Telugu Global
Family

సోమరిపోతు (For Children)

సంతాల్‌ ప్రజలు కష్టజీవులు. అడవుల్లో,పొలాల్లో ఇంట్లో పనిచేస్తారు. సాయంత్రాలు విశ్రాంతి తీసుకుంటారు. సమావేశ స్థలంలో ఆటపాటల్తో నృత్యాల్లో ఆనందంగా గడుపుతారు. వాళ్ళు బద్ధకస్థులు కారు. గ్రామంలో బద్ధకస్తుడున్నా అన్నదమ్ముల్లో ఒకడు బద్ధకస్థుడయినా వాళ్ళు భరించలేకపోయేవాళ్ళు. ఎత్తిచూపేవాళ్ళు. తక్కువగా చూసే వాళ్ళు. వాళ్ళ గురించి నవ్వులాటగా ఆటపట్టించేవాళ్ళు. సోమరిపోతులు ఒళ్ళువంచి పనిచెయ్యరు కానీ వాళ్ళల్లో తెలివైన వాళ్లూ ఉంటారు. సమయం వస్తే తమ తెలివితేటల్లో కొన్ని చిత్రమయిన పనులు చెయ్యడంలో నిపుణులు, మాటల్తో ఎదుటివాళ్ళని మభ్యపెట్టేవాళ్ళు. ముగ్గురు అన్నదమ్ముల్లో […]

సంతాల్‌ ప్రజలు కష్టజీవులు. అడవుల్లో,పొలాల్లో ఇంట్లో పనిచేస్తారు. సాయంత్రాలు విశ్రాంతి తీసుకుంటారు. సమావేశ స్థలంలో ఆటపాటల్తో నృత్యాల్లో ఆనందంగా గడుపుతారు. వాళ్ళు బద్ధకస్థులు కారు. గ్రామంలో బద్ధకస్తుడున్నా అన్నదమ్ముల్లో ఒకడు బద్ధకస్థుడయినా వాళ్ళు భరించలేకపోయేవాళ్ళు. ఎత్తిచూపేవాళ్ళు. తక్కువగా చూసే వాళ్ళు. వాళ్ళ గురించి నవ్వులాటగా ఆటపట్టించేవాళ్ళు.

సోమరిపోతులు ఒళ్ళువంచి పనిచెయ్యరు కానీ వాళ్ళల్లో తెలివైన వాళ్లూ ఉంటారు. సమయం వస్తే తమ తెలివితేటల్లో కొన్ని చిత్రమయిన పనులు చెయ్యడంలో నిపుణులు, మాటల్తో ఎదుటివాళ్ళని మభ్యపెట్టేవాళ్ళు.

ముగ్గురు అన్నదమ్ముల్లో కోరా చిన్నవాడు. అన్నదమ్ములు కష్టపడుతూ ఉంటే సోమరిపోతుగా తిరిగేవాడు, తప్పించుకునేవాడు. ఒకరోజు తల్లిదండ్రులు, అన్నలు అందరూ కలిసి కోరాను తిట్టారు. దాంతో కోరా అలిగి ఇంట్లోంచీ వెళ్ళిపోయాడు.

అది చలికాలం. అతను పల్చటి బట్టలు వేసుకున్నాడు. చలికి వణికిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తోచలేదు. అట్లా వెళుతూ ఉంటే ఎదురుగా ఒక పల్లె కనిపించింది. సంతోషించాడు. రోడ్డు పక్క కొందరు కుర్రాళ్ళు చలిమంట వేసుకుని కూచున్నారు. వాళ్ళ మధ్య కూచుని చలికాచుకున్నాడు. సంతాల్‌ ప్రజలు అడవి ఎలుకల్ని కాల్చుకుని తింటారు. ఆకుర్రాళ్ళు కూడా ఎలుకల్ని కాలుస్తూ తింటున్నారు. వాళ్ళ మధ్యలో కూచున్న కోరాకు కూడా కాల్చిన ఎలుకను ఇచ్చారు. తిన్నాడు. గంట గడిచిన తర్వాత కుర్రాళ్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయారు. చివరికి కోరా ఒక్కడే మిగిలాడు. పడుకోవడానికి స్థలం లేదు. ఏం తోచక మంట పక్కనే పడుకున్నాడు. ఇబ్బందిగా ఉన్నా తప్పదు గనక నిద్రకు ఉపక్రమించాడు. అంతలో చలికి వణుకుతూ ఒక కుక్క వచ్చి కోరా పక్కనే పడుకుంది.

