Telugu Global
Others

ప్రాణాలు తీస్తున్న‌ అసహనం

సరిగ్గా రెండేళ్ల కింద హేతువాది అచ్యుత్ ధబోల్కర్ హత్య. 2015 ఫిబ్రవరిన కమ్యూనిస్టు నాయకుడు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గోవింద్ పన్సారే హత్య. గత ఆదివారం (ఆగస్టు 30న) కర్ణాటకలోని ధార్వాడ్ లో మల్లేశప్ప మాదివలప్ప కల్బుర్గి హత్య. ఈ మూడు హత్యల్లో కొన్ని సామ్యాలున్నాయి. మూడు సందర్భాలలోనూ హంతకులు ఇద్దరు. వారు మోటారు సైకిళ్ల మీద వచ్చి తమ పని కానిచ్చేసి చక్కా వెళ్లి పోయారు. ధబోల్కర్ హంతకులను, గోవింద్ పన్సారే హంతకులను మహారాష్ట్ర […]

ప్రాణాలు తీస్తున్న‌ అసహనం
X

RV Ramaraoసరిగ్గా రెండేళ్ల కింద హేతువాది అచ్యుత్ ధబోల్కర్ హత్య. 2015 ఫిబ్రవరిన కమ్యూనిస్టు నాయకుడు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గోవింద్ పన్సారే హత్య. గత ఆదివారం (ఆగస్టు 30న) కర్ణాటకలోని ధార్వాడ్ లో మల్లేశప్ప మాదివలప్ప కల్బుర్గి హత్య. ఈ మూడు హత్యల్లో కొన్ని సామ్యాలున్నాయి. మూడు సందర్భాలలోనూ హంతకులు ఇద్దరు. వారు మోటారు సైకిళ్ల మీద వచ్చి తమ పని కానిచ్చేసి చక్కా వెళ్లి పోయారు. ధబోల్కర్ హంతకులను, గోవింద్ పన్సారే హంతకులను మహారాష్ట్ర పోలీసులు ఇంతవరకు కని పెట్ట లేక పోయారు. కల్బుర్గి హంతకులను పట్టుకోవడానికి హంతకులు ఏ మాత్రం సహకరిస్తారో తెలియదు. మన పోలీసులు నిరంతరాన్వేషణలో ఉన్నట్టుగానే ఉంటారు. కాని హంతకులూ నిరవధికంగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతూనే ఉంటారు. హత్యకు గురైన ముగ్గురూ వృద్ద్ధులే. ధబోల్కర్ కు మరణించే నాటికి 65 ఏళ్లైతే పన్సారేకు 84 ఏళ్లు. కల్బుర్గీకి 78 ఏళ్లు. ఈ సామ్యాలు ఇంతటితో ఆగలేదు. ఈ ముగ్గురూ మూఢ నమ్మకాలను ఎదిరించిన వారే.

unnamed (6)మతోన్మాదులనుంచి బెదిరింపులు చవి చూసిన వారే. ముగ్గురూ సాదా సీదా సామాజిక కార్యకర్తలేమీ కారు. ధబోల్కర్ మరణించిన తర్వాత భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బిల్లు ఆమోదించాలని ఆయన దీర్ఘ కాలం పోరాడినా ప్రభుత్వం చలించలేదు. కాని ఆయన మరణం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేస్తే తప్ప అది చట్టం కాదు.

చట్టం ఉన్నంత మాత్రాన మూఢ నమ్మకాలు అంతరిస్తాయని ధబోల్కర్ తో పాటు ఎవరూ ఆశించడం లేదు. మూఢ నమ్మకాలకు ఆది ఏమిటో వెతకడం ఎంత కష్టమో అంతమెప్పుడో ఊహించడమూ అంతే కష్టం. గోవింద్ పన్సారే కమ్యూనిస్టు నాయకుడు కావడంతో పాటు శాస్త్రీయ అవగాహన పెంచడం తన విధి అనుకున్న ‘అమాయకుడు’. ఆయన బహు గ్రంథ కర్త. ఆయన రచనల్లో కొన్ని ఒకటికి రెండు సార్లు పునర్ముద్రణకు నోచుకుంటే మరి కొన్ని పదుల సార్లు పునర్ముద్రించాల్సి వచ్చింది. పునర్ ముద్రణ అవసరం రాని ఆయన గ్రంధం ఒక్కటికూడా లేదు. కల్బుర్గి కూడా రచయిత, విద్యావేత్త. ఆయన హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్ లర్ గా పని చేశారు. 2006లో ఆయనకు జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది.

pansareఅయన‌ వచన సాహిత్యం మీద అపారమైన పరిశోధన చేశారు. శాసన పరిశోధనల్లో దిట్ట. ఆయన చేసిన పాపమల్లా తన పరిశోధనా ఫలితాల ఆధారంగా సత్యశోధన చేయాలనుకోవడమే. అలాంటి పనే చేసిన యు.ఆర్. అనంత మూర్తి లాంటి వారిని సమర్థించడమే. వీరశైవ మత ఆరంభకుడైన బసవ మీద ఆయన‌ చేసిన వ్యాఖ్యలు, చేసిన పరిశోధనలు మత ఛాందసులకు నచ్చ లేదు. మరో వీరశైవ నాయకుడైన చెన్నబసవడు బసవ చెల్లెలికి చెప్పులు కుట్టే వాడైన దోహర కక్కయ్యకు పుట్టిన వాడని కల్బుర్గి తేల్చారు. ఇది మత ఛాందసులకు ఆగ్రహం కలిగించింది.

