రాక్షసరూపంలో భర్త (For Children)

సంతాల్‌ ప్రజలు మనిషి ఆత్మ తరచుగా బయటికి వెళ్ళి వేరువేరు జంతువుల ఆకారం ధరించి మళ్ళీ శరీరంలోకి వస్తూ ఉంటుందని ఆ జ్ఞాపకాలే మనిషి కలల్లో మెదుల్తాయని నమ్ముతారు. అట్లా ఒక వ్యక్తి ఆత్మకు సంబంధించిన కథ ఇది.

పూర్వం సంతాల్‌ పరగణాల్లో ఒక సంపన్నుడయిన వ్యక్తి ఉండేవాడు. కానీ ఎప్పుడూ తప్పతాగి ఉండేవాడు. అందువల్ల అతని భార్య ఎన్నో కష్టాలు పడింది. ఎంతగా తాగేవాడంటే అతని కొడుకుని కూడా అతను గుర్తుపట్టలేకపోయేవాడు.

ఒకరోజు ఇంట్లో పనివాళ్ళతో బాటు కొడుకును కూడా వరుసగా నిలబెట్టింది. ఆరోజు సంపన్నుడు కొంత మెలకువలో ఉన్నాడు. తాగిలేడు. అతని భార్య కొడుకును, పనివాళ్ళని చూపించి వీళ్ళలో నీ కొడుకు ఎవరో చెప్పు అంది. తన కొడుకెవరో అతను గుర్తుపట్టలేకపోయాడు. భార్యతో బాటు అందరూ విరగబడి నవ్వారు. దాంతో ఎంతో అవమానం పొందినవాడిలా అతను ఆరోజు నించీ తాగడం మానేశాడు.

కొన్నాళ్ళు గడిచాకా భార్య కొడుకు కోసం మంచి అమ్మాయిని వెతకమంది. అతను బయల్దేరాడు. కొంత డబ్బును ఒక గుడ్డలో కట్టి నడుముచుట్టూ గట్టిగా బెల్టులా కట్టుకుని ప్రయాణమయ్యాడు.

మొన్నమొన్నటిదాకా మనదేశంలో కొడుకునయినా కూతురుకయినా తల్లిదండ్రులే సంబంధాలు వెతికేవాళ్ళు. ఇప్పుడా పరిస్థితి మారిందనుకోండి. ఇప్పుడయినా ఎక్కడో మారుమూలల్లో తల్లిదండ్రులే పిల్లలకు సంబంధాలు చూస్తూ ఉండడం ఉంది. సంతాల్‌ పరగణాల్లో వరకట్నం ఉండేది. డబ్బిచ్చి అమ్మాయిని కొనుక్కోవడం ఉండేది. అబ్బాయి తండ్రి డబ్బును నడుముకు కట్టుకుని బయల్దేరడానికి అదే కారణం.

అతను ఎన్నో గ్రామాలు తిరిగాడు. అమ్మాయిలు నీళ్ళ బావుల దగ్గర ఎక్కువగా కనిపిస్తారు. ఇంటికి నీటికోసం బావుల కోసం వస్తారు. ఇతర ఎన్నో గ్రామాల్లో బావుల దగ్గర తన కొడుక్కి తగిన అమ్మాయి కనిపిస్తుందా? అని వెతికాడు. చివరకు ఒక గ్రామంలోని బావి దగ్గర ఎంతో అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి నీళ్ళబిందెతో బయల్దేరితే ఆ అమ్మాయిని అనుసరించాడు. ఆ అమ్మాయి ఒక ఇంట్లోకి వెళ్లింది. ఇతను ఇంటి ముందున్న అరుగు మీద కూచున్నాడు. ఇంట్లో నించీ ఆ అమ్మాయి తండ్రి బయటికి వచ్చి అతన్ని చూసి ఎవడో బిచ్చగాడనుకున్నాడు. తనకొడుక్కి సంబంధం కోసం తిరుగుతున్నానని, మీ అమ్మాయి నచ్చిందని అతనన్నాడు. అమ్మాయి తండ్రి నవ్వి నువ్వు చూస్తే ఏమి ఇచ్చుకునే స్థోమత నీకు ఉన్నట్లు కనిపించడం లేదు. నువ్వు పేదవాడిలా వున్నావు అన్నాడు.

అబ్బాయి తండ్రి నువ్వు ఎంత ఆశిస్తున్నావు? అన్నాడు.

అమ్మాయి తండ్రి ఒక ఆవు, ఆరుకోళ్ళు, బస్తా బియ్యం అన్నాడు.

అబ్బాయి తండ్రి నిర్మలంగా నడుముకున్న సంచితీసి అందులోని డబ్బును అమ్మాయి తండ్రికిచ్చాడు. అది చాలా పెద్దమొత్తం. ఆ కట్నం కన్నా మూడింతలు ఉంది. అమ్మాయి తండ్రి ఎంతో ఆనందించి అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి మంచి భోజనం పెట్టి సంబంధం స్థిరపరిచాడు. ముహూర్తాలు పెట్టుకున్నారు. ఎంతో ఆనందంతో వియ్యంకుడి దగ్గర వీడ్కోలు తీసుకుని విషయం ఇంట్లో చెప్పడానికి ఇతను బయల్దేరాడు. తన గ్రామానికి చేరేముందు అడవి గుండా వెళుతూ ఉంటే దురదృష్టవశాత్తూ ఒక పులి అతన్ని చంపేసింది.