తెల్లవారింది. ఎండ చురుగ్గా తగిలింది. కోరా కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడే ఆ దారంటే వెళుతున్న గ్రామపెద్ద అక్కడ ఆగి ‘ఏమయ్యా! ఇంత చలిలో ఆరుబయట పడుకున్నావు. నీకు చలి వెయ్యదా?’ అన్నాడు. కోరా తన పక్కనే పడుకున్న కుక్కను చూశాడు. మెదడు చురుగ్గా పనిచేసింది. ఒక ఆలోచన వచ్చింది.

నా కుక్క నాతో బాటు ఉంటే చలి ఎందుకుంటుంది. నాకుక్క వందమంది చలిని తినేస్తుంది. అందువల్ల వెచ్చగా నిద్రపోతాను అన్నాడు. వెళ్ళబోతున్న గ్రామపెద్ద ఆగి ఆశ్చర్యంగా కుక్కను చూశాడు. ఆయన దగ్గర వందమంది పనివాళ్ళున్నారు. వాళ్ళకు కంబళ్ళ కొనడానికి ఎంతకర్చవుతుంది. అదే ఈ కుక్క ఉంటే ఆ ఖర్చు తగ్గిపోతుంది కదా!’ అని కోరాను ‘కుక్కను ఎంత కమ్ముతావు?’ అని అడిగాడు.

కోరా గ్రామపెద్దను బుట్టలో వేశాననుకుని ఐదువందల రూపాయలు అన్నాడు. ఇద్దరి మధ్య బేరసారాలు సాగాయి. చివరికి వందరూపాయలకు బేరం కుదిరింది. గ్రామపెద్ద వందరూపాయలిచ్చి కుక్కను తీసుకున్నాడు. కోరా వందరూపాయలు తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఆ డబ్బును సోదరులకు ఇచ్చాడు. తమ తమ్ముడు అంత డబ్బును ఒక్కరోజులో తీసుకురావడంతో ఆశ్చర్యపోయారు. తమ తమ్ముడి తెలివితేటలకు గర్వపడ్డారు.

ఈ మధ్యలో ఆ గ్రామపెద్ద తమ విలువైన ఒక క్కును కొన్నాడని అది చలిని తిని అందర్నీ వెచ్చగా పెడుతుందని తన ఇంటికి వర్తమానం పంపాడు. ఆ రాత్రికి తన ఇంట్లో పనిచేసే వందమందిని ఒకే గదిలో పడుకోమని చెప్పి వాళ్ళతో బాటు కుక్కను

ఉంచాడు. ఆ రాత్రంతా వందమంది పనివాళ్ళు వణికిపోతూ గడిపారు. తెల్లవారాకా యజమాని వచ్చి చూసి తను మోసపోయానని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో కర్ర తీసుకుని ఆ నోరులేని కుక్కని కొట్టడం ఆరంభించాడు. కుక్క పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. డబ్బు పోగొట్టుకోవడమే కాక గ్రామస్థులందరూ ఆయన్ని చూసి నవ్వారు.

కోరా పరిస్థితిలోనూ పెద్దమార్పులేదు. కేవలం వందరూపాయల్తో ఇంట్లో వాళ్ళ దగ్గర ఎంతోకాలం మంచివాడనిపించుకోలేక పోయాడు. ఎందుకంటే ఎప్పట్లా పనీపాటా చెయ్యకుండా సోమరిగానే ఉండిపోయాడు. దానివల్ల మళ్ళీ ఇబ్బందులు మొదలయ్యాయి. మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. వెనుకటి లాగే కోరా ఇంట్లోంచి బయటపడ్డాడు. ఇటూ అటూ చూసుకుంటూ నడుస్తున్నాడు. అంతలో పక్కనే ఉన్న ఒక నీటిగుంట అంచులో ఒక పీతబొరియలోకి పోవడానికి ప్రయత్నించడం చూశాడు. వెంటనే ఆ పీతను పట్టుకుని ఒక గుడ్డలో మూట కట్టుకుని బయల్దేరాడు. రోజంతా నడిచి సాయంత్రానికి ఒక పల్లె చేరాడు. ఊరిచివర ఆ రాత్రికి ఒక చెట్టుకింద బసచేశాడు. ఆ గ్రామస్థులు అతన్ని చూసి తమ ఇళ్ళకు వచ్చి ఆ రాత్రికి బసచెయ్యమని కోరారు.

