Telugu Global
Others

పొరుగు రాష్ట్రాలకు ధీటుగా నిలపండి: ప్రధానికి బాబు మొర

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందేవరకు పన్ను రాయితీలు ఇవ్వాలని, తగిన విధంగా సాయం చేసి ఆదుకోవాలని తాను ప్రధాని నరేంద్రమోడిని కోరినట్టు ఆయన చెప్పారు. సాయం చేయడానికి ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ని పోల్చవద్దని తాను మోడికి స్పష్టం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రధానితో గంటన్నరపాటు జరిగిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించామని, ప్రధాని కూడా తన వాదనను సావధానంగా విన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి […]

పొరుగు రాష్ట్రాలకు ధీటుగా నిలపండి: ప్రధానికి బాబు మొర
X
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందేవరకు పన్ను రాయితీలు ఇవ్వాలని, తగిన విధంగా సాయం చేసి ఆదుకోవాలని తాను ప్రధాని నరేంద్రమోడిని కోరినట్టు ఆయన చెప్పారు. సాయం చేయడానికి ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ని పోల్చవద్దని తాను మోడికి స్పష్టం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రధానితో గంటన్నరపాటు జరిగిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించామని, ప్రధాని కూడా తన వాదనను సావధానంగా విన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళగలిగానని ఆయన చెప్పారు. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు కావాలని, ఇందుకు సాయం చేయాలని కోరినట్టు తెలిపారు. పదేళ్ళ తర్వాత హైదరాబాద్‌ తెలంగాణ రాజధానిగా మారుతుందని, అప్పటికి హైదరాబాద్‌కు ధీటుగా ఏపీ రాజధానిని నిర్మించుకోవలసిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రధానికి నివేదించానని తెలిపారు. సీఆర్‌డీఏకు కాశ్మీర్‌, హిమాచల్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరానని, మంచి రాజధాని నిర్మాణానికి అత్యధిక నిధుల అవసరాన్ని చెబుతూ సాయం కోరానని తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన జిల్లాల కోసం ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రూ. 350 కోట్లు, రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు, రెవిన్యూ లోటు భర్తీకి 2300 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 250 కోట్ల నిధులు వచ్చాయని, దీనికి తాను ప్రధాని నరేంద్రమోడికి కృతజ్ఞతలు తెలిపానని చంద్రబాబు చెప్పారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు, బీజేపీ అనుసరించిన వైఖరిని ఆయనకు వివరించానని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీకి హామీ లభించిందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాకు, పరిశ్రమల స్థాపనకు సంబంధం లేదని, పన్ను రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. ఇచ్చే సాయం ఏ రూపంలో ఉన్నా ఎక్కువ నిధులు రాబట్టడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. రెవిన్యూ లోటును పూర్తిగా భర్తీ చేయడానికి హామీ లభించిందని ఆయన చెప్పారు.
First Published:  25 Aug 2015 6:07 AM GMT
Next Story