Telugu Global
Family

సోమరి (For Children)

ఒక కామందు భార్య ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది. దానికి కారణాలు అనేకం. అన్నిటికీ మూలకారణం ఆమె భర్తే. అతనికి ఉన్న భూముల్ని కౌలుకు ఇచ్చి దానిమీద వచ్చే ఆదాయంతో అతను, అతని కుటుంబం జీవిస్తారు. అతను సంతృప్తిగా జీవించడానికి ఆ ఆదాయం సరిపోతుంది. కాబట్టి ఆర్థికమయిన ఇబ్బందులు  లేవు. మరి అతని భార్య ఎందుకని అసంతృప్తిగా ఉంటుంది? ఎందుకంటే ఆమె భర్త మహాసోమరి. ఏ పనీచేయడు. జూదమాడడం, బలాదూరుగా తిరగడం, తినడం, భార్యపై అధికారం చెలాయించడం, ఇదే […]

ఒక కామందు భార్య ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది. దానికి కారణాలు అనేకం. అన్నిటికీ మూలకారణం ఆమె భర్తే.

అతనికి ఉన్న భూముల్ని కౌలుకు ఇచ్చి దానిమీద వచ్చే ఆదాయంతో అతను, అతని కుటుంబం జీవిస్తారు. అతను సంతృప్తిగా జీవించడానికి ఆ ఆదాయం సరిపోతుంది. కాబట్టి ఆర్థికమయిన ఇబ్బందులు లేవు.

మరి అతని భార్య ఎందుకని అసంతృప్తిగా ఉంటుంది? ఎందుకంటే ఆమె భర్త మహాసోమరి. ఏ పనీచేయడు. జూదమాడడం, బలాదూరుగా తిరగడం, తినడం, భార్యపై అధికారం చెలాయించడం, ఇదే అతనిపని. ఆమె మాత్రం నిద్రలేచింది మొదలు పడుకునేదాకా ఇంటిపనుల్తో క్షణం తీరిక లేకుండా గడిపేది. పిల్లల ఆలనాపాలనా చూసేది. ఎప్పుడూ ఏదో పనిలో మునిగి ఉండేది. భర్తకు ఇవేవీ పట్టేవి కావు. అవన్నీ ఆడవాళ్ళ పనులన్నట్లు ప్రవర్తించేవాడు.

భార్య ఒక్కసారి భర్తను నిలదీసేది. అంతసోమరిగా ఉండకుంటే భార్యకు ఏవయినా పనులు చేసిపెట్టవచ్చుకదా’ అనేది. అతను మగరాయుడిలా రోషం ప్రకటించేవాడు. ఇలా వాళ్లిద్దరి మధ్యా గొడవలు చిలికి చిలికి గాలివానలయ్యేవి.

ఇరుగుపొరుగులు ఇవన్నీ చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు ఒకరోజు ఇద్దరి మధ్యా గొడవ తారాస్థాయికి చేరింది. ‘ఈ ఇంట్లో ఇట్లా గొడ్డు చాకిరీ చేస్తూ ఉండలేను. ఎప్పుడో ఈ ఇల్లు వదలిపోతాను’ అని ఆమె బెదిరించింది.

భర్త ఈ మాటలు విన్నాడు. ఎప్పుడూ తనని ఇలా తన భార్య బెదిరించలేదు. ఇది ఎక్కడికి దారితీస్తుందో అని ఆ విషయం మిత్రుడికి చెప్పి ‘నా భార్య ఇలా అంటోంది. ఏం చెయ్య మంటావు?’ అన్నాడు.

మిత్రుడు ‘మీ ఆవిడకు ఇంకో అవకాశమివ్వకు. గొడవపడితే ఈసారి నువ్వే నేనే ఇంటినించీ వెళ్ళిపోతానని బెదిరించు. అప్పుడు ఆమె వెంటనే నీ పాదాల మీద పడకుంటే నామీద ఒట్టు’ అన్నాడు.

ఇతను ‘నిజమేనంటావా?’ అన్నాడు. మిత్రుడు ‘ప్రయత్నించు’ అన్నాడు.

ఇంకోరోజు భార్య ఇతని సోమరితనం గురించి ప్రశ్నించింది. ఇతనికి రోషం కలిగింది. పోట్లాడుకున్నారు. భర్త ‘నేను ఈ ఇల్లు వదిలి వెళతాను’ అన్నాడు. ఆమె మౌనంగా ఉంది. భర్త గడపదాటాడు. ఆమె కదల్లేదు. వరండా దాటాడు. ఇప్పుడయినా వచ్చి పాదాల మీద పడుతుందని ఆశించాడు. రాలేదు. ఇంటినించీ బయటకు వచ్చాడు. భయం కలిగింది. వెనక్కి వెళ్ళలేక నేరుగా మిత్రుని ఇంటికి వెళ్లాడు. మిత్రుడెక్కడికో వెళ్లాడు. వచ్చేదాకా కూచుందామనుకున్నాడు. అరగంట అయింది. భార్య తనకు తెలిసి వాళ్ళ ఇంటికి ఆ దారంటే వెళ్ళింది. తనని పిలుస్తుందేమో అనుకున్నాడు. పిలవలేదు. ఆమె తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లింది. తన మిత్రుని జాడలేదు. అందుకని అతను తన భార్య వెళ్ళినవాళ్ళ ఇంటికెళ్ళాడు. ఆమె బయటకువస్తూ భర్తను పలకరించకుండానే ముందుకు కదిలింది.

భర్త కల్పించుకుని ‘ఈరోజు ఏం కూర చేశావు?’ అని అడిగాడు. ఆమె ఏమీ బదులివ్వకుండా ఇంటికి వెళ్లింది.

గంట గడిచేసరికి అహంకారం కరిగింది. ఆకలి పెరిగింది. మెల్లగా పిల్లిలా నడచుకుంటూ ఇంటికి వెళ్లాడు. వస్తాడని తెలిసి భార్య బయటే ఉంది. తలవంచుకుని అతను ఇంట్లోకి వెళుతూ ఉంటే ఆమె “సోమరిపోతులకు సిగ్గుండదు!” అంది.

– సౌభాగ్య

First Published:  24 Aug 2015 1:02 PM GMT
Next Story