కోరా ‘వాళ్ళతో’ నా గురించి బాధపడకండి. నేను ఒంటరివాణ్ణికాను. నాకు తోడుంది. నా తోడుతో నేను సంతోషంగా గడుపుతాను అన్నాడు. ఆగ్రామస్థులు ఇతనెవరో చిత్రమయిన వ్యక్తిలా ఉన్నాడనుకున్నారు. ఎందుకంటే అక్కడ అతను తప్ప ఎవరూ లేరు. తనేమో నాకు తోడు ఉన్నారు. ఒంటర్ని కాను అంటున్నాడు అనుకుని విస్తుపోయారు. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.

చీకటి పడింది. కోరా తన మూట విప్పి పీతను వదిలేసి నిద్రపోయాడు. ఆ పీత అక్కడక్కడే తిరుగుతూ ఉండగా ఉన్నట్లుండి శబ్దం వచ్చింది. ఒక రాక్షసుడు అడుగులు వేసుకుంటూ అటుగా వచ్చాడు. ఒంటరిగా పడుకున్న కోరాను చూశాడు. కోరాను తినాలన్న ఆరాటంతో అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చాడు. అక్కడక్కడే తచ్చాడుతున్న పీత తన యజమానికి ఏదో ప్రమాదం జరగబోతోందని పసిగట్టింది. వెంటనే సరాసరి రాక్షసుడిపైకి పాకి అతని పీకను పట్టుకుంది. హఠాత్తుగా జరిగిన ఈపరిణామానికి తోచని రాక్షసుడు కాలికి ఒక రాయి తగిలి దబ్బున కిందకు పడ్డాడు. ఆ శబ్దానికి కోరాకు మెలకువ వచ్చింది. వెంటనే పరిస్థితిని గమనించాడు. ఒక రాయి తీసి రాక్షసుడి తల పగలగొట్టాడు. రాక్షసుడు ఆ దెబ్బతో చచ్చాడు. కోరా రాక్షసుడి చెవి, నాలుక,

గోళ్ళు కోసి దాచాడు. మళ్ళీ ఎప్పట్లాగే నిద్రపోయాడు. పీత అక్కడక్కడే తిరుగుతూ కాలక్షేపం చేసింది.

ఉదయాన్నే గ్రామానికి చెందిన కాపలాదారుడు అటువేపు వచ్చి చనిపోయిన రాక్షసుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఆరాక్షసుడితో ఆరాజ్యంలో ఎంతో అల్లకల్లోలం జరిగింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. రాజుగారు ఆ రాక్షసుణ్ణి చంపినవాళ్ళకు గొప్పగొప్ప బహుమానాలు ప్రకటించారు. కాపలాదారుడు ఆ బహుమానాలన్నీ తనే కొట్టేద్దామని రాజు దగ్గరికి వెళ్ళి రాక్షసుణ్ణి చంపానని చెప్పాడు. రాజు స్వయంగా అక్కడికి వచ్చి చనిపోయిన రాక్షసుణ్ణి చూశాడు. అలికిడికి పడుకున్న కోరాకు మెలకువ వచ్చింది. రాజు నువ్వు రాక్షసుణ్ణి చంపానంటున్నావు. మరి రాక్షసుడి చెవులు, నాలుక, గోళ్ళు ఏం చేశావు’ అని కాపలా వాణ్ణి అడిగాడు. వాడు సమాధానం చెప్పలేక కళ్ళు తేలేశాడు.

అప్పుడు అక్కడే ఉన్న కోరా తను మూటకట్టిన చెవులు, నాలుక గోళ్ళు రాజుకు చూపించి జరిగిన విషయం వివరించాడు. తన పీత చేసిన సాయం చెప్పాడు. భయంతో కావలివాడు రాజుగారి పాదాలమీద పడి క్షమాపణ కోరాడు.

రాజు సంతోషంతో కోరాకు తను ప్రకటించిన దానికన్నా ఘనమయిన బహుమానాల్ని, ధనాల్ని ఇచ్చాడు.

అంత సంపదతో ఇంటికి వచ్చి తమ్ముణ్ణి అన్నలు ఆ తరువాత ఎప్పుడూ బాధపెట్టలేదు.

– సౌభాగ్య

First Published:  4 Sep 2015 1:02 PM GMT
Next Story