Telugu Global
Family

రాజు-పాము (For Children)

ఒకరోజు సంతాల్‌ రాజు అత్తగారింటికి వెళ్ళి తన భార్యను తీసుకురావడానికి బయల్దేరాడు. కొంతదూరం వెళ్లేసరికి ఒక నీటిగుంటలో రాళ్లమధ్య చిక్కుకుని ఒక పాము ప్రాణభయంతో అల్లాడుతూ ఉండడం చూశాడు. ఆ పాము రాజును చూసి ‘నేను ఈ రాళ్ళ మధ్య చిక్కుకున్నాను. దయచేసి నన్ను కాపాడండి’ అని ప్రార్థించింది. రాజు ‘నువ్వు విషపు జంతువువి. నిన్ను కాపాడినా నీకు కృతజ్ఞత ఉండదు. నువ్వు తిరిగి నన్ను కాటేస్తావు’ అన్నాడు. పాము’అయ్యా! అట్లా అనకు. ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళని రక్షిచండమన్నది […]

ఒకరోజు సంతాల్‌ రాజు అత్తగారింటికి వెళ్ళి తన భార్యను తీసుకురావడానికి బయల్దేరాడు. కొంతదూరం వెళ్లేసరికి ఒక నీటిగుంటలో రాళ్లమధ్య చిక్కుకుని ఒక పాము ప్రాణభయంతో అల్లాడుతూ ఉండడం చూశాడు. ఆ పాము రాజును చూసి ‘నేను ఈ రాళ్ళ మధ్య చిక్కుకున్నాను. దయచేసి నన్ను కాపాడండి’ అని ప్రార్థించింది.

రాజు ‘నువ్వు విషపు జంతువువి. నిన్ను కాపాడినా నీకు కృతజ్ఞత ఉండదు. నువ్వు తిరిగి నన్ను కాటేస్తావు’ అన్నాడు.

పాము’అయ్యా! అట్లా అనకు. ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళని రక్షిచండమన్నది అన్ని ధర్మాలలో కెల్లా ఉత్తమం. నేను మీరు అనుకున్నట్లు చేసే క్రూరత్వం ఉన్నదాన్ని కాను. మీపట్ల కృతజ్ఞతతో ఉంటాను’ అంది.

రాజు ఒక కర్ర సాయంతో పామును రాళ్ళ సందునించీ బయటపడేశాడు. వెంటనే పాము బుసకొడుతూ రాజును కాటేయడానికి ఎగబడింది. రాజు ఇది అన్యాయం కదా! అన్నాడు.

పాము ‘నువ్వు బుద్ధిహీనుడివి. నేను అపకారం తలపెడతానని తెలిసి కూడా నాకు ప్రాణదానం చేశావు. ఈ ప్రపంచంలో తెలివితక్కువ వాళ్ళకు స్థానం లేదు. నిన్ను కాటేస్తాను’ అంది.

రాజు ఆలోచించీ ‘సరే! దీనికి సంబంధించి నిజానిజాలు ఎవరి ద్వారానయినా నిర్థారణ చేసుకుందాం. మనిద్దరిలో ఎవరిది తప్పో తేల్చుకుందా’ అన్నాడు. పాము ‘సరే’నంది.

ఇద్దరూ కలిసి ఒక మర్రిచెట్టు దగ్గరకి వచ్చారు. మర్రిచెట్టును చూసి రాజు ‘నేను ఈపాముని ప్రమాదంలో ఉంటే రక్షించాను. కానీ ఈపాము కృతజ్ఞత లేకుండా నన్ను కాటువేసి చంపుతానని అంటోంది. ఇది న్యాయమా? నువ్వే చెప్పాలి’ అన్నాడు.

మర్రిచెట్టు ‘పాము నిన్ను కాటేయ్యడంలో ఎట్లాంటి పొరపాటు చెయ్యడం లేదు. ఎందుకంటే మనిషి అన్నిటికంటే క్రూరుడు. మేము అలసి వచ్చిన మనుషులకు నీడనిస్తాం. విశ్రాంతి తీసుకోమంటాం. కానీ మనుషులకు కృతజ్ఞత అన్న లక్షణం ఉండదు. నిర్దయగా మా కొమ్మల్ని నరికేస్తారు. కాండాల్ని ఖండిస్తారు. అట్లాంటి మనుషుల పట్ల కృతజ్ఞత ప్రకటించడం మూర్ఖత్వం. పాము చేస్తున్న పని సరయిందే. అది నిన్ను కాటువెయ్యడం సరయిందే అంది.

