Telugu Global
Others

ముఖాన మొటిమ...లోప‌లి అనారోగ్యానికి సంకేత‌మా?

మంచి పౌష్టికాహారం తింటున్నా, స‌రిప‌డా మంచినీళ్లు తాగుతున్నా, కంటినిండా నిద్ర‌పోతున్నా, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నా మొటిమ‌లు వ‌స్తూనే ఉన్నాయ‌ని బాధ‌ప‌డుతుంటారు చాలామంది. అలాంటి వారు తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి. మ‌న చ‌ర్మ ఆరోగ్యం మ‌న శ‌రీరం లోప‌లి ఆరోగ్యాన్ని ప్ర‌తిబింబిస్తుంది. అందుకే చ‌ర్మం క‌ళా విహీనంగా మార‌డం, మొటిమ‌లు, దద్దుర్లు, మ‌చ్చ‌లు రావ‌డం…ఇలాంటివి జ‌రిగిన‌పుడు, మ‌న శ‌రీరం లోప‌లి ఆరోగ్యం స‌క్ర‌మంగా ఉందా లేదా అనే సందేహాన్ని తీర్చుకోవ‌డ‌మూ అవ‌స‌ర‌మే అంటున్నారు నిపుణులు. ఇంత‌కీ ముఖంలోని ఏ భాగాన్ని ఏ అవ‌య‌వానికి సంకేతంగా తీసుకోవాలి…ఆ వివ‌రాలు- […]

ముఖాన మొటిమ...లోప‌లి అనారోగ్యానికి సంకేత‌మా?
X

మంచి పౌష్టికాహారం తింటున్నా, స‌రిప‌డా మంచినీళ్లు తాగుతున్నా, కంటినిండా నిద్ర‌పోతున్నా, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నా మొటిమ‌లు వ‌స్తూనే ఉన్నాయ‌ని బాధ‌ప‌డుతుంటారు చాలామంది. అలాంటి వారు తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి. మ‌న చ‌ర్మ ఆరోగ్యం మ‌న శ‌రీరం లోప‌లి ఆరోగ్యాన్ని ప్ర‌తిబింబిస్తుంది. అందుకే చ‌ర్మం క‌ళా విహీనంగా మార‌డం, మొటిమ‌లు, దద్దుర్లు, మ‌చ్చ‌లు రావ‌డం…ఇలాంటివి జ‌రిగిన‌పుడు, మ‌న శ‌రీరం లోప‌లి ఆరోగ్యం స‌క్ర‌మంగా ఉందా లేదా అనే సందేహాన్ని తీర్చుకోవ‌డ‌మూ అవ‌స‌ర‌మే అంటున్నారు నిపుణులు. ఇంత‌కీ ముఖంలోని ఏ భాగాన్ని ఏ అవ‌య‌వానికి సంకేతంగా తీసుకోవాలి…ఆ వివ‌రాలు-
నుదుటిమీద మొటిమ‌లుంటే…
మంచినీళ్లు అధికంగా తాగ‌కపోవ‌డం వ‌ల‌న‌ జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌క పోవ‌డం, శ‌రీరంలో విష‌ప‌దార్థాలు ఎక్కువ‌గా విడుద‌ల కావ‌డం జ‌రుగుతుంది. నుదుటిమీద మొటిమ‌ల‌కు ఇవి కార‌ణ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిస్థితి ఎదురైతే నీళ్లు ఎక్కువ తాగ‌డం, కాఫీ మానేసి గ్రీన్, హెర్బ‌ల్ టీలు తాగ‌డం మంచిది.

టీ జోన్లో…
నుదురు, ముక్కు, చుబుకం ఈ ప్రాంతాల్లో ఇంగ్లీషు టీ ఆకారంలో మొటిమలు వ‌స్తుంటే లివ‌ర్ ప‌నితీరు స‌రిగ్గా లేద‌నే సంకేతంగా భావించ‌వ‌చ్చు. కొవ్వు, నూనెలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవ‌డ‌మూ కార‌ణం కావ‌చ్చు. ఇలాంట‌పుడు ముందుగా ఆహారంలోమార్పులు చేసుకోవాలి. ఆరోగ్య‌క‌ర‌మైన పోష‌కాహారం తీసుకోవాలి. అలాగేఆల్క‌హాల్ తాగ‌డం వ‌ల‌న కూడా ఈ ప్రాంతంలో మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి.

