నారు. మరోవైపు రవళి మృతిపై ఎస్ఎఫ్ఐ, ఎబివిపితోపాటు పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో గూడురులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, విద్యార్థిసంఘాల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థిసంఘం నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు.