మరణ దండన రద్దుకు మినహాయింపులా! 

RV Ramaraoఒక్క తీవ్రవాదుల విషయంలో మినహా వీలైనంత త్వరలో మరణశిక్ష రద్దు చేయాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. దేశంపై యుద్ధం ప్రకటించే వారికి కూడా మరణ దండన విధించవచ్చునని లా కమిషన్ అభిప్రాయ పడింది. మరణ శిక్ష కొనసాగించాలా వద్దా అన్న విషయంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ చర్చ మన దేశానికే పరిమితమైంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉంటే 140 దేశాలు మరణ శిక్ష రద్దు చేశాయి. ఏడు దేశాలు సాధారణ నేరాలకు మరణ శిక్ష విధించడం లేదు. 35 దేశాలు చట్ట రీత్యా మరణ శిక్ష రద్దు చేయకపోయినా ఆచరణలో అమలు చేయడం లేదు. 
గొప్ప ప్రజాస్యామ దేశం అని చెప్పుకునే అమెరికా, అతి విశాలమైన ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్న భారత్ లో మరణ శిక్ష కొనసాగుతోంది. సోషలిస్టు వ్యవస్థో, కమ్యూనిస్టు వ్యవస్థో అమలులో ఉన్నాయంటున్న చైనా, క్యూబా, వియత్నం దేశాలలోనూ మరణ శిక్ష అమలు లో ఉంది. అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికాకు వంత పాడుతూ తద్దినం పెట్టే వాడి తమ్ముడి పాత్ర పోషించే యునైటెడ్ కింగ్డం మాత్రం 1973లోనే మరణ శిక్ష రద్దు చేసింది. ఎంత చిన్న సాకు దొరికినా మన దేశం ఎడ్డెం అంటే తెడ్డెం అనే పాకిస్తాన్ మాత్రం మన బాటలోనే మరణ శిక్ష అమలు చేస్తూనే ఉంది. అభివృద్ధికి ఆనవాలనని భావించే సింగపూర్ లోనూ మరణ శిక్ష విధించే పద్ధతి పరిఢవిల్లుతూనే ఉంది.  
మన దేశంలో అయితే సాధారంగా శిక్షలు దిక్కూ దివాణం లేని వారికి, కింది కులాల వారికి, పేదలకు; వేలు, లక్షలు ఖర్చు పెట్టి న్యాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోలేని నిర్భాగ్యులకు, ఇటీవలి కాలంలో అయితే ఇస్లామిక్ తీవ్రవాదులకు మాత్రమే మరణ శిక్ష విధిస్తారన్న వాదన బలంగానే ఉంది. 
మరణ శిక్ష విధించడం అంటే చట్టం పేరు చెప్పి రాజ్యం ఒక మనిషి ప్రాణం తీయడమే. వ్యక్తి మరో వ్యక్తి ప్రాణం తీయడం నేరమైనప్పుడు, రాజ్యమే చట్టం ఆసరాగా హత్యకు పాల్పడడం న్యాయం ఎలా అవుతుందో అంతుబట్టదు. కానీ మరణ శిక్షలు విధించవలసిని నేరాలు కొన్ని ఉన్నాయన్న అభిప్రాయం బలంగానే ఉంది. అత్యాచారాలకు పాల్పడే వారికీ, అందునా మూకుమ్మడిగా, చిత్ర విచిత్రమైన రీతిలో మహిళల మీద అత్యాచారాలకు పాల్పడే వారికి, దేశద్రోహులకు, తీవ్రవాదులకు మరణ శిక్ష విధించడం సబబే అన్న ధోరణి అత్యున్నత న్యాయస్థానికీ ఉంది. 