దాంతో ఈ విషయం అతని భార్యకు, కొడుక్కి అందలేదు. కొంతకాలం గడిచింది. పెళ్ళికూతురు తండ్రి ఎన్నాళ్ళయినా ఎవరూ రాకపోయేసరికి బయల్దేరి అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. అతను ఇల్లు చేరలేదని తెలిసింది. ప్రమాదానికి లోనయి చనిపోయి ఉంటాడని అందరూ నిర్ణయించుకున్నారు. అమ్మాయి తండ్రి మీ ఆయన వరకట్నం కూడా ఇచ్చి మా సంబంధం స్థిరపరిచాడు అని చెప్పాడు. అబ్బాయి తల్లి సరేనని సంబంధం స్థిరపరిచింది. వైభవంగా పెళ్ళయింది. అమ్మాయి అత్తగారింటికి వచ్చింది. అణకకువగా పనులు చేసుకుంటూ అత్తగారి మెప్పు పొందింది. భర్తకు సేవలు చేసి భర్త దగ్గర కూడా మంచి పేరు సంపాదించింది.

ఒకరోజు పడుకుని ఉంటే అమ్మాయికి మెలకువ వచ్చింది. భర్తను కదిలించి లేపుదామని ప్రయత్నించింది. లేవలేదు. గాఢంగా నిద్రపోతున్నాడేమో అనుకుంది.

మరుసటిరోజు ఏదో కదలిక ఐతే కళ్ళు తెరిచి చూసింది. భర్త పడక మీద నించీ లేచి మెల్లగా దిగాడు. ఇటూ అటూ చూశాడు. భార్య తనని గమనిస్తుందా? లేదా? అని చూశాడు. ఆమె మెలకువ లేనట్లు నటించింది.

అతను మెల్లగా పడకనించీ దిగి అల్మారా దగ్గరకు వెళ్ళాడు. చప్పుడు కాకుండా అల్మారా తలుపు తీశాడు. అందులో ఒక గ్లాసు ఉంది. ఆ గ్లాసులో ఒక కర్ర ఉంది. అది జానెడు పొడవు ఉంది. గుండుగా, నున్నగా చెక్కినట్లు ఉంది.

అతను ఆ కర్రను తీసుకుని ఏవో మంత్రాలు చదివాడు. తనని ఆ కర్రతో తాకాడు. అది అతని శరీరాన్ని తాకిన మరుక్షణం రాక్షసుడిగా మారిపోయాడు. ఆ అమ్మాయి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. అరిచేదే కానీ నిగ్రహించుకుంది. తొందరపడడమెందుకని చెమటలు తుడుచుకుంటూ మౌనంగా ఉండిపోయింది.

రాక్షసుడుగా మారిన ఆమె భర్త మెల్లగా తలుపులు తెరుచుని బయటికి వెళ్ళి చీకట్లో కలిసిపోయాడు.

ఏం చెయ్యాలో తోచక ఆ అమ్మాయి స్థాణువులా నిలబడిపోయింది. నిద్రలేదు. ఏం జరుగుతుందో చూద్దామని మేలుకునే ఉంది.

బయటకి రాక్షసాకారంలో వెళ్ళి ఆమె భర్త తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఎప్పట్లా అల్మారా తెరిచి అందులో ఉన్న కర్రబద్దను తన శరీరానికి తాకించాడు. వెంటనే మామూలు మనిషిగా మారిపోయాడు. ఇదంతా ఆమె గమనిస్తూనే ఉంది. ఏమీ తెలియనట్లు ఏమీ జరగనట్లు ఉండిపోయింది.

తెల్లవారి నిద్రలేచాకా తన పనిలో మునిగిపోయింది. భర్త ఏదో పనుల మీద బయటకి వెళ్ళాడు. వెంటనే ఆ అమ్మాయి అల్మారా దగ్గరకు వెళ్ళి ఆ కర్ర తెచ్చి వంటపొయ్యిలో వేసి కాల్చేసింది. ఏమీ ఎరగనట్లు ఉండిపోయింది.

రాత్రి పడుకున్న తరువాత ఎప్పట్లా భర్త లేచి అల్మారా దగ్గరకు వెళ్ళి వెతకడం మొదలు పెట్టాడు. గ్లాసు ఉంది కాని కర్రలేదు.

మేలుకునే ఉన్న భార్య ‘ఏమిటి? ఏం వెతుకుతున్నారు?’ అంది.

‘ఏం లేదు’ అని బుకాయించబోయాడు.

‘కర్రకోసంకదా! దాన్ని కాల్చేశాను’ అంది.

మొదట హతాశుడయినా తరువాత తన భార్య మంచిపనే చేసిందని సంతోషించాడు. ఎట్లాంటి ఆటంకం లేకుండా వాళ్లు జీవితాంతం ఆనందంగా గడిపారు.

– సౌభాగ్య