సానియా ఖేల్‌రత్నకు కర్ణాటక హైకోర్టు బ్రేక్‌

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఖేల్‌రత్న అవార్డుపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. సానియాకు కేంద్రం ఖేల్‌రత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన పారా ఒలింపిక్ అధ్లేట్ హెచ్. యన్. గిరీశ కోర్టులో ఈ పిటిషను వేశారు. తను 2012 ఒలింపిక్ పోటీలలో హైజంప్ ఈవెంట్‌లో వెండి పతకం సాధించినందుకు భారత ప్రభుత్వం 2013లో తనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందని, కానీ 2011-2014 మధ్య ఒక్క టైటిల్ కూడా గెలవలేని సానియా మీర్జాకు క్రీడల్లో అత్యున్నత పురస్కారం ఏవిధంగా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అవార్డు కోసం సెలక్షన్ ప్యానల్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నా సానియా మీర్జా కంటే తనకు 90 పాయింట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాంటప్పుడు తనను కాదని ఆమెకు ఈ అత్యున్నత అవార్డు ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆయన వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు సానియా మీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఇవ్వరాదని కేంద్రప్రభుత్వాని ఆదేశిస్తూ కౌంటర్ వేయమని కోరింది.