పోలీసులకు ఇచ్చే రుణాల్లో సడలింపులు: డీజీపీ

తెలంగాణ పోలీస్ శాఖ‌లోని సిబ్బందికి రుణ‌ ప‌రిమితిలో ప‌లు స‌వ‌రణలు చేసిన‌ట్లు డీజీపీ అనురాగ్‌శ‌ర్మ ప్ర‌క‌టించారు. భ‌ద్ర‌త ప‌థ‌కం కింద ఇచ్చే రుణ‌ ప‌రిమితిని, ఎక్స్‌గ్రేషియాను పెంచ‌డంతోపాటు గృహ నిర్మాణ అడ్వాన్స్ కింద తీసుకునే రుణాన్ని రూ. 5 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అదేవిధంగా హెడ్‌కానిస్టేబుల్‌, పీసీలు, ఏఎస్సై, ఏఆర్ ఎస్సైల‌కు ప‌రిమితిని రూ. 7 ల‌క్ష‌ల‌కు పెంచారు. ఎస్సై క్యాడ‌ర్ అధికారుల‌కు రూ. 9 లక్ష‌లు, డీఎస్సీలు ఆపై స్థాయి అధికారుల‌కు రూ. 11 లక్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు డీజీపీ పేర్కొన్నారు. నిర్మించిన ఇళ్ల కొనుగోలు కోసం వివిధ స్థాయిల్లో ఉన్న అధికారుల‌కు రూ. 8 ల‌క్ష‌ల నుంచి 23 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు తెలిపారు. సిబ్బంది పిల్ల‌ల  విదేశీ ఉన్న‌త విద్య కోసం ఇస్తున్న రుణాన్ని రూ. 15 ల‌క్ష‌ల‌కు పెంచారు. వ్య‌క్తిగ‌త రుణాల‌తోపాటు కుమార్తె వివాహం కోసం తీసుకునే రుణాన్ని రూ. 4 ల‌క్ష‌ల‌కు పెంచారు. రుణ సౌక‌ర్య నిబంధ‌న‌ల‌ను కూడా స‌డ‌లించారు. గ‌తంలో ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఐదేళ్ల స‌ర్వీసు ఉన్న వారికి మాత్ర‌మే లోన్లు ఇవ్వ‌గా, ప్ర‌స్తుతం దానిని మూడేళ్ల‌కు కుదించారు. ఎక్స్‌గ్రేషియాను కూడా పెంచారు. స‌హ‌జ మ‌ర‌ణాల విష‌యంలో ఏఎస్సై క్యాడ‌ర్ వ‌ర‌కు రూ. 4 ల‌క్ష‌ల‌కు పెంచ‌గా, ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి రూ. 8 ల‌క్ష‌లకు పెంచారు. ఎస్సై నుంచి ఆపై స్థాయి అధికారుల‌కు ఇచ్చే ప‌రిహారాన్ని కూడా రెట్టింపు చేశారు. స‌హ‌జ మ‌ర‌ణాల‌కు రూ. 8 ల‌క్ష‌లు, ప్ర‌మాదంలో చ‌నిపోయిన సిబ్బందికి రూ. 16 ల‌క్ష‌ల‌కు పెంచారు. సిబ్బంది అంగీకారం మేర‌కు భ‌ద్రత ప‌థ‌కానికి ప్ర‌తినెలా చెల్లిస్తున్న కంట్రిబ్యూష‌న్‌ను రెట్టింపు చేస్తున్న‌ట్లు డీజీపీ ప్ర‌క‌టించారు.