బచ్చన్ సింగ్ కేసులో తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు “అరుదాతి అరుదైన” సందర్భాలలో మాత్రమే మరణ శిక్ష విధించాలని హితవు చెప్పింది. అరుదాతి అరుదైన సందర్భాన్ని ఎవరు, ఎలా నిర్ధారిస్తారో తెలియదు. ఇందులో న్యాయమూర్తుల వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రమేయం ఉండే ప్రమాదం లేక పోలేదు. మరణ శిక్షను మన చట్టాలలోంచి పూర్తిగా తొలగించాలన్న న్యాయమూర్తులూ ఉన్నారు. మరణ శిక్ష విధించే అవకాశాన్ని చట్టం కల్పిస్తోంది కనక విధిస్తున్నామని సమర్ధించుకునే న్యాయ మూర్తులూ ఉన్నారు. ప్రాణం తీసిన వ్యక్తికి సజీవంగా ఉండే అధికారం లేదు అని వాదించే న్యాయమూర్తులూ ఉన్నారు. తాము విధించిన అనేక మరణశిక్షల్లో పొరపాటు నిర్ణయం జరిగిందని తీరికగా నాలిక కరుచుకున్న న్యాయమూర్తులూ ఉన్నారు. వెరసి మరణ శిక్ష ఉండాలా లేదా అన్న విషయంలో న్యాయాన్యాలను కాచి వడబోసి తీర్పు చెప్పాల్సిన వారిలోనే ఏకాభిప్రాయం లేదు. అలాంటప్పుడు “అరుదాతి అరుదైన” అన్న మాటను ఎలా నిర్వచించగలం? 
లా కమిషన్ ఇటీవల విడుదల చేసిన 262వ నివేదికలో సరిగ్గా ఇదే ప్రశ్న లేవనెత్తి తీవ్రవాదుల విషయంలో తప్ప ఇతర సందర్భాలలో మరణ శిక్ష సత్వరం రద్దు చేయాలని సిఫార్సు చేసింది. అరుదాతి అరుదైన సందర్భాన్ని లోప రహితంగా నిర్ణయించడం అసాధ్యమని లా కమిషన్ తేల్చింది. అంటే బచ్చన్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పుకన్నా లా కమిషన్ ఓ అడుగు ముందుకేసింది. 
సంతోశ్ కుమార్ సతీశ్ భూషణ్ బరియార్ కేసు(2009), శంకర్ కిషన్ రావు ఖడే (2013) కేసులో మరణ శిక్షపై అభిప్రాయం చెప్పాలని సుప్రీం కోర్టు లా కమిషన్ ను కోరినందువల్ల లా కమిషన్ 262వ నివేదికలో మరణ శిక్ష రద్దుకు మినహాయింపులతో సిఫార్సు చేసింది. ఈ విషయమై తాజా, సమగ్ర అధ్యయనం చేయాలని సుప్రీం కోర్టు కోరింది. సుప్రీం కోర్టు ఈ అంశంపై లా కమిషన్ అభిప్రాయం కోరడం ఇదే మొదటి సారి కాదు. 1967లో  లా కమిషన్ ఈ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించి 35వ నివేదికలో మరణ శిక్ష కొనసాగాలని సిఫార్సు చేసింది. ఇప్పుడు తీవ్రవాదులు, దేశం పై యుద్ధం చేసే వారి విషయంలో మినహా మిగతా సందర్భాలలో మరణ శిక్ష సత్వరం రద్దు చేయాలని 262వ నివేదికలో చెప్పింది. 
మునుపటి అభిప్రాయం ఎందుకు మారిందో కూడా లా కమిషన్ విడమర్చింది. 1967 నాటి నివేదికకు, తాజా నివేదికకు మధ్య 48 ఏళ్ల అంతరం ఉంది. ఈ మధ్య కాలంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మారిపోయాయి కనక ఇప్పుడు మరణ శిక్ష రద్దు చేయాల్సిన తరుణం ఆసన్నమైందని లా కమిషన్ అభిప్రాయం. ఈ అంశం చాలా సున్నితమైందన్న విషయం వాస్తవం. అందుకే లా కమిషన్ లోతుగా అధ్యయనం చేసింది. 2014 మేలో కమిషన్ ఓ సమాలోచన పత్రం విడుదల చేసి చర్చకు ఆహ్వానించింది. దానితో పాటు 2015 జులై 11న దిల్లీలో “దేశంలో మరణ దండన” అన్న అంశంపై ఒక రోజు సదస్సు నిర్వహించి సంప్రదింపులు జరిపింది. సునిశిత పరిశీలన తర్వాతే లా కమిషన్ మరణ శిక్ష రద్దుకు సిఫార్సు చేసింది. 