కల్బుర్గి ఓ సందర్భంలో ప్రాణభయంతో తన పరిశోధనా ఫలితాలలో కొన్నింటిని ఉపసం హరించుకున్నారు. ” నా కుటుంబం ప్రాణాలు కాపాడడానికే నేను నా వాదనలను ఉపసం హరించుకున్నాను. కానీ ఆ రోజే ఆలోచనా పరుడిగా ఆత్మ హత్య చేసుకున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహారాధనను వ్యతిరేకించే వారు. మత ఛాందసవాదులనుంచి ఆయనకు ప్రాణ భయం ఉండేది. అందువల్ల ఆయనకు భద్రత కూడా కల్పించారు. కాని ఆ భద్రత తొలగించాలని ఆయనే కోరడంతో ఇటీవలే భద్రతా ఏర్పాట్లు ఉపసం హరించారు. ఇదే అదునుగా గత ఆదివారం రోజున ఒక వ్యక్తి ఆయన ఇంటి తలుపు తట్టాడు. ఆయన భార్య తలుపు తెరిచి ఎవరు అని అడిగితే “సార్ విద్యార్థిని” అని చెప్పారు. ఈ లోగా కల్బుర్గి తలుపు దగ్గరకు వచ్చారు. ఆగంతుకుడు దగ్గర నుంచి కాల్పులు జరిపి ఇంటి బయట మోటార్ సైకిలు పై వేచి ఉన్న తన సహచరుడితో కలిసి వెళ్లి పోయాడు. కల్బుర్గీని ఆసుపత్రికి తరలించారు కాని ఆ సరికే ఆయన ప్రాణాలు విడిచారు.

220px-NarendraDabholkarధబోల్కర్ మాత్రం పోలీసుల రక్షణ తీసుకోవడానికి అంగీకరించలేదు. “నా దేశంలో, నా సొంత ప్రజల నుంచే రక్షణ తీసుకోవడం అంటే నాలోనే ఏదో లోపం ఉన్నట్టే. నేను భారత రాజ్యాంగ పరిధిలో పోరాడుతున్నానే తప్ప ఎవరికి వ్యతిరేకంగానూ పోరాడడం లేదు. అందరి కోసం పోరాడుతున్నాను” అన్నారు. ఇలా అందరి కోసం పోరాడడం మత ఛాందసులకు నచ్చలేదు. ఆయనను అంతమొందించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అందులో ఏ లోపమూ లేదు. కాని దర్యాప్తు చేయాల్సిన సీబీఐ తన దగ్గర సిబ్బంది కొరత ఉందని చెప్పడం వల్ల దర్యాప్తుది గొంగళీ కధగానే మిగిలింది.

ఈ మూడు హత్యల విషయంలోనూ హంతకులు దొరకకపోవడంలోనూ సామ్యం ఉంది. అయితే కల్బుర్గి విషయంలో ఆ మాట చెప్పడానికి కొంత కాలం వేచి ఉండడం న్యాయం. అనేక హత్యల విషయంలో హత్య వాస్తవం, హంతకులు పట్టుబడక పోవడం దుర్లభం అనీ తెలుసు. కాని ఈ మూడు హత్యలు జరిగిన తీరులో పోలికలున్నాయి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఏరి ఏరి చంపడం అన్న వాస్తవం ఉంది. హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకించిన చరిత్ర మరణించిన ముగ్గురికీ ఉంది. వారిని బెదిరించిన వారూ హిందూ మతోన్మాదులే. హంతకులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యమూ ఒకే తీరులో ఉంది. కల్బుర్గి మరణ వార్త విన్న తర్వాత కొన్ని హిందూత్వ సంస్థలకు చెందిన వారు సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. మంగుళూరుకు చెందిన బజ్రంగ్ దళ్ ప్రముఖ నాయకుడు భువిత్ శెట్టి “అప్పుడు అనంత మూర్తి, ఇప్పుడు కల్బుర్గి. హిందూ మతాన్ని అవహేళన చేసి కుక్క చావు చావండి. కె.ఎస్. భగవాన్ ఇక నీ వంతు” అని ట్విట్టర్ లో పలికారు. భగవాన్ మైసూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన వారు. ఆయనా హిందూ బృందాల నుంచి బెదిరింపులు ఎదుర్కుంటూనే ఉన్నారు.

కల్బుర్గీ అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చాలా అభిమానం. కల్బుర్గీ మరణ వార్త తెలిసిన వెంటనే సిద్ధ రామయ్య 430 కిలోమీటర్ల దూరంలో ధార్వాడ్ కు హుటాహుటిన వెళ్లారు. కల్బుర్గీ హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ప్రతిజ్ఞ కూడా చేశారు. కల్బుర్గీని హతమార్చింది ఫలానా వర్గం వారేనని తీర్మానించేయడం తొందరపాటే అవుతుంది. అయితే మతాచారాలను, మిథ్యలను ఎండగట్టే వారిని సహించేది లేదని మత ఛాందసులు బాహాటంగానే హెచ్చరిస్తున్నారన‌డానికి ఈ మూడు హత్యలూ ఉదాహరణలే. భిన్నాభిప్రాయాన్ని సహించలేని తత్వం పెరిగి పోతోంది. ఇలా అసహనం వ్యక్తం చేసే వారు హింసా మార్గాన్ని అనుసరిస్తున్నారనడానికి ఈ హత్యలే నిదర్శనం. ఇలాంటి వారికి కళ్లేం వేయకపోతే భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగక తప్పదు. అప్పుడు ప్రజా స్వామ్యం చిరునామా చిమ్మ చీకట్లో
వెతుక్కోవాల్సిందే.

-ఆర్వీ రామారావు

First Published:  2 Sep 2015 2:13 AM GMT
Next Story