క‌ళ్ల‌కింద‌…
క‌ళ్ల‌కింద ఉబ్బ‌డం, చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌టం, న‌లుపు, ర్యాష్ ఇవ‌న్నీ కిడ్నీ ప‌నితీరుని వెల్ల‌డిస్తాయి. ఇలా ఉన్న‌పుడు స‌రిప‌డా మంచినీరు తాగ‌డం లేద‌ని అర్థం చేసుకోవాలి.

చెంప‌ల‌పై…
ఈ ప్రాంతం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, పొగ తాగ‌డం, పీల్చ‌డం వంటివి ఇందుకు కార‌ణాలు కావ‌చ్చు. అలాగే మీ స్మార్ట్ ఫోన్ నుండి, దిండు క‌వ‌ర్ల‌నుండి బ్యాక్టీరియా ఎటాక్ చేసినా చెంప‌ల‌పై మొటిమ‌లు, ర్యాష్ వ‌స్తాయి. రోజుకి ఒక్క‌సారైనా ఫోన్‌ని యాంటీ బ్యాక్టీరియా వైప్స్ తో తుడుస్తుండాలి.

నోటి చుట్టుప‌క్క‌ల‌….
చెంప‌ల‌కు దిగువ‌న నోటికి చుట్టుప‌క్క‌ల మొటిమ‌లు వ‌స్తుంటే నోరు శుభ్రంగా లేద‌ని భావించాలి. ప‌ళ్లు, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బ‌తిన‌కుండా చూసుకోవాలి.

చెవుల చుట్టూ…
ఈ ప్ర‌దేశంలో మొటిమ‌లు కిడ్నీ స‌మ‌స్య‌కు సంకేతం కావ‌చ్చు. ఉప్పు వాడ‌కం ఎక్కువ కావ‌డ‌మూ కార‌ణం కావ‌చ్చు. అలాగే కొన్నిసార్లు హెయిర్ ఆయిల్స్, జుట్టుకి వాడిన కండిష‌న‌ర్ల‌ని స‌రిగ్గా శుభ్రం చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న కూడా మొటిమ‌లు వ‌స్తాయి.

చుబుకం మీద‌…
నోటికింద, గ‌డ్డం భాగం మ‌న శ‌రీరంలో చిన్న‌పేగుల‌కు ప్ర‌తినిధిగా చెప్ప‌వ‌చ్చు. ఆహారంలో మార్పులు ఉంటే ఆ ప్ర‌భావం వెంట‌నే ఇక్క‌డ క‌న‌బ‌డుతుంది. అలాగే హార్మోన్ల హెచ్చుత‌గ్గ‌లున్నా ఈ ప్రాంతంలో మొటిమ‌లు వ‌స్తాయి. గ‌డ్డం కింద చేతులు పెట్టుకుని కూర్చోవ‌డం లాంటివి స‌హ‌జంగా చేస్తాం క‌నుక, వేళ్ల‌ద్వారా నూనెలు, బ్యాక్టీరియా లాంటివి ఈ భాగానికి చేరే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా కూడా మొటిమ‌లు వ‌స్తాయి. ఒక‌టో రెండో మొటిమ‌లు వ‌స్తే అది లోప‌లి అనారోగ్యంగా భావించాల్సిన అవ‌స‌రం లేదు కానీ ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకున్నా త‌గ్గ‌కుండా, నిరంత‌రం మొహంమీద మొటిమ‌లు వ‌స్తుంటే మాత్రం, అది లోప‌ల అనారోగ్యం కాద‌ని వైద్యుని ద్వారా నిర్దారించుకోవ‌డం మంచిది.

First Published:  9 Sep 2015 4:55 AM GMT
Next Story