Telugu Global
Family

ఎవరుగొప్ప? (Devotional)

రెండు రాజహంసలు ఆకాశంలో ఎగురుతూ ఒక రాజు అంత:పురం పైగా సాగుతున్నాయి. అది ఆ రాజ్యానికి రాజయిన జానశ్రుతి అన్న రాజు అంతఃపురం. ఆ రాజు ధార్మికుడు. ఎన్నో దాన ధర్మాలు చేసి ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించేవాడు. అతని కీర్తి లోకమంతా వ్యాపించింది. రెండు హంసల్లో మొదటిది రెండో హంసతో “ఈ జానశ్రుతి రాజు ధర్మ ప్రభువు. అతని ఆధ్యాత్మిక కాంతి అంతఃపురంనించీ ఆకాశం దాకా సాగుతోంది. దాని పక్క గుండా వెళదాం” అంది. రెండో హంస […]

రెండు రాజహంసలు ఆకాశంలో ఎగురుతూ ఒక రాజు అంత:పురం పైగా సాగుతున్నాయి. అది ఆ రాజ్యానికి రాజయిన జానశ్రుతి అన్న రాజు అంతఃపురం. ఆ రాజు ధార్మికుడు. ఎన్నో దాన ధర్మాలు చేసి ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించేవాడు. అతని కీర్తి లోకమంతా వ్యాపించింది.

రెండు హంసల్లో మొదటిది రెండో హంసతో “ఈ జానశ్రుతి రాజు ధర్మ ప్రభువు. అతని ఆధ్యాత్మిక కాంతి అంతఃపురంనించీ ఆకాశం దాకా సాగుతోంది. దాని పక్క గుండా వెళదాం” అంది.

రెండో హంస “ఈయన గొప్పదనమేమిటి? రైక్వుని ఆధ్యాత్మిక శక్తిముందు ఇతని కీర్తి ఎందుకూ పనికిరాదు. పాడుపడిన బండికింద ప్రశాంతంగా, అజ్ఞాతంగా నివసించే రైక్వుని ముందు ఈ రాజెంత?” అంది.

ఆ మాటలు అంతఃపురంలో ఉన్న రాజు విన్నాడు. ఎవరీ రైక్వుడు? నన్నుమించిన వాడా? ఎట్లాగయినా అంతగొప్పవ్యక్తిని కలవాలి అనుకుని ఉదయాన్నే తన అధికారుల్ని ఆ రైక్వమహామునిని వెతకడానికి దేశం నలుమూలల పంపించాడు. గొప్పపండితులు, సన్యాసులు ఉన్న ఎన్నిచోట్ల వెతికినా రైక్వుని జాడలేదు. చివరికి ఒక మారుమూల గ్రామంలో చిరిగిన బట్టల్తో ఒక పాడుపడిన బండికింద పడుకున్న రైక్వుణ్ణి అధికారులు చూశారు. వచ్చి రాజుకు విన్నవించారు.

మొత్తానికి రైక్వుని జాడ కనిపెట్టినందుకు రాజు సంతోషించి వారిని సత్కరించాడు. వెంటనే వెళ్ళి రైక్వుణ్ణి కలుసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. మంది మార్బలంతో, ధన కనక వస్తువాహనాలతో రాజు ఆడంబరంగా బయలుదేరాడు. ఆ మారుమూల గ్రామం చేరాడు. అక్కడ ఒక పాడుపడిన బండి కింద పడుతున్న రైక్వుని చూసి విస్తుపోయాడు. అతని నిరడంబరత్వాన్ని చూసి నివ్వెరపోయాడు.

“స్వామీ! దయచేసి ఈ పట్టువస్త్రాలని, ఈ బంగారు నాణేల్ని స్వీకరించండి” అని రాజు అభ్యర్ధించాడు. ఆ ఆడంబరాన్ని చూసి నవ్వి రైక్వమహాముని “రాజా! నిరాడంబర జీవితం గడిపే, నిత్య దైవ చింతనలో మునిగే నాకు ఈ భౌతిక సుఖాలు ఎందుకు? వీటి అవసరం లేదు” అన్నాడు.

కొంతసేపు అక్కడే మౌనంగా ఉండి ఏమీ తోచక రాజు తిరుగు ప్రయాణమయ్యాడు. కొంత కాలం గడిచాకా సాధారణ వేషంలో నిరాడంబరంగా పాదచారిగా రాజు తిరిగి రైక్వమహాముని ఉన్న చోటికి వచ్చాడు.

అప్పుడు రైక్వుడు లేచి రాజును ఆహ్వానించి తన పక్కన కూచోబెట్టుకుని ధార్మిక విషయాలు చర్చించాడు. ఆధ్యాత్మిక విషయాల్ని వివరించాడు. సత్యానికి ఆడంబరానికి ఉన్న హస్తిమశకాంతరభేదాన్ని విశ్లేషించాడు.

ఆ మహాముని బోధనల ద్వారా రాజు మనసు ఆనందించింది. “స్వామీ! అప్పుడప్పుడు మిమ్మల్ని దర్శించి మీ బోధనలు వినే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి” అన్నాడు రాజు. మహర్షి మందహాసంతో ఆమోదం తెలిపాడు.

– సౌభాగ్య

First Published:  20 Aug 2015 1:01 PM GMT
Next Story