Telugu Global
Family

పునర్జన్మ అంటే (Devotional)

ఇక్కడ కొద్దిగా పునర్జన్మ గురించి చెప్పుకొంటే మంచిది. ‘తిరిగి పుడుతుంది’ అని బౌద్ధం ఒప్పుకుంది. కాబట్టి పునర్జన్మను ఒప్పుకుంది” అని కొందరంటారు. అసలు వైదిక సంప్రదాయం దేన్ని పునర్జన్మ అన్నదో తెలుసుకుంటే ఈ గందరగోళం తొలిగి పోతుంది. ఈ శరీరానికి అతీతమైన ‘ఆత్మ’ ఒకటి ఉందనేది వైదిక సంప్రదాయ సిద్ధాంతం. దీన్నే ‘ప్రాణం’ అన్నారు. ఆయువు అంటారు. ఈ ‘ఆత్మ’ జీవుని దేహంలో చేరుతుంది. తన కర్మల్ని అనుభవిస్తూ జీవిస్తుంది. ఇది దేహాన్ని ఒక ‘ఉపాధిగా’ లేదా […]

ఇక్కడ కొద్దిగా పునర్జన్మ గురించి చెప్పుకొంటే మంచిది. ‘తిరిగి పుడుతుంది’ అని బౌద్ధం ఒప్పుకుంది. కాబట్టి పునర్జన్మను ఒప్పుకుంది” అని కొందరంటారు. అసలు వైదిక సంప్రదాయం దేన్ని పునర్జన్మ అన్నదో తెలుసుకుంటే ఈ గందరగోళం తొలిగి పోతుంది.

ఈ శరీరానికి అతీతమైన ‘ఆత్మ’ ఒకటి ఉందనేది వైదిక సంప్రదాయ సిద్ధాంతం. దీన్నే ‘ప్రాణం’ అన్నారు. ఆయువు అంటారు. ఈ ‘ఆత్మ’ జీవుని దేహంలో చేరుతుంది. తన కర్మల్ని అనుభవిస్తూ జీవిస్తుంది. ఇది దేహాన్ని ఒక ‘ఉపాధిగా’ లేదా ఒక ఉపకరణంలా మాత్రమే వాడుకుంటుంది. భగవద్గీత ప్రకారం ఒక చొక్కాలా లేదా ఒక ప్యాంటులా కాదంటే ఒక పంచెలా, లేదా చీరలా. మనం ధరించిన చొక్కా చినిగిపోగానే దాన్ని వదిలి, మరలా మనం ఎలా కొత్తచొక్కా తొడుక్కుంటామో- ఆత్మ దేహాన్ని కూడా అలాగే మార్చేస్తుంది. ఈ శరీరం శిధిలం కాగానే మరోకొత్త శరీరంలోకి పోతుంది.

ఆ ఆత్మ తను బ్రతికిన కాలంలో చేసిన ‘కర్మ’ ఫలాల్ని మోసుకుంటూ పోయి మరోజన్మ ఎత్తుతుంది. ఈ కర్మల్నే ‘సంచిత’ కర్మఫలాలు అంటాం. అంటే సంచిలో వేసుకుని మరోజన్మకు మోసుకుపోయే కర్మఫలాలు అన్నమాట. ఆ మరో జన్మనే ”పునర్జన్మ” అంటాం. ”పునః” అంటే మాటిమాటికి అని. పునర్జన్మ అంటే మాటిమాటికి పుట్టడం.

అంటే- ఈ వైదిక ‘పునర్జన్మ’లో ఆత్మ మాటిమాటికి, తిరిగి తిరిగి, మరలా మరలా అలా పుడుతూనే ఉంటుంది. అంటే ‘ఆత్మ శాశ్వతం’ అని వైదికం చెప్తుంది. శాశ్వతమైన ఆత్మ, దేహాల్ని మార్చడమే పునర్జన్మ. ఈ వాదంలో దేహానికీ, ఆత్మకూ సంబంధమే లేదు. దేహం అశాశ్వతం. ఆత్మ శాశ్వతం.

దీన్ని ప్రతీత్యసముత్పాదాన్ని లేదా విచ్ఛిన్న ప్రవాహాన్ని ఒప్పుకున్న బౌద్ధం ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోపోతే, బౌద్ధం చెప్పిన పునర్జన్మ ఏమిటి?- నిజం ఏమంటే…

పునర్భవం అంటే

అసలు బౌద్ధం పునర్జన్మ అనే పదాన్నే వాడలేదు. వాడదు కూడా. ఎందుకంటే ఆత్మ శాశ్వతం. దేహం అశాశ్వతం అనేది గదా పునర్జన్మ అంటే. ఈ శాశ్వతం, అశాశ్వతం అనే రెండు పదాలూ బౌద్ధ మూలసూత్రాలకే విరుద్ధం.

ఏదీ నశించదు, ఏదీ కలకాలం ‘అదేలా’ జీవించనూ లేదు. ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. క్షణక్షణం పరివర్తన చెందుతూ ఉంటుంది. ఒక దశనుండి మరో దశకు పరిణామం చెందుతుంది. పాతదాన్నుండి కొత్తది అందిపుచ్చుకుంటుంది. ఇది ఒక గొలుసులా, నిచ్చెనమెట్లలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది.

పాతది నశించి, కొత్తది పుట్టే క్షణాన్ని కూడా మనం గుర్తించలేం. అది ఒక ప్రవాహంగా అలా సాగిపోతూనే ఉంటుంది.

మన శరీరంలో ప్రతిక్షణం కొన్ని కోట్ల కణాలు నశిస్తూ, కొన్ని కోట్ల కణాలు పుడుతూ ఉంటాయి. అయినా మన ‘ఉనికి’ ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇది ఒక దేహానికి సంబంధించిన ప్రక్రియ. బౌద్ధం దీన్ని ‘పునర్భవం’ అంది.

పునర్భవం అంటే ‘అమరకోశం’ ఇలా చెప్పింది. ”ఛిన్నో అపి పునర్భవతీతి పునర్భవః” అంటే- ఛిన్నమైననూ (విచ్ఛిన్నమైననూ) మరలా మొలచునది. విత్తనం విచ్ఛిన్నమైనా, మొలక వస్తుంది. ఇక్కడ విత్తనం నశించలేదు. మొలకగా మారింది. విత్తనం ఇలా మొలకగా మారడమే – పునర్భవం. దీన్నే పొంది పుచ్చుకోవడం అంటాం.

ఆత్మవాదంలో ఆత్మకీ, దేహాలకీ సంబంధం లేదు.

పునర్భవంలో ఆత్మాలేదూ, దేహమూ లేదు. ఈ రెండు విడివిడిగా లేవు. ఒకటి శాశ్వతమూ కాదు, మరొకటి నశించేదీ కాదు.- శరీరంలోని జీవశక్తి శరీరానికి భిన్నమైందీ కాదు. అది నిరంతరం మారే ఒక ప్రక్రియ లేదా ప్రవాహం మాత్రమే.

– బొర్రా గోవర్థన్‌

First Published:  27 Aug 2015 1:01 PM GMT
Next Story