ఎవరీ హార్దిక్ పటేల్.. ?

పదిరోజుల క్రితం వరకు ఈ హార్ధిక్ పటేల్ ఎవరో భారతీయులకు తెలీయదు. మూడు నెలల క్రితం వరకు ఈ హార్ధిక్ పటేల్ ఎవరో గుజరాతీయులకూ తెలీయదు. ఈ వారం రోజుల్లో రిజర్వేషన్ల పేరుతో ఒక్క ఊపు ఊపాడు ఈ హార్ధిక్ పటేల్. ఈయనేమీ మహాత్మగాంధీ కాదు. రాజకీయపార్టీ నేత కాదు. ఒక ఉద్యమ నిర్మాత కాదు. రాత్రికిరాత్రి తయారైన నేత. ఎవరు తయారు చేసారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకు తయారు చేశారన్నది క్రమంగా అర్ధమవుతూవుంది. 

బిజేపి అధికారంలోకి వచ్చాక ఆర్.ఎస్.ఎస్, భజరంగ్ దళ్, విశ్వహిందు పరిషత్, శివ సేన తదితర సంస్థల ఎజెండాలను అమలు చేయాల్సిన బాధ్యత బిజేపికి తప్పలేదు. సమాజంలో అన్ని వర్గాలు చదువుకోవటం ఇష్టం లేని కొందరు డిటెన్షన్ విధానాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. డిటెన్షన్ విధానం అమలైతే డ్రాప్ ఔట్స్ సంఖ్య బాగా పెరిగిపోతుంది. మధ్యలో చదువులు మానేసే శూద్రులు బాగా ఎక్కువైపోతారు. 

అలాగే రిజర్వేషన్ విధానం మీదకూడా బిజెపి అనుబంధ సంస్థలకు కోపం ఉంది.ఈ సంస్థలకే కాదు సామాన్య పౌరులకు కూడా ఈ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ విధానం పట్ల వ్యతిరేకత ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళ  తరువాత కూడా సామాన్య, గ్రామీణ దళితుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. దళితుల్లో క్రీమి లేయర్ మాత్రమే రిజర్వేషన్ ఫలాల్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నది. కొన్ని దళితుల కుటుంబాల్లో ఒక్కొ కుటుంబంలో ఐదారుగురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు దర్శనమిస్తున్నారు. గ్రామీణ దళితుల జీవితాల్లో అదే చీకటి. ఈ క్రీమి లేయర్ తమ ప్రయోజనాలను వదులుకోదు. ఆ నిరుపేద దళితుల జీవితాలు ఎప్పటికీ బాగుపడవు. దేశాన్ని నడిపిస్తున్న నాయకులకు ఈ విషయాలన్ని తెలియక కాదు. దేశ ప్రయోజనాల కన్నా వాళ్ళకు పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. వోట్ బ్యాంక్ రాజకీయాలు ముఖ్యం.  ఇంకో వందేళ్ళు ఈ రిజర్వేషన్లు అమలు చేసిన ఈ పరిస్థితిలో మార్పురాదు. రిజర్వేషన్ల సిస్టమ్ మారాల్సిందే. కాని ఆ మార్పు ఈ హిందు సంస్థలు కోరుకుంటునట్టు కాదు. దళితులకు రిజర్వేషన్లు రద్దు చేయాలనుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. రిజర్వేషన్లు ఉండాల్సిందే. కాని ఇప్పుడుంటున్న పద్ధతిలోకాదు. 

రాత్రికిరాత్రి హార్దిక్ పటేల్ని సృష్టించడం వల్ల రిజర్వేషన్లమీద చర్చ జరిగి రిజర్వేషన్ వ్యవస్థ సరైన మార్గంలో పడితే సంతోషమే. అలాకాకుండా రిజర్వేషన్లు రద్దు చేసి సమాజాన్ని కులవృత్తులకు పరిమితంచేసే పోకడలు మంచివికావు. ఉన్నట్లుండి నాయకుడైన హార్ధిక్ పటేల్ వెనుక బిజెపి అనుబంధ సంస్థలు ఉన్నాయన్న అనుమానాలను నిజమని నిరూపించే, ప్రవీణ్ తొగాడియా లాంటివారితో హార్ధిక్ పటేల్ సన్నిహితంగా తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. ఆయనెవరి బ్రెయిన్ చైల్డో  దేశప్రజలకి అర్ధమవుతోంది. 

-ప్రజ్ఞాధర్