సవాల్‌ విసిరిన పవర్‌ కల్యాణ్!

cpvvsపవన్ కల్యాణ్ రణనినాదంతో ప్రభుత్వ భూ సేకరణ కొత్త మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీకి ఇంతకాలం మిత్రునిగా ఉంటూ వచ్చిన జన సేనాని, ప్రభుత్వం ఇదే ధోరణితో ముందుకు వెళితే తన దారి తనదేనని బహిరంగ ప్రకటన చేశారు. జనం మధ్యే రణ నినాదం చేశారు. పోరుబాటలో రైతులకే తన మద్దతని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వానికి సెగ పుట్టింది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా కాగితం పులి అన్న వారు కూడా ఆదివారం రాజధాని ప్రాంతంలో పవన్‌ మాటలు విన్నవారు నోరెళ్ళబెట్టారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సీట్లు సాధించడానికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన సినీనటుడు పవన్ కల్యాణ్, రాజధాని భూసేకరణ అంశంపై తాడోపేడో తేల్చుకొనేందుకు రైతులతోపాటు ఆయన కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తెలుగుదేశం పార్టీకి టాటా చెప్పేసి పోరుబాట పట్టేందుకూ సమాయత్తమవుతున్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల భేటీలో నిస్సంకోచంగా ఇదే విషయాన్ని ప్రకటించారు పవన్. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీల మైత్రితో తనపై వస్తున్న విమర్శలకూ సమాధానం చెప్పేందుకు ఈ వేదికను పవన్‌ చక్కగా వినియోగించుకున్నారు. భూసేకరణ, రాజధాని నిర్మాణం, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వంటి విషయాల్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయాలకు, తనకు ఏమాత్రం సంబంధం లేదని సాధ్యమైనంత దూరం జరగడానికి ఒక ప్రాతిపదికను కూడా సిద్ధం చేసుకున్నట్టు కనిపించారు.
టీడీపీ సర్కారుకు పవన్‌ హెచ్చరిక..
కొంతకాలంగా తెలుగుదేశం ప్రభుత్వ భూసేకరణ విధానంపై ట్విట్టర్ ద్వారా తన మనోగతాన్ని వెల్లడిస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఆదివారం మాత్రం మాటల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. భూ సేకరణకు తానెట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, అవసరమైతే ధర్నాల ద్వారా రైతులకు మద్దతు తెలుపుతానని ప్రకటించడం టీడీపీ ప్రభుత్వానికి గుబులు పుట్టించే విషయమే. తనపై వ్యక్తిగతంగా విమర్శలు గుప్పిస్తున్న మంత్రులను సైతం పవన్ వదిలి పెట్టలేదు. యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, ప్రతిపాటి పుల్లారావు వంటి వారి వ్యాఖ్యలను తూర్పారబట్టారు. భూసేకరణ జరపాల్సిందేనంటున్న తెలుగుదేశం నాయకులు హైదరాబాదులో అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై ఎందుకు కోర్టుకెళ్ళారంటూ ఎంపీ మురళీ మోహన్ సుప్రీంకోర్టుకు వెళ్ళడాన్ని నిలదీశారు. చిన్నచిన్న రైతులు తమ పొలం పోతుందన్న మనో వేదనతో రోడ్డెక్కితే… ఆ విషయాన్ని తాను ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తారా అంటూ నిలదీశారు. మద్దతిచ్చినంత మాత్రాన ప్రభుత్వం చేసిందానికల్లా తలూపడం తన అభిమతం కాదని విస్పష్టంగా తెలిపారు. మొత్తమ్మీద పవన్ పర్యటన రెండు అంశాలను స్పష్టం చేసింది.
రాజకీయ సమీకరణలను కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించి విస్పష్టంగా తన అభిప్రాయాలను తెలుగుదేశం పార్టీకి వెల్లడించారు. తానేదో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినంత మాత్రాన మిగిలిన పార్టీలకు దూరమన్న అభిప్రాయం సరికాదని తెలిపారు. ప్రజల పక్షాన ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీతో తాను కలిసి పని చేస్తానంటూ టీడీపీకి హెచ్చరికల సందేశం పంపారు. ఆయన మాటల్లో మరో విషయం కూడా స్పష్టమైంది. తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికో, ఆపార్టీకో వ్యతిరేకినన్న భావం ఏమైనా ఉంటే దాన్ని తుడిచేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ పార్టీగాని, జగన్‌ గాని తనకు శత్రువు కాదన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెబుతూ తెలుగుదేశం పార్టీకి హెచ్చరికల సందేశం పంపారు. పిచ్చిపిచ్చి వేషాలేస్తే తనేమిటో చూపిస్తానంటూ నేరుగా హెచ్చరిక చేశారు. మొత్తం మీద తాను తెలుగుదేశంతో కలిసి నడిస్తే రాజకీయంగా దెబ్బ తగులుతుందన్న వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గ్రహించారు. తాను బానిసను కాదు అని చెప్పడం ద్వారా ఇక కాచుకోండి అని తెలుగుదేశం ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మొత్తం మీద పవన్‌ తన ప్రసంగం ద్వారా రాజకీయ పరిపక్వతను కనబరిచారనిపిస్తోంది. – పీఆర్‌ చెన్ను