సిక్కుల ఊచకోత కేసులో సోనియాకు ఊరట

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. 1984 నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్‌ను యూఎస్ కోర్టు కొట్టి వేసింది. ఈ సంఘటనలో సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ  రెండేళ్ళ క్రితం సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం, ఆరోపణల్లో వాస్తవం కనపడడం లేదని అభిప్రాయపడింది. ఇందులో కొత్త విషయం ఏమీ లేదని, పాత విషయాలే మళ్లీ చెబుతున్నారంటూ పిటిషన్‌ను కొట్టి వేసింది. యూఎస్ కోర్టు తీర్పుపై సోనియా గాంధీ న్యాయవాది రవి బాత్రా హర్షం వ్యక్తం చేశారు. దీన్ని చారిత్రక తీర్పుగా ఆయన అభివర్ణించారు. సోనియాపై అసత్య ఆరోపణలు చేసిన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా కోర్టు తీర్పుపై 14 రోజుల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ న్యాయవాది చెబుతున్నారు.