పోర్న్ నిషేధంపై వ‌ర్మ‌ అభిప్రాయాలు క‌రెక్టేనా???

పోర్న్ వెబ్‌సైట్స్ ని బ్యాన్ చేయాల‌నే ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రామ్‌గోపాల్ వ‌ర్మ, ర‌చ‌యిత చేత‌న్ భ‌గ‌త్, బాలివుడ్ తార సోనం క‌పూర్ లాంటి చాలామంది ట్విట్ట‌ర్లో దీనికి వ్య‌తిరేకంగా చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. అనేక విష‌యాల‌పై అత్యంత స‌హజంగా స్పందించే రామ్‌గోపాల్ వ‌ర్మ దీనిపైన కూడా అదే విధంగా స్పందించారు. మ‌నిషిగా మార‌క‌ముందు మ‌నిషి జంతువే కాబ‌ట్టి జీవుల్లో స‌హ‌జాతంగా (బేసిక్ ఇన్‌స్టింక్ట్) ఉండే లైంగిక వాంఛ‌కు సంబంధించిన ఈ అంశంపై నిషేధం విధించ‌డం స‌రికాద‌న్నారు. ఎవ‌రూ ఎవ‌రినీ హింసించ‌ని, ఎవ‌రూ ఎవ‌రినీ బాధించ‌ని, ప్ర‌తిమ‌నిషీ మ‌రో మ‌నిషి స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించని ఒక స్వేచ్ఛాపూరిత వాతావ‌ర‌ణంలో నివ‌సించ‌డం… అనే ఒక క‌ల‌లాంటి ప్ర‌పంచం వ‌ర్మ‌ మాటల్లో క‌న‌బ‌డుతుంటుంది. అలాంటి ఆలోచ‌న‌ల‌ను బేస్ చేసుకునే ఆయ‌న దీనిపై కూడా స్పందించారు.

మాన‌వ స‌మూహాన్ని ఒక క్ర‌మ‌పద్ధ‌తిలో క‌లిపి ఉంచ‌డానికి ఎప్పుడో వంద‌ల వేల ఏళ్ల క్రితం వెల‌సిన భావ‌జాలం, ఆచారాల‌ను ఇప్ప‌టికీ అనుస‌రించే మ‌నుషుల‌కు ఆయ‌న  చెప్పేది పూర్తిగా హాస్యాస్ప‌దంగా ఉంటే, ఆయ‌న‌కు ఈ స‌మాజ‌మూ అలాగే క‌న‌బ‌డుతుంటుంది. వంటిళ్ల‌లో ఆడ‌వాళ్లు గంట‌ల త‌ర‌బ‌డి వంట‌లు ఎందుకు చేయాలి, క‌మ్యునిటీ వంట‌శాల‌లు ఉంటే స‌రిపోతుంది, వారు ఆ కాలాన్ని మ‌రో ఉత్ప‌దాక ప‌నిమీద ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు… ఇలా ఉండే వ‌ర్మ‌గారి ఆలోచ‌న‌లు మంచివే…. కానీ త‌న‌చేత్తో వంట‌చేసి భ‌ర్త‌కి పిల్ల‌ల‌కు క‌డుపునిండా పెట్టుకోవ‌డ‌మే (ఎక్క‌డి నుండైనా వారికి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అంద‌డ‌మే ముఖ్యం అనే విష‌యాన్ని గుర్తించ‌కుండా) త‌న జీవ‌న ప‌ర‌మార్ధ‌మ‌ని న‌మ్మే స‌గ‌టు ఇల్లాలి పాత్ర‌ని..వంద‌ల ఏళ్లుగా సృష్టించుకు న్న‌ మ‌నం, ఇప్పుడు ఇలాంటి ఆలోచ‌న‌లు చేసినా ఫ‌లితం ఉండ‌దు. వ‌ర్మ ఆలోచ‌న‌ల్లో ని ఇలాంటి స‌హ‌జ‌మైన విష‌యాలు చాలా… నేటి స‌మాజానికి అస‌హ‌జంగా క‌నిపించ‌డంలో వింత లేదు. అయితే పోర్న్ సైట్ల బ్యాన్ విష‌యంలో మాత్రం ఆయ‌న ఆలోచ‌నా విధానం స‌రికాద‌నిపిస్తోంది.

