Telugu Global
Family

ఇత్తడి పాత్రలు (For Children)

ఒక యువకుడు పని వెతుక్కుంటూ ఒక గ్రామానికి వచ్చాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ గ్రామంలోనే ఉండిపోయాడు. గ్రామస్థులతో స్నేహంగా ఉంటూ చేదోడువాదోడుగా ఉంటూ అందరితో మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. ఆ యువకుడు చాలా చురుకయినవాడు. ఎంత పెద్ద సమస్యనయినా చిటికెలో పరిష్కరించేవాడు. అందరూ అతన్ని సలహాలు కోరేవారు. ఇట్లా కొంతకాలం గడిచింది. ఆ యువకుడు ఏదో అవసరముండి పక్కింటి వాళ్ళని ఇత్తడిపాత్రలు రెండు ఉంటే ఇమ్మన్నాడు. కొద్దిగా పని ఉంది. అది అయ్యాక రెండ్రోజుల్లో […]

ఒక యువకుడు పని వెతుక్కుంటూ ఒక గ్రామానికి వచ్చాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ గ్రామంలోనే ఉండిపోయాడు. గ్రామస్థులతో స్నేహంగా ఉంటూ చేదోడువాదోడుగా ఉంటూ అందరితో మంచివాడని పేరు తెచ్చుకున్నాడు.

ఆ యువకుడు చాలా చురుకయినవాడు. ఎంత పెద్ద సమస్యనయినా చిటికెలో పరిష్కరించేవాడు. అందరూ అతన్ని సలహాలు కోరేవారు. ఇట్లా కొంతకాలం గడిచింది.

ఆ యువకుడు ఏదో అవసరముండి పక్కింటి వాళ్ళని ఇత్తడిపాత్రలు రెండు ఉంటే ఇమ్మన్నాడు. కొద్దిగా పని ఉంది. అది అయ్యాక రెండ్రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పాడు. పక్కింటివాళ్ళు సంతోషంగా అంతకంటేనా అని రెండు ఇత్తడి పాత్రలిచ్చారు.

రెండు రోజుల తరువాత పక్కింటి వాళ్ళకు ఆ ఇత్తడి పాత్రల్ని తిరిగి ఇస్తూ వాటితో బాటు మెరుస్తున్న చిన్న ముచ్చటయిన, బొద్దుగా వున్న ఇత్తడి పాత్రను ఇచ్చాడు. వాళ్ళు ఆశ్చర్యంగా ఇదెక్కడిది? అన్నారు. ఆ యువకుడు ఈ రెంటికి పుట్టిన బిడ్డ అన్నాడు. వాళ్ళు దాని సాధ్యాసాధ్యాలు విచారించకుండా మనకు అదనంగా ఇంకో ఇత్తడి పాత్ర వచ్చింది కాదా! అని సంతోషంతో కృతజ్ఞత ప్రకటించారు.

ఒక వారానికి ఇంకెవర్నో అడిగి ఇత్తడి పాత్రలు తీసుకుని మళ్ళీ చిన్న ఇత్తడి పాత్ర అదనంగా ఇచ్చాడు. వాళ్ళకీ అవి పిల్లలు పెడతాయన్నాడు. వాళ్ళు నిజమా అని అడగకుండానే ఇచ్చినదాన్ని తీసుకున్నారు.

ఇక గ్రామస్థులంతా ఎప్పుడెప్పుడు తమ ఇత్తడిపాత్రలు అడుగుతారా! అని ఉత్సాహంగా ఎదురుచూసేవాళ్ళు. ఈరకంగా ఆ యువకుని పేరు ప్రఖ్యాతులు చుట్టుపట్ల గ్రామాలకూ వ్యాపించాయి. నగరంలో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

ఒకరోజు గ్రామగ్రామాలకు తిరిగి వచ్చేనెలలో గొప్ప ఉత్సవం జరుపబోతున్నానని అందరూ దయచేసి వాళ్ళ దగ్గర ఉన్న ఇత్తడి పాత్రలనన్నిట్నీ ఇవ్వాలని చాటింపు చేశాడు. అడిగీ అడగక ముందే జనాలు తమ ఇత్తడి పాత్రల్ని ఇచ్చారు. అన్నిట్నీ ఎవరివి ఏవి అని లెక్కలు రాసి మరీ బళ్ళు కట్టించి తరలించాడు.

వారం, పదిరోజులు నెలరోజులు గడిచాయి. మనిషి జాడలేదు. అతనిమీద అందరికీ నమ్మకం.కానీ క్రమంగా ఆనమ్మకం మంచుగడ్డలా కరిగిపోయింది. గ్రామపెద్దలు అతన్ని వెతుక్కుంటూ నగరానికి వెళ్ళారు. అతను వాళ్ళ రాక గమనించి దిగులుగా కూచుని కనిపించాడు.

వాళ్ళు ఏమైంది? ఎందుకలా దిగులుగా ఉన్నావన్నారు.

అతను ‘ఏం లేదు. పదిరోజుల క్రితం జరగరానిది జరిగింది. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలీక నేను మీ దగ్గరకు రాలేదు’ అన్నాడు.

‘ఏం జరిగింది?’ అన్నారు.

అతను ‘పదిరోజుల క్రితం అంటురోగం తగిలి ఇత్తడిపాత్రలన్నీ చనిపోయాయి’ అన్నాడు.

వాళ్ళు ఆ మాటల్తో తాము మోసపోయినట్లు గ్రహించారు. ఒక గ్రామస్థుడు ఇత్తడి పాత్రలెలా చనిపోతాయి? అన్నాడు. ఆ యువకుడు ఇన్నాళ్ళుగా మీ ఇత్తడి పాత్రలు పిల్లలు పెడతాయంటే ఎవరూ ప్రశ్నించలేదు. అప్పుడు పిల్లల్ని ఎలా పెట్టాయో ఇప్పుడు అంటురోగంతో అలానే కన్నుమూశాయి అన్నాడు.

ఈ మాటలకు ఏం బదులివ్వాలో తెలీక తమనందర్నీ నిలువునా ముంచాడని వాళ్ళు వెనుదిరిగారు.

– సౌభాగ్య

First Published:  20 Aug 2015 1:02 PM GMT
Next Story