పూజారి (For Children)

ఒక గ్రామంలో పూజారి ఉండేవాడు. పెళ్ళిళ్ళకు పబ్బాలకు గృహప్రవేశాలకూ ఆచార కర్మకాండలన్నింటికీ, అందరికీ అతడే దిక్కు. అందుకని అందరికీ అతని అవసరముండేది. అతను దాన్ని అవకాశంగా తీసుకుని అందరిపై పెత్తనం చెలాయించేవాడు. అతనంటే జనాలు భయపడేవాళ్ళు. అతని అనుమతి లేనిదే ఎవరూ ఎవర్ని పెళ్ళి చేసుకోకూడదు. ముహూర్తాలు అతనే నిర్ణయించేవాడు.

ఇలా ఉంటే ఆ గ్రామంలో ఒక తల్లీకొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు. దారిలో ఒక కుటుంబం తటస్థపడింది. వాళ్ళకు ఒక్కగానొక్క కూతురు. అందమైంది. ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి కుదిరింది. అమ్మాయి తల్లితండ్రులు మంచి ముహూర్తాలు మళ్లీ లేవని తమ గ్రామానికి తీసుకెళ్ళి వాళ్ళుపెళ్ళిచేసారు. వివాహం అనంతరం వాళ్ళు వరుడి గ్రామానికి వచ్చాడు.

గ్రామంలో నియంతలాంటి పూజారి ఈవార్త విని మనసులో ద్వేషం పెంచుకున్నాడు. పిలవని పేరంటానికన్నట్లు తను వరుడి ఇంటికి వచ్చాడు. అబ్బాయిఏదో పనిమీద పక్క గ్రామం వెళ్లాడు. పూజారి అబ్బాయి తల్లిని, తల్లి దగ్గర కూచున్న కోడలిని చూశాడు. ఆమె ఒంటినిండుగా నగలున్నాయి.

పూజారి “ఈ అమ్మాయికి దుర్ముహూర్తంలో వివాహం జరిగింది. మనగ్రామానికి శనిదాపురించింది. వెంటనే కట్టుబట్టల్తో చెక్కపెట్టెలో బంధించి ఈమెను నదిలో వదిలిపెడితేగానీ గ్రామానికి ముక్తి లేదు” అన్నాడు.

ఆ అమ్మాయి భయపడిపోయింది. పూజారి దౌర్జన్యం తెలిసి వాళ్లు ఏమీ ఎదురు చెప్పడానికి సాహసించలేదు. అమాయకులయిన జనం నోరు తెరుచుకుని చూశారు. మనుషుల సాయంతో బలవంతంగా పూజారి ఆమెను చెక్కపెట్టెలో బంధించి గ్రామస్థులు అందరూ చూస్తూ ఉండగా నదిలో వదిలాడు.

ఆ చెక్కపెట్టెలో ప్రాణభీతితో అమ్మాయి ఏడ్చింది. నది అంచులో ఒకరాయి దగ్గర ఆ చెక్కపెట్టె ఆగితే కోతులు పట్టడానికి వచ్చిన వ్యక్తి ఆపెట్టెను ఒడ్డుకు లాగి తెరిచి ఆమెను రక్షించి విషయం తెలుసుకుని వాడు దుర్మార్గుడు. నీ నగలకోసం నది కింద ఎదురుచూస్తుంటాడని పెట్టెలో ఒక కోతిని పెట్టి నీళ్లలో వదిలి ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారింట్లో వదిలాడు.

నదికింద చెక్కపెట్టెకోసం ఆవురావురుమని ఎదురుచూస్తున్న పూజారి చెక్కపెట్టెను దొరకబుచ్చుకున్నాడు. గ్రామస్థులతో రహస్యంగా వచ్చి ఆ అమ్మాయి భర్త ఆ దృశ్యం చూస్తున్నాడు. చెక్కపెట్టె మూత తియ్యగానే ప్రాణభయంతో భయపడిపోతున్న కోతి ఒక్కసారిగా పూజారి మీద దాడిచేసి గోళ్ళతో ముఖాన్ని రక్కింది. చెట్ల వెనక వున్న జనం పూజారిని చితకబాది అదేపెట్టెలో అతన్ని పెట్టి నదిలో వదిలారు.

– సౌభాగ్య