సెక్స్ అనేది జీవికి స‌హ‌జాత‌మైన అంశం కాబ‌ట్టి…ఇలాంటి నిషేధాల వ‌ల‌న ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, నిషేధ భంగం చేయాల‌నే ప్ర‌య‌త్నాలు మ‌రింత పెద్ద ఎత్తున జ‌రుగుతాయ‌ని ఆయ‌న అంటారు. అంతేకాదు, వీటిని చూడ‌టం అనేది సెక్సువ‌ల్ అర్జ్‌కి చిన్న స్నాక్‌లా ప‌నిచేసి తాత్కాలిక ఉప‌శాంతి క‌లుగుతుందంటారు. ఇది నిజ‌మే కావ‌చ్చు. కానీ ఇక్క‌డ మ‌నం కొన్ని విష‌యాల‌ను మ‌ర్చిపోకూడ‌దు. మ‌నిషికి అర్జ్ కంటే ముందు కుతూహ‌లం అనే ఒక బ‌ల‌మైన ల‌క్ష‌ణం ఉంది. ఈ గుణం టీనేజి పిల్ల‌ల్లో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఆ కుతుహ‌లం అనే ఆక‌లికి చ‌క్క‌ని మంచి ల‌క్ష‌ణాలున్న పోష‌కాహారం పెట్ట‌వ‌చ్చు, ఆరోగ్యాన్ని నాశ‌నం చేసే ఆహారాన్ని పెట్ట‌వ‌చ్చు. ఏది తిన్నా దాని ఆక‌లి తీరుతుంది. పోర్న్ సైట్లు ఆరోగ్యాన్ని నాశ‌నం చేసే ఆహారం లాంటివే. అలాంటివి ఇంత ఎక్కువ‌గా అందుబాటులో లేక‌పోతే…. వారిలో ఆ కుతూహ‌లం మ‌రింత‌గా పెర‌గ‌టం…అవే ఆలోచ‌న‌లు రిపీట్ కావ‌డం, చ‌దువుమీద శ్ర‌ద్ధ త‌గ్గ‌డం, ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల గౌర‌వం లేకుండా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లైన అంశాల గొలుసుని పెర‌గ‌కుండా నివారించ‌వ‌చ్చు.

దీన్ని గురించి మాట్లాడేట‌ప్పుడు మ‌నం మ‌న మ‌న‌సు, మెద‌డు ఎలా ప‌నిచేస్తాయి…అనే విష‌యాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. యోగా, ధ్యానం మొద‌టి ద‌శ‌లో ఉన్న‌వారికి…ఒక వింత జంతువు ల‌క్ష‌ణాల‌ను గురించి వివ‌రంగా వ‌ర్ణించి చెప్పి…ఓ రెండు నిముషాల పాటు ఆ ఒక్క జంతువుని త‌ప్ప మీరు దేన్న‌యినా గుర్తు తెచ్చుకుంటూ ధ్యానం చేయ‌మంటారు. కానీ ఇదంతా విని ధ్యానం కోసం క‌ళ్లు మూసుకున్న వారికి మిగిలిన అన్ని విష‌యాల‌కంటే ఆ జంతువు రూప‌మే బాగా గుర్తుకు వ‌స్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌పంచంలో అత్యంత తెలివైన వారు కూడా పూర్తి స్థాయి విచ‌క్ష‌ణ‌తో జీవించే గంట‌లు రోజుకి కొన్నే ఉంటాయి. మిగిలిన కాల‌మంతా మ‌నం గ‌తానికి జిరాక్స్ ల్లాగే బ‌తికేస్తుంటాం. విచ‌క్ష‌ణ అంటే ప్ర‌తిక్ష‌ణం మ‌న‌ల్ని మ‌నం జ‌డ్జ్ చేసుకుంటూ బ‌త‌క‌డం…అలా చేస్తూ ఉంటే నిన్నకి ఇవాళకి ఉన్న లింకులు ఎన్నో తెగిపోతుంటాయి. ప్రేమ‌లు, ఆప్యాయ‌త‌లు, బాధ్య‌త‌లు, గౌర‌వ మ‌ర్యాద‌లు, భ‌క్తి ప్ర‌వ‌త్తులు… ఇలాంటి చాలా మాట‌లు గాల్లో క‌లిసిపోతుంటాయి. అంత సాహసం ఏ స‌గ‌టు మ‌నిషీ చేయ‌లేడు. అస‌లు అవ‌న్నీ లేక‌పోతే జీవితంలో ఇంకేం మిగులుతుంది? అనే ప్ర‌శ్న‌కు స‌గ‌టు మ‌నిషి వ‌ద్ద స‌మాధానం ఉండ‌దు.

