ప‌వ‌న్ ధ‌ర్నా అందుకేనా!

నాకు ఏదంటే భ‌య‌మో.. ముందు దాన్ని చేయ‌డం అల‌వాటు.. అని పోకిరి సినిమాలో మ‌హేష్ చెప్పిన డైలాగ్‌ను టీడీపీ ఫాలో అవుతున్న‌ట్లుంది. వారిని ఇబ్బంది పెట్టే అంశ‌మేదైనా ఉంటే.. దాన్ని వారే లేవ‌దీసి.. వారే ప‌రిష్క‌రించుకుంటున్నారు.. దీని వ‌ల్ల వారికి ఒరిగే లాభ‌మేంటి? అదే మ‌రి! అమాయ‌క‌త్వ‌మంటే..! ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడిన ఘ‌న‌త‌, ప‌రిష్క‌రించామ‌న్న పేరు రెండూ టీడీపీకే ద‌క్కుతాయి. వాస్త‌వానికి ఏపీలో ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా లేవ‌నే చెప్పాలి. ఉన్న ఒక్క పార్టీ వైస్సార్‌సీపీ!  పోరాటాలు చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌పార్టీకి ఆద‌ర‌ణ ద‌క్క‌డం వారికి సుతార‌మూ ఇష్టం లేదు. అందుకే, వారే పోరాటాలు చేసి, వారేస‌మ‌స్య తీర్చి జ‌బ్బ‌లు చరుచుకుంటున్నారు. ఈ విష‌యంలో వారు స‌క్సెస్ అవుతుండ‌టం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం!
టీడీపీని కాపాడుతున్న వ‌ప‌న్..!
ప‌వ‌న్ క‌ల్యాణ్‌… 2014 ఎన్నిక‌ల‌లో ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపుతిప్పిన వ్య‌క్తి. అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన‌  ప్ర‌జారాజ్యం మూసేయ‌డంతో  జన‌సేన పేరిట సొంత‌కుంప‌టి పెట్టుకున్నాడు. టీడీపీ- బీజేపీల‌కు మ‌ద్ద‌తు తెలిపి వాటి విజ‌యానికి కృషి చేశాడు. అంత‌టితో ప‌వ‌న్ ప‌ని అయిపోలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టీడీపీ విస్తృతంగా వాడుకుంటోంది. టీడీపీ క్రియాశీల‌క నేత‌లు, మంత్రుల క‌న్నా కంటే ప‌వ‌న్ ఆ పార్టీ  కోసం ఎక్కువ క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఎలా.. ? అంటే..! రాజ‌ధాని ప్రాంతంలో వ్య‌వ‌సాయ భూముల‌ భూసేక‌ర‌ణ టీడీపీకి స‌వాలుతో కూడుకుంది. రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూమి తీసుకోవాలి. దీనిపై జ‌గ‌న్‌పార్టీ పోరాటానికి  సిద్ధ‌ప‌డింది. మార్చిలో మంగళ‌గిరిలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. స‌రిగ్గా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు 3 రోజుల ముందే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మంగ‌ళగిరిలో దిగిపోయాడు. జ‌నాల బాధ‌లు విని చంద్ర‌బాబుపై పోరాడుదామ‌ని శ‌ప‌థాలు చేశాడు. మ‌రునాడు హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశం పెట్టి చంద్ర‌బాబుకు జైకొట్టాడు. ఆ త‌రువాత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు జ‌నం వ‌చ్చినా.. ఒకే అంశంపై రెండురోజుల తేడాతో మ‌రో ధ‌ర్నా అంటే ప్ర‌జ‌లు, మీడియా మొక్కుబ‌డిగా వ‌చ్చారు. త‌ప్పితే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న రోజు చూపెట్టిన ఉత్సాహం ఆ రోజు క‌నిపించ‌లేదు. ఎందుకంటే… నాయ‌కులు వ‌స్తున్నారంటే.. జ‌నం ఒక రోజు ప‌నులు మానేస్తారు కానీ.. ఒకే స‌మ‌స్య‌పై రెండుమూడు రోజులు ప‌నులుమానుకుని ఉండ‌లేరు క‌దా?  ఆప్రాంతంలో ఉన్న‌ది రెక్కాడితే గానీ డొక్కాడ‌ని పేద రైతులు, దిన‌స‌రి కూలీలు. వారి ఆలోచ‌నా ధోర‌ణిని టీడీపీ తెలివిగా ప‌సిగ‌ట్టింది. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న చేప‌ట్టే ముందే ప‌వ‌న్‌ను అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా చేస్తోంది. ఇటీవ‌ల ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో ధ‌ర్నా చేస్తామ‌న్నారు. స‌రిగ్గా రెండు రోజుల ముందు ట్విట్ట‌ర్‌లో టీడీపీని ప‌వ‌న్ క‌డిగేయ‌డం, మాట‌ల యుద్ధానికి దిగ‌డం అంతా డ్రామా అని.. జ‌గ‌న్ ధ‌ర్నాకు ప్ర‌చారం రాకుండా టీడీపీ వేసిన ఎత్త‌ని ప్ర‌తిప‌క్షనేత‌లే విమ‌ర్శిస్తున్నారు. తాజాగా ప్ర‌భుత్వ భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మంగ‌ళ‌వారం (నేడు) జ‌గ‌న్ బంద‌రులో ధ‌ర్నా చేయ‌నున్నారు. దీనికి స‌రిగ్గా రెండు రోజుల ముందు రాజ‌ధాని ప్ర‌తిపాదిత ప్రాంతంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ప‌ర్య‌టించి వెళ్లాడు. మొత్తానికి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా ప‌వ‌న్ టీడీపీని కంటికి రెప్ప‌లా కాపాడుతున్నాడు. ఇదంతా  ప‌రిహారం పెంచేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేసి ఆ క్రెడిట్ జ‌గ‌న్ కు ద‌క్క‌కుండా చేసిన ఎత్తుగా ఏపీ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు.
-తేజ బొమ్మిన