Telugu Global
Family

లక్ష్మణ్‌ " అడవి దున్నలు (For Children)

లక్ష్మణ్‌ అతని తల్లి ఒక గ్రామంలో నివసించేవాళ్ళు. తండ్రి లేడు. అతనికి కొద్దిగా భూమి ఉంది కానీ ఎద్దులు లేవు. వర్షాలు పడినపుడు ఇరుగు పొరుగును అడిగి ఎద్దుల్ని అరువు తీసుకుని పొలం దున్నేవాడు. కష్టపడి పంట పండించేవాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ పంట చేతికొచ్చే సమయానికి అతనికి సమస్యలు మొదలయ్యేవి. రేపో ఎల్లుండో పంట కోద్దామనుకునేంతలో అడవిలో నించి నల్లగా బలిసిన అడవిదున్నలు గుంపుగా వచ్చి పంటను ధ్వంసం చేసి వెళ్ళిపోయేవి. అన్నాళ్ళ శ్రమ […]

లక్ష్మణ్‌ అతని తల్లి ఒక గ్రామంలో నివసించేవాళ్ళు. తండ్రి లేడు. అతనికి కొద్దిగా భూమి ఉంది కానీ ఎద్దులు లేవు. వర్షాలు పడినపుడు ఇరుగు పొరుగును అడిగి ఎద్దుల్ని అరువు తీసుకుని పొలం దున్నేవాడు. కష్టపడి పంట పండించేవాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ పంట చేతికొచ్చే సమయానికి అతనికి సమస్యలు మొదలయ్యేవి.

రేపో ఎల్లుండో పంట కోద్దామనుకునేంతలో అడవిలో నించి నల్లగా బలిసిన అడవిదున్నలు గుంపుగా వచ్చి పంటను ధ్వంసం చేసి వెళ్ళిపోయేవి. అన్నాళ్ళ శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యేది. అతని దగ్గరున్న బాణాలతో ఆ దున్నల్ని చంపడం వీలయ్యే పనికాదు. ఇది పెద్ద సమస్యగా మారింది. ఎట్లాగయినా దున్నల్ని చంపాలని పట్టుదల పెరిగింది.

వాళ్ళ గ్రామంలోని కమ్మరి దగ్గరకు వెళ్ళి బలమైన పన్నెండు ఇనుప బాణాలు తయారుచేయించాడు. అడవిలోకి వెళ్ళి దున్నల్ని వేటాడాలని నిర్ణయించాడు. అతని నిర్ణయం తల్లికి నచ్చలేదు. ప్రమాదాల్లోకి తలదూర్చడం ఎందుకని ఆమె ఆరాటం.

కానీ లక్ష్మణ్‌ ఎట్లాగయినా దున్నల్ని హతమార్చాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. తల్లి ఆశీర్వాదం అందుకుని ఒకరోజు అడవికి బయల్దేరాడు. అడవి మధ్యలోకి వెళితే దున్నలు కనిపిస్తాయని విన్నాడు. అడవి లోపలకు వెళుతూ ఉంటే ఒక చిన్న గుడిసె కనిపించింది. ఆ గుడిసెలో మడతలు పడిన చర్మంలో ఒక ముసలావిడ కనిపించింది. ఆవిడను చూస్తూనే ఆమె మంత్రగత్తె అని లక్ష్మణ్‌ తెలుసుకున్నాడు.

అయినా ధైర్యంతో లోపలికి వెళ్ళి తనపేరు చెప్పి తన పరిస్థితి వివరించి ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటానని తన దగ్గర రొట్టెలు ఉన్నాయని ఆ రొట్టెల్ని ఆమెతో పంచుకున్నాడు.

ఆమె మంత్రగత్తె ఐనా నిష్కపటంగా నిజాయితీగా తన గురించి దాచుకోకుండా చెప్పిన లక్ష్మణ్‌ని ఆమె ఇష్టపడి ‘నాయనా! తప్పక విశ్రాంతి తీసుకో. నీకు వీలయినంత సాయం చేస్తాను. నీకు ఎలాంటి అపకారం చెయ్యను’ అని హామీ ఇచ్చింది.

ఆమె లోపలికి వెళ్ళాకా దున్నలు కనిపిస్తాయని కానీ వాటిని సూటిగా ఎదుర్కోవడం కష్టమని, అవి భయంకరమైనవని ఏదైనా చెట్టుమీది నించీ వాటిపై బాణాల్ని వదలడం మేలని చెప్పింది.

రాత్రిపూట దున్నలు విశ్రాంతి తీసుకునే స్థలాన్ని కనిపెట్టి దగ్గరున్న చెట్టును ఎక్కాడు. అక్కడికి చీకటిపడేసరికి వందల దున్నలు వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. వాటిని చంపడమెట్లా? వాటి బారినించీ తప్పించుకుని బయటపడడమెట్లా అని ఆలోచనలో పడ్డాడు

రాత్రి గడిచిపోయింది. అడవి దున్నలు తెల్లవారిని వెంటనే లేచి తమదారంటే తాము వెళ్ళిపోయాయి. కిందికి దిగి అడవిపళ్ళు కాయలు ఏరుకుని తిని మళ్ళీ చీకటిపడ్డాకా చెట్టెక్కాడు.

అవి అక్కడికి రాకముందు లక్ష్మణ్‌ ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఊడ్చి మెరిసేలాచేసేవాడు. రెండో రోజు వాటికి సందేహం కలిగింది. ఎవరీ పనిచేస్తున్నారా? అనుకున్నాయి. మరుసటి రోజు పొద్దున్నే అన్నీ వెళ్ళిపోతూ ఒక ముసలి దున్న ఆరోగ్యం బాగాలేక అక్కడే ఆగిపోయింది. అవి ఇక్కడ ఎవరు శుభ్రం చేస్తున్నారో కాస్త కనిపెట్టు అని దాంతో చెప్పి వెళ్ళాయి. లక్ష్మణ్‌ ధైర్యంగా కిందకు దిగి పరిసరాల్ని పరిశుభ్రం చేసి పళ్ళు కాయలు ఏరుకుని చెట్టెక్కాడు. సాయంత్రానికి అన్నీ తిరిగి వస్తూనే ముసలి దున్న ఒక మనిషి చెట్టునించీ దిగి ఇవన్నీ చేస్తున్నాడని చెప్పింది. దున్నలు ‘భయపడకు. నీకు అపకారం చెయ్యం. నువ్వు పళ్ళు తిని పాలు కావాలనుకున్నప్పుడు పిలిచావంటే నీకు గేదెపాలు ఇస్తాము’ అని భరోసా ఇచ్చాయి. ‘నువ్వుపిల్లనగ్రోవి ఊదితే చాలు గేదెలు వచ్చి పాలిస్తాయి’ అని చెప్పాయి.

అట్లా లక్ష్మణ్‌కు వాటితో అనుబంధం పెరిగింది. అతనికి కావలసినన్ని పాలు దొరికేవి. ఎంతగా అంటే అతను పాలతో స్నానం చేసేవాడు. దానివల్ల అతని వెంట్రుకలు మెరిసేవి. చాలా పొడవుగా పెరిగి చూడ్డానికి అద్భుతంగా ఉండేవి.

ఒకరోజు స్థానిక రాజుకు సంబంధించిన ఒక చిలుక లక్ష్మణ్‌ జుత్తు ఎండలో మెరవడం చూసింది. అందగాడు పొడవైన కురులున్నవాడు మీ అమ్మాయికి తగిన వరుణ్ణి చూశానని రాజుతో అంది. కానీ అతను గహనాటవిలో, అరణ్యం మధ్యలో అడవి దున్నలతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి ఎవరూ అతని దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. రాజుకు ఏం చెయ్యాలో తోచక రామచిలుకతో ఎట్లాగయినా నువ్వే ఆ అందగాడి దగ్గరకు వెళ్ళి అతన్ని ఒప్పించి తీసుకొచ్చావంటే మా అమ్మాయినిచ్చి అతనికి పెళ్ళి చేస్తాను’ అన్నాడు.

ఆరోజు చీకటిపడింది. చీకటి పడేలోగా రామచిలుక ఒక కాకిని సాయం తీసుకుని అడవిలోకి వచ్చి లక్ష్మణ్‌ కూచున్న చెట్టుకొమ్మపై వాలింది. కాకికి విషయం వివరించింది. లక్ష్మణ్‌ పిల్లనగ్రోవి ఊదడం, గేదెలు పాలివ్వడం, అతను పాలుతాగి పడుకోవడం గమనించింది.

తెల్లవారింది. దున్నలు అడవిలోకి వెళ్ళిపోయాయి. లక్ష్మణ్‌ మగత నిద్రలో ఉన్నాడు. కాకి అతని ముందు వాలి పక్కనే ఉన్న అతని పిల్లనగ్రోవిని ముక్కున కరచుకుని ఎగిరి అతనికి కనిపించేలా ఒక కొమ్మమీద వాలింది. అలికిడికి లేచిన లక్ష్మణ్‌ కళ్ళు తెరిస్తే ఎదురుగా తన పిల్లనగ్రోవి ముక్కున కరుచుకున్న కాకిని చూశాడు.

దాంతో ఆందోళన చెంది కాకిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాకి అందినట్లే అంది గాల్లోకి లేచింది. వెంటపడ్డాడు. అది వెళ్ళి వెళ్ళి రాజుగారి భవనంలో అడుగుపెట్టింది. దాంతో బాటే ద్వారం దాటి లక్ష్మణ్‌ లోపల అడుగు పెట్టగానే తలపులు మూసేశారు. రాజు అందగాడయిన లక్ష్మణ్‌కు తనకూతుర్నిచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించాడు.

లక్ష్మణ్‌ కొన్నాళ్ళు భార్యతో ఆనందంగా గడిపాడు కానీ అతని మనసంతా అడవిదున్నలమీదనే ఉంది. దానికి తోడు రాణి తమ్ముళ్ళు ‘ఇతడు పేదవాడులాగున్నాడు. తినడం, పడుకోవడం తప్ప ఏమీ చేసేట్లు లేడు. అందరూ వాళ్ళ భార్యల్తో తమ ఇంటికి వెళతారు కానీ అత్తగారింట్లో ఎవరయినా తిష్టవేస్తారా?’ అని ఎత్తిపొడిచారు.

ఆ మాటలు విని లక్ష్మణ్‌ బావమరుదులకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన పిల్లనగ్రోవిని తీసుకుని మోగించాడు. నిముషాలలో వందల వేలు అడవిదున్నలు వచ్చి నగరమంతా నిండిపోయాయి. బావమరుదులు భయంతో నగరం వదిలి పారిపోయారు. రాజు తన రాజ్యానికి లక్ష్మణ్‌ని రాజును చేశాడు.

లక్ష్మణ్‌ తన తల్లిని మరచిపోలేదు. తన భార్యతో కలిసి తన గ్రామం వెళ్ళి తన తల్లిని తమతో బాటు నగరానికి తీసుకొచ్చాడు. అందరూ కలిసి ఆనందంగా జీవించారు.

– సౌభాగ్య

First Published:  8 Sep 2015 1:02 PM GMT
Next Story