అవ‌న్నీ ప‌క్క‌న‌పెడితేనే నిజ‌మైన మ‌నిషిగా నిండు ఆనందాన్ని, సెన్స్ ఆఫ్ జాయ్‌ని అనుభ‌వించ‌వ‌చ్చ‌ని వ‌ర్మ‌గారంటారు. హిపోక్ర‌సీని చీల్చి చెండాడే ఆయ‌న భావాలు అందుకే చాలామందికి భ‌యంకరంగా క‌నిపిస్తుంటాయి. అలా నిష్పాక్షికంగా జడ్జ్ చేసుకునే స్థితికి రావ‌డమూ చాలా క‌ష్ట‌మే. రామ్‌గోపాల్ వ‌ర్మ‌లో అలాంటి ఆలోచ‌నా సాధ‌న చాలా  క‌న‌బ‌డుతుంది. మన జీవితాల్లో ఉన్న అత్యంత కృత‌క‌మైన‌, మూర్ఖ‌మైన‌, అస‌హ‌జ‌మైన‌, అస‌హ్య‌క‌ర‌మైన‌, క్రూర‌మైన చాలా అంశాల‌ను గురించి అందుకే ఆయ‌న చాలా  స్ప‌ష్ట‌మైన అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌గ‌లుగుతున్నారు. అయితే పోర్న్ విష‌యంలో మాత్రం ఆయ‌న ఆలోచ‌న‌లు స‌క్రమంగా లేవేమో అనిపిస్తోంది.

లైంగిక వాంఛ అనేది ఆక‌లి నిద్ర‌ల్లా బేసిక్ ఇన్‌స్టింక్ట్ కాబ‌ట్టి లైంగిక అంశాల‌ను ఎంత‌గా అణ‌చిపెడితే అంత‌గా పైకి లేస్తాయి అనేది ఆయ‌న వాద‌న‌ కావ‌చ్చు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాగ‌రిక‌తా ప‌రిణామంలో మ‌నం చాలా బేసిక్ ఇన్‌స్టింక్ట్స్ ని అణ‌చివేస్తూనే వ‌చ్చాం. ఆడ‌వుల్లో జంతువులు ఆక‌లివేస్తే ఇంటికి వెళ్లి (అదే త‌మ గుహ‌కి) వంట‌చేసుకుని బుద్దిగా భోజ‌నం చేయ‌వు. త‌మ ‌కంటే బ‌లంలేని జంతువు మీద ప‌డి త‌మ ఆక‌లిని తీర్చుకుంటాయి. ఆక‌లి అనే బేసిక్ ఇన్‌స్టింక్ట్ ని అవి అధిగ‌మించే విధానం అదే. జంతువుల‌కు ఆహారం, లైంగిక వాంఛ‌, నిద్ర, వేట‌లో ఆనందం ఇలాంటి ప‌రిమిత ఆక‌ళ్లు మాత్ర‌మే ఉంటాయి. కానీ మ‌నిషికి అలాకాదు…రోజుకి అత‌నికి వెయ్యిర‌కాల ఆక‌ళ్లు క‌లుగుతుంటాయి. త‌న‌కి కావ‌ల‌సింది ఇత‌రుల దగ్గ‌రుంటే లాక్కోవ‌చ్చు… అనే జంతు ఇన్‌స్టింక్ట్ మ‌నిషిలో కూడా ఉంటుంది కాబ‌ట్టే, దాన్ని అణ‌చ‌డానికే మ‌నం అంచెలంచెలుగా ఇన్ని ముళ్ల కంచెలు వేస్తూ వ‌చ్చాం. మ‌తం, దేవుడు, భ‌క్తి, నైతిక విలువ‌లు, పాప‌పుణ్యాలు, గౌర‌వ‌మ‌ర్యాద‌లు, సంస్కృతులు, సంప్ర‌దాయాలు అన్నీ మ‌నిషిలో ఉన్న ఆ మృగ ల‌క్ష‌ణాన్ని క‌ట్ట‌డి చేయ‌డానికి ఏర్ప‌ర‌చుకున్న‌వే. మ‌న‌మిప్పుడు రాతియుగం మ‌నుషుల్లా చిట్ట‌డ‌వుల్లో బ‌త‌క‌లేము. మ‌న‌కు అంద‌మైన ఉద్యాన‌వ‌నాలు కావాలి. అంటే సంస్కారం కావాలి. అడ‌విని సంస్క‌రించి అంద‌మైన ఉద్యాన‌వ‌నాల్లాంటి ఇళ్లు క‌ట్టుకున్న‌ట్టే, మ‌న‌లోని ఆదిమ భావాల‌ను నియంత్ర‌ణలో పెట్టుకుంటేనే మ‌నిషి మ‌నిషి మీద ఆధిప‌త్యం చేయ‌కుండా ఉండ‌గ‌లుగుతాడు. ఏ నాగ‌రిక‌త‌నైనా అంతిమ‌ల‌క్ష్యం ఇదే.

