యనమల వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌

ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడి వెటకారంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఘాటుగానే స్పందించారు. ఇప్పటివరకు సుతిమెత్తగా ట్వీట్లు చేస్తున్న ఆయన ఒక్కసారిగా తన మాటలకు పదును పెట్టారు. తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకువెళితే విజ్ఞతతో స్పందించడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చేయడం వారికే చెల్లిందంటూ విమర్శలు గుప్పించారు. తాను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామలను సందర్శించి అక్కడి రైతులను కలుస్తానని తన ట్విట్టర్‌ సందేశంలో పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. స్టుడియోలు నిర్మించుకోవడానికి భూములు తీసుకుని నిర్మాణాలు చేసుకోలేదా అన్న యనమల మాటలకు కూడా ఆయన అంతే ధీటుగా సమాధానం చెప్పారు. తనకు హైదరాబాద్‌ కొండల్లోగాని, విశాఖపట్నం కొండల్లోగాని స్టుడియోలు లేవని స్పష్టం చేశారు. అయినా ‘స్టుడియోలకు ఇచ్చినవి హైదరాబాద్‌లో కొండలే కాని బహుళ పంటలు పండే పంట భూముల కాదు… ఇది రామకృష్ణుడిగారికి తెలియదనుకుంటా’ అంటూ చురక అంటించారు. అసలు ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా… రెగ్యులర్‌ స్వర్గమా అనేది తర్వాత ఆలోచించవచ్చని అన్నారు. మొత్తం మీద యనమల వెటకారానికి జనసేన అధినేత ఘాటుగానే సమాధానం చెప్పారు. బహుళ పంటలు పండుతున్న సారవంతమైన భూములున్న ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో భూ సేకరణ చట్టం ప్రయోగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభ్యర్థిస్తూ బుధవారం చేసిన ట్విట్‌కు యనమల స్పందించిన తీరు వపన్‌కల్యాణ్‌కి ఆగ్రహం తెప్పించిందన్న విషయం ఇపుడు పవన్‌ ట్వీట్‌తో స్పష్టమవుతోంది.
పవన్‌ ప్లెక్సీలకు పాలాభిషేకం
జనసేనానికి తుళ్లూరు జనం నీరాజనం పలుకుతున్నారు. రాజధాని ప్రాంతంలో… భూ సేకరణ వద్దన్న పవన్ ప్లెక్సీలకు పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. రైతులకు అండగా నిలిచినందుకు బేతపూడి, పెనుమాక, ఉండవల్లిలో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తమకోసం పోరాడుతున్న పవన్‌ కల్యాణ్‌ను దైవంతో సమానంగా కొలుస్తున్నారు. ‘మా దేవుడు నువ్వేనయ్యా… మాకోసం వచ్చామయ్యా’ అంటూ ఆయన అభిమానులు హడావుడి చేస్తున్నారు.