కాంగ్రెస్‌పై తెరాస ఎదురుదాడి

కాంగ్రెస్ పార్టీ త‌మ‌పై చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని టీఆర్ ఎస్ నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే మంత్రి తుమ్మ‌ల‌, ఎంపీ వినోద్‌లు కాంగ్రెస్ విధానాల‌పై విరుచుకుప‌డ్డారు. షాద్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తుమ్మ‌ల కాంగ్రెస్‌ను త‌న విమ‌ర్శ‌ల‌తో క‌డిగిపారేశారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌లో జ‌రిగిన అవినీతిపై ఉత్త‌మ్‌కుమార్ ఎందుకు నోరు తెర‌వ‌ర‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల నోటికాడ కూడు లాక్కునే కాంగ్రెస్‌కు టీఆర్ ఎస్ పాల‌న‌ను విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పాల‌న‌లో జ‌రిగిన కుంభ‌కోణాలు ప్ర‌జ‌లు ఇంకా మ‌ర్చిపోలేద‌ని గుర్తు చేశారు. మీరు ఏళ్ల‌నాడు మొద‌లు పెట్టిన ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తికాలేద‌ని నిల‌దీశారు. కేసీఆర్ చేప‌ట్టిన వాట‌ర్ గ్రిడ్ ప‌థ‌కం వ‌ల్ల చెరువులు, వాగులు, వంక‌ల్లో నీళ్లు చేరుతున్నాయన్నారు. రూ.25 వేల కోట్ల‌తో ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఘ‌న‌త త‌మ‌దేన‌న్నారు. 36 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఏనాడైనా వేస‌విలో విద్య‌త్తు కోత‌లు విధించ‌కుండా ఉందా? అని సూటిగా ప్ర‌శ్నించారు. కానీ స్వ‌రాష్ర్టం ఏర్ప‌డిన తొలి ఏడాది నుంచే తాము కోత‌లు లేకుండా విద్యుత్తును అందిస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్రజాసంక్షేమ కార్య‌క్ర‌మాలు చూసి ఓర్వ‌లేక అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మం మానుకోవాల‌ని హిత‌వుప‌లికారు.
మీరే ఎందుకు పూర్తి చేయ‌లేదు:  వినోద్‌
ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్‌పై వినోద్ విరుచుకుప‌డ్డారు. ప‌దేళ్ల కాలంలో ఎవ‌రు క‌మీష‌న్ల దందా చేశారో తెలుసున‌ని ఎద్దేవా చేశారు. జ‌ల‌య‌జ్ఞంలో జ‌రిగిన అవినీతి వ‌ల్ల ఎంద‌రు జైలుకు వెళ్లారో లోకం చూసింద‌న్నారు. అలాంటి కాంగ్రెస్‌కు టీఆర్ ఎస్‌ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు ఎక్క‌డ ఉంద‌ని ప్ర‌శ్నించారు. తోట‌ప‌ల్లి, మిడ్‌మానేరు ప‌నులు ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయారో ప్ర‌జ‌లు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాము వ‌చ్చాకే ప్రాజెక్టు ప‌నుల్లో వేగం పెరిగింద‌ని, ఇందుకు జ‌రుగుతున్న ప‌నులే నిద‌ర్శ‌న‌మ‌ని స్ప‌ష్టం చేశారు.