పోర్న్ మీద బ్యాన్ విధించ‌డం వ్య‌క్తిగ‌త హ‌క్కుని హ‌రించ‌డం లాంటిది కాదు. బ్యాన్ చేస్తే ఎలాగైనా దాన్ని ఛేదించి దాన్ని అందుబాటులోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని ఈ బ్యాన్ విమ‌ర్శ‌కులు అంటున్నారు. కానీ అక్క‌డివ‌ర‌కు కాదు… దాని అవ‌స‌రం, అర్జ్ ఉన్న‌వారి గురించి కాదు, అనుకోకుండా ఇంట్లో నెట్‌లో ఆ వెబ్‌సైట్ తార‌స‌ప‌డితే చూసి, ప‌దేప‌దే కుతూహ‌లంతో మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నించే వ‌య‌సులో ఉన్న టీనేజి పిల్ల‌ల‌కు దాన్ని మ‌రీ అంత‌గా అందుబాటులో ఉంచాల్సిన అవ‌స‌రం ఏముంది. ఈ విష‌యంలో మ‌నిషి ఇన్‌స్టింక్ట్ ని ఎందుకు నియంత్రించ‌కూడ‌దు? అస‌లు మ‌నిషి సంస్క‌రించ‌బ‌డ్డాడు అంటేనే ఇన్‌స్టింక్ట్స్ ని పూర్తిగా అదుపులో ఉంచుకోవ‌డం. వ‌ర్మ‌గారు ఇందుకు త‌న మేధ‌స్సుని వాడుకున్నారు. మ‌రొక‌రు యోగాని వాడితే ఇంకొక‌రు అబ్దుల్ క‌లాం జీవిత చ‌రిత్ర‌ని చ‌ద‌వ‌వ‌చ్చు. మ‌న‌సుకి ఉన్న విశృంఖ‌ల‌త్వాన్ని క‌ట్ట‌డి చేయ‌డానికే స‌ర్వ క్ర‌మ‌శిక్ష‌ణ‌లు మ‌న‌ముందుకు వ‌చ్చాయి. మ‌న‌సు గురించి మాట్లాడేట‌ప్పుడు మ‌నం సిగ్గుప‌డాల్సిన ప‌నిలేదు. మ‌నంద‌రిలోనూ ఒకేలా ప‌నిచేసే మ‌న‌సు ఉంది. అది ఎంత‌గా సంస్క‌రించ‌బ‌డింది అనేదే మ‌న మ‌ధ్య ఉన్న తేడా. ఇన్‌స్టింక్ట్స్ కి ప‌ట్టం క‌ట్ట‌డ‌మంటే మ‌న‌లోని మృగ‌త్వాన్ని నిద్ర‌లేప‌డ‌మే….ముఖ్యంగా మంచిచెడు వివ‌ర‌ణ ఇచ్చే లోప‌లే (ఎవ‌రికి వారైనా)…కేవ‌లం గ‌తం తాలూకూ ఇంప్రెష‌న్స్ తో వంద అడుగులు వేసేసే మెద‌డు ప‌నితీరుని ఇక్క‌డ ముఖ్య‌మైన అంశంగా ఎందుకు భావించ‌కూడ‌దు…విష‌యంలో ఉన్న వాస్త‌విక‌త కంటే…అది వాస్త‌వ ప్ర‌పంచంలో ఎలాంటి ప‌రిణామం క‌ల‌గ‌జేస్తోంది అనేది ముఖ్య‌మైన విష‌య‌మే క‌దా…

-వ‌డ్లమూడి దుర్గాంబ‌