తొమ్మిది మంది సభ్యులున్న లా కమిషన్ సిఫారసు ఏకాభిప్రాయంతో కూడింది కాదన్న విషయాన్ని గమనించాలి.  పూర్తి కాలం పని చేసే ఒక సభ్యుడు, ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించే ఇద్దరు సభ్యులు మరణ శిక్ష రద్దుకు సుముఖంగా లేరు. లా కమిషన్ లో పాక్షిక సభ్యుడిగా కొనసాగుతున్న డా. యోగేశ్ త్యాగి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన అనుమానాలు తీరాయి. అయితే  దేశంలో లేనందువల్ల ఈ నివేదికపై ఆయన సంతకం చేయడం కుదరలేదు. కమిషన్ సభ్యురాలిగా ఉన్న, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఉషా మెహ్రా, న్యాయ శాక్ష కార్యదర్శి పి.కె. మల్ హోత్రా, లెజిస్లేటివ్ విభాగ కార్యదర్శి డా. సంజయ్ సింగ్ (వీరిద్దరూ ఎక్స్ అఫీషియో సభ్యులు) నివేదిక పై సంతకం చేయలేదు. వీరు ఈ అంశంపై విడిగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటిని కూడా నివేదికకు అనుబంధాలుగా జత చేసి ప్రభుత్వానికి పంపించారు. 
లా కమిషన్ కు అధ్యక్షులు, ముగ్గురు పూర్తి కాలం పని చేసే సభ్యులు, ప్రభుత్వ ప్రతినిధులుగా ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు, ముగ్గురు పాక్షిక సభ్యులు ఉంటారు. దిల్లీ హై కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి ఎ.పి. షా కమిషన్ అధ్యక్షులుగా ఉన్నారు. 
లా కమిషన్ తాజా నివేదిక మరణ శిక్షను మినహాయింపులతోనైనా రద్దు చేయాలని సిఫార్సు చేయడం ఆహ్వానించదగిన నాగరికమైన భావన. తీవ్రవాదులు, దేశంపై యుద్ధం ప్రకటించే వారికి మాత్రం మరణ శిక్ష విధించవచ్చునని చెప్పడం ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పిన మాటలా ఉంది. తీవ్రవాదం బుస కొడ్తున్న సందర్భంలో తీవ్రవాదులని తేలిన వారికి కూడా మరణ శిక్ష విధించకూడదంటే అది జనాభిప్రాయానికి భిన్నంగా ఉంటుందనుకుని జాగ్రత్త పడినట్టుగా ఉంది. ఈ నివేదికలో గమనించవలసిన మరో అంశం మరణ శిక్ష హత్యాకాండకు పాల్పడే వారి విషయంలో నిరోధకంగా పని చేయదని నిర్ద్వంద్వంగా చెప్పడం. నిరోధకంగా పని చేయడమే నిజమైతే మరణ శిక్ష పడుతుందన్న భయంతో హత్యలకు పాల్పడే వారే ఉండే వారే కాదు. మరణ శిక్ష రద్దు చేసిన దేశాలలో హత్యలు పెరిగిన దాఖలాలు, అమలులో ఉన్న దేశాలలో హత్యలు తగ్గిన ఉదంతాలు లేవు. అంటే శిక్ష నిరోధకంగా పని చేయడం లేదు. సంస్కరణకు అవకాశం కల్పించడమే శిక్ష లక్ష్యం కావాలి. కసి తీర్చుకోవడం కాదు. 
1993 ముంబై మారణకాండకు కారకులైన వారికి తాము దొరికి పోయి, నేరం రుజువైతే మరణ దండన తప్పదని తెలుసు. అయినా 2001లో పార్లమెంటు మీద తీవ్ర వాదుల దాడి ఆగలేదు. ఈ దాడికి బాధ్యూలైన వారిని భద్రతా దళాలు అక్కడికక్కడే మట్టుబెట్టాయి. అయినా 2008 మారణ హోమం జరగనే జరిగింది. అందువల్ల తీవ్రవాదులకు మరణ దండన కొనసాగించవచ్చునన్న లా కమిషన్ భావన లోపభూయిష్టమైందే. 
-ఆర్వీ రామారావ్