Telugu Global
Others

వీరు… ఆహారానికి ఆక‌లికి మ‌ధ్య‌ వార‌ధులు...మాన‌వ‌త‌కు సార‌ధులు!

జైపూర్‌కి చెందిన కృతీ గుప్తా అనే అమ్మాయి త‌న ఫ్రెండ్  ఇంట్లో జ‌రుగుతున్న ఒక పార్టీకి హాజ‌ర‌య్యింది. ముప్ప‌యిర‌కాల స్వీట్లు, వంట‌కాల‌తో పార్టీ బ్రహ్మాండంగా జ‌రిగింది. అంతా అయిపోయాక ఆ ఇంటి వారికి స‌హాయం చేసేందుకు కృతి ఆగిపోయింది. అక్క‌డ చాలా ప్లేట్ల ఆహారం మిగిలిపోయింది. రుచిక‌ర‌మైన తాజా వంట‌కాల‌ను చెత్త‌కుప్ప‌ల్లో పోయాల్సి వ‌చ్చింది. కృతికి చాలా బాధ‌నిపించింది. స‌రైన ఆహారానికి నోచుకోని వారు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. వారికి ఇవ‌న్నీ అందితే బాగుండును… అని […]

వీరు… ఆహారానికి ఆక‌లికి మ‌ధ్య‌ వార‌ధులు...మాన‌వ‌త‌కు సార‌ధులు!
X

FIజైపూర్‌కి చెందిన కృతీ గుప్తా అనే అమ్మాయి త‌న ఫ్రెండ్ ఇంట్లో జ‌రుగుతున్న ఒక పార్టీకి హాజ‌ర‌య్యింది. ముప్ప‌యిర‌కాల స్వీట్లు, వంట‌కాల‌తో పార్టీ బ్రహ్మాండంగా జ‌రిగింది. అంతా అయిపోయాక ఆ ఇంటి వారికి స‌హాయం చేసేందుకు కృతి ఆగిపోయింది. అక్క‌డ చాలా ప్లేట్ల ఆహారం మిగిలిపోయింది. రుచిక‌ర‌మైన తాజా వంట‌కాల‌ను చెత్త‌కుప్ప‌ల్లో పోయాల్సి వ‌చ్చింది. కృతికి చాలా బాధ‌నిపించింది. స‌రైన ఆహారానికి నోచుకోని వారు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. వారికి ఇవ‌న్నీ అందితే బాగుండును… అని ఆమె అనుకుంది కానీ, ఎలా అందించాలో తెలియ‌దు… ఎక్క‌డికి తీసుకువెళ్లి ఎవ‌రికి ఇవ్వాలో అర్థం కాలేదు. ఇలాంటి ప‌రిస్థితి మ‌న‌దేశంలో చాలామందికి చాలా సంద‌ర్భాల్లో ఎదుర‌వుతూనే ఉంటుంది. వృథాగా పారబోస్తున్న తిండి ఒక చోట‌, పోష‌కాహార లోపంతో రోగాల‌పాల‌వుతున్న చిన్నారులు మ‌రొక చోట‌.

FI 1ఢిల్లీకి చెందిన అంకిత్ క‌వాత్రా కూడా ఒక పెళ్లిలో ఇలాంటి స్థితినే చూశాడు. దాదాపు వెయ్యిమందికి స‌రిప‌డా ఉన్న ఆహారం నిరుప‌యోగ‌మై పోవ‌డం క‌ళ్లారా చూశాక‌…. ఒక‌ మ‌నిషిలో క‌ల‌గాల్సిన స‌హ‌జ‌మైన స్పంద‌న అత‌నిలో క‌లిగింది. అలా 2014 ఆగ‌స్టులో ఫీడింగ్ ఇండియా ఏర్ప‌డింది. ప‌లు న‌గ‌రాల్లో ని యువ‌తీ యువ‌కులు ఫీడింగ్ ఇండియా త‌ర‌పున ప‌నిచేసేందుకు ముందుకొచ్చారు. సామాజిక స్పృహ‌, మాన‌వ‌త్వం ఉన్న వీరంతా వృథాగా పోతున్న ఆహారానికి, ఆహారలేమితో బాధ‌ప‌డుతున్న‌వారికి మ‌ధ్య అనుసంధాన‌క‌ర్తలుగా, హంగ‌ర్ హీరోలుగా మారిపోయారు. వీరంతా న‌గ‌రాల్లో, ప‌ట్ట‌ణాల్లో ప‌లు ప్ర‌దేశాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుంటారు.


FI 2పెళ్లిళ్లు, పార్టీలు, ఇంకా ఏ త‌ర‌హా ఫంక్ష‌న్ల‌లో అయినా మిగిలిపోయి వృథాగా పోతున్న ఆహారాన్ని సేక‌రించి, స‌హాయ‌క శిబిరాల్లో త‌ల‌దాచుకున్న‌వారు, నిరాశ్ర‌యులు, నిరుపేద‌లు, అనాథ‌లు… ఇలా ఇల్లువాకిలీ, ఏ అండా దండా లేని వారి వ‌ద్ద‌కు చేర్చ‌డ‌మే వీరి ప‌ని. అయితే ఇది చిన్న విష‌యం కాదు, ఆహారం పాడు కాకుండా, అత్యంత త్వ‌ర‌గా అవ‌స‌ర‌మున్న వారి చెంత‌కు చేరాలి. అందుకే ఫీడింగ్ ఇండియా త‌ర‌పున ఇర‌వైనాలుగు గంట‌లు అందుబాటులో ఉండే ఒక హెల్ప్ లైన్‌ని ప్రారంభించారు. మిగిలి పోయిన ఆహారం గురించి స‌మాచారం ఇవ్వాల‌నుకున్న‌వారు వీరికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, వ‌చ్చి ఆహారాన్ని తీసుకువెళతారు.

అయితే ఈ హెల్ప్ లైన్‌తో పూర్తిగా ప‌నిజ‌ర‌గ‌ద‌నే విష‌యం అర్థ‌మై, ఫీడింగ్ ఇండియా స‌భ్యులు మ‌రో అడుగు ముందుకేసి, వివిధ కాట‌రింగ్ కంపెనీల‌ను సంప్ర‌దించి వారి స‌హాయం అర్థించారు. ఈ కంపెనీలు తాము ఫుడ్ స‌ప్ల‌యి చేస్తున్న ఈవెంట్ల గురించి ముందుగానే అంకిత్ బృందానికి తెలియ‌జేస్తారు. పార్టీ ముగిశాక మ‌రోసారి ఎంత ఆహారం మిగిలిందో చెబుతూ ఫోన్ చేస్తారు. ఆ ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న హంగ‌ర్ హీరోస్ వ‌లంటీర్లు ఆహారాన్ని సేక‌రించి షెల్ట‌ర్ హోముల‌కు ఆరాత్రే అంద‌జేస్తారు. ఒక‌వేళ రాత్రే ఆహారాన్ని అందించ‌లేక‌పోతే దాన్ని కోల్డ్ స్టోరేజిలో ఉంచి తెల్లారి అంద‌జేస్తారు. ఫీడింగ్ ఇండియాలో ఆహార నాణ్య‌త‌ని ప‌రీక్షించే నిపుణులు సైతం ఉన్నారు. వారు ఓకే అన్న‌త‌రువాతే స్టోర్ చేసిన ఆహారం బ‌య‌ట‌కు వెళుతుంది.


FI 5ఫీడింగ్ ఇండియాలో ఇప్పుడు మొత్తం 750మంది హంగ‌ర్ హీరోలు ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా 20న‌గ‌రాల్లో ప‌నిచేస్తున్నారు. వీరంతా అర్థ‌రాత్రి ఫోన్ వ‌చ్చినా లేచి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉంటారు. ఒకసారి తాము ఐదువేల మందికి స‌రిప‌డా ఆహారాన్ని సేక‌రించామని, దాన్ని స‌ర‌ఫ‌రా చేసేందుకు త‌గిన డ‌బ్బాలు సైతం త‌మ వ‌ద్ద లేక‌పోవ‌డంతో రెండు ట్రిప్పుల‌తో దాన్ని తీసుకువెళ్లాల్సి వ‌చ్చింద‌ని, ఇందులో పాల్గొన్న స‌భ్యులు తెల్లారి ఐదు గంట‌ల‌కు ఇళ్ల‌కు వెళ్లామ‌ని సృష్టి అనే స‌భ్యురాలు పేర్కొన్నారు.

FI 4ఇప్ప‌టివ‌ర‌కు వీరికి ఎలాంటి ఆర్థిక స‌పోర్టు లేదు. త‌మ సొంత డ‌బ్బుతోనే ఇదంతా చేస్తున్నారు. ఒక్కోసారి వీల‌యితే ఆహారం తీసికెళ్లేందుకు వాహ‌నాల‌ను స‌మ‌కూర్చాల్సిందిగా కేట‌రింగ్ కంపెనీల‌ను, ఈవెంట్ మేనేజ‌ర్ల‌ను అడుగుతుంటారు. అయితే అన్నిసార్లూ ఇది సాధ్య‌ప‌డ‌దు. వారు అంగీక‌రించ‌న‌పుడు ఫీడింగ్ ఇండియా, ట్రాన్స్ పోర్టు చార్జీలు చెల్లిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఫీడింగ్ ఇండియా దేశ‌వ్యాప్తంగా 2.5ల‌క్ష‌ల మందికి ఆహారాన్ని అందించి ఉంటుంద‌ని ఓ అంచ‌నా. మ‌రింత ఆహార సేక‌ర‌ణ‌కు వీలుగా ఇప్పుడు వీరు వివిధ కార్పొరేట్ కంపెనీల కేంటిన్లు, పార్టీల్లో మిగిలిన ఆహారం కోసం ఆయా కంపెనీల‌తో అనుసంధాన‌మ‌వుతున్నారు. అలాగే రెస్టారెంట్ల‌ను సైతం త‌మ ఉద్య‌మంలో భాగ‌స్వాముల‌ను చేస్తున్నారు. త‌మ కార్య‌క‌లాపాల ప‌ట్ల అవ‌గాహ‌న పెంచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. త‌మ ప్ర‌చారంలో స్టార్ చెఫ్‌ల‌ను సైతం భాగ‌స్వాముల‌ను చేస్తున్నారు.

ఆహార స‌ద్వినియోగంపై ప్ర‌జ‌ల మైండ్‌సెట్ మార్చ‌డ‌మే ధ్యేయంగా వీరు కృషి చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా యాభై న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు త‌మ సేవ‌లు విస్త‌రించాల‌నే ధ్యేయంతో ఇప్పుడు హంగ‌ర్ హీరోస్ ప‌నిచేస్తున్నారు. బిస్క‌ట్ పాకెట్లు, బ్రెడ్ పాకెట్లు పంచ‌డం స‌రైన ఆహారాన్ని అందించ‌డంగా భావించ‌లేమ‌ని, ప్ర‌తి ఇల్లులేని మ‌నిషికి స‌రైన భోజ‌నం అందాల‌ని తాము ఆశిస్తున్నామ‌ని సృష్టి చెబుతున్నారు. feedingindia2025@gmail.com, లేదా 098711 78810 నెంబ‌ర్లో వీరిని సంప్ర‌దించ‌వ‌చ్చు.

First Published:  2 Sep 2015 6:00 AM GMT
Next Story