ఆ మాటల్తో రాజు ఆశ్చర్యపడ్డాడు. తనకు అనుకూలంగా మర్రిచెట్టు మాట్లాడుతుందనుకున్నాడు. కానీ ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతుందని అనుకోలేదు. పాము కాటు వెయ్యడానికి ముందుకొచ్చింది.

‘ఆగు, ఆగు!’ ఇంకొకర్ని అడుగుదామన్నాడు రాజు.

కొద్దిదూరం వెళ్ళాడు. ఒక ఆవు ఎదురుగా వచ్చింది. రాజు తన పరిస్థితి వివరించి ఎవరిది తప్పో చెప్పమన్నాడు.

ఆవు ‘పాము ఎందుకు నిన్ను కాటు వెయ్యకూడదో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని చూడు. మనుషులకు మేము పాలు ఇస్తాం. కానీ మమ్మల్ని మనుషులు కొడతారు. హింసిస్తారు. చంపుతారు. తింటారు. ఇట్లాంటి మనుషుల్ని చంపడం సరయిన పనే అంది.

ఇక్కడ కూడా రాజుకు వ్యతిరేకతే ఎదురయింది. ఆవుకూడా వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది. రాజుకు దిక్కుతోచలేదు. తనకు చావు తప్పదనిపించింది. కాటువెయ్యడానికి పాము సిద్ధపడింది.

చివరిగా ఇంకొక సాక్ష్యాన్ని విచారిద్దామన్నాడు. అతని అభిప్రాయాన్ని కాదనలేకపోయింది పాము.

చివరగా ఇద్దరూ ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు.

రాజు చెరువుతో జరిగిన విషయం చెప్పాడు. చెరువు ‘మనుషులు మంచికి బదులుగా చెడ్డ చేస్తారు. వాళ్ళని ఉట్టినే వదిలిపెట్టకూడదు. నన్ను చూడండి నేను వాళ్ళకి తాగడానికి నీళ్ళిస్తాను. వాళ్ళ పంటలు పండడానికి పొలాల్లో ప్రవహిస్తాను. ఇన్ని చేసినా నన్ను మురికి చేస్తారు. నిర్లక్ష్యం చేస్తారు. ఉమ్మేస్తారు. మీ మనుషులకు తగిన శిక్షనే ఈ పాము విధిస్తుంది’ అంది. తనకు మరణం తప్పదని రాజు నిర్ణయించుకున్నాడు.

చివరిగా తన భార్యను కలిసి వస్తాను, తరువాత నన్ను కాటేయమని పాముతో అన్నాడు. పాము సరేనంది. రాజు అత్తవారింటికి వెళ్ళి జరిగిన విషయం తన భార్యతో చెప్పాడు. ఆమె నేను కూడా వస్తానని అంది. ఇద్దరూ పాము దగ్గరికి వచ్చారు. రాజుభార్య మొదట నన్ను కాటువేయి. ఆయన చనిపోతే నేను కూడా బతకను అంది. పాముకు ఏం చెయ్యాలో తోచలేదు. రాజు భార్య పట్టువదలలేదు. పాము నీకో మంత్రం చెబుతాను. దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆ మంత్రం నేర్చుకొని వెళ్ళు అంది. ఒక మంత్రం చెప్పింది. రాజు భార్య నేర్చుకుంది. ఆ మంత్రం ఉచ్ఛరిస్తూ కొంత దుమ్ము తీసుకుని దేనిమీదయినా వేస్తే అది భస్మం అవుతుంది. రాజు భార్య నేను ఈమంత్రాన్ని పరీక్షించవచ్చా? అంది. పరీక్షించవచ్చని అంది పాము.

రాజు భార్య కొంత దుమ్ము తీసుకుని మంత్రించి ఎదురుగా ఉన్న ఒక చెట్టుమీద వేసింది. క్షణంలో ఆ చెట్టు బూడిదగా మారిపోయింది.

ఈ మధ్యలో పాము రాజును కాటువేయడానికి రాజుపైకి బుసకొట్టుకుంటూ వెళ్ళింది. వెంటనే అప్రమత్తమయిన రాజు భార్య కొంత దుమ్ము తీసుకుని మంత్రించి పాముపై వేసింది. క్షణంలో పాము భస్మమై పోయింది. బూడిదగా మిగిలింది.

రాజు భార్యతో కలిసి సంతోషంగా తన నగరం చేరాడు.

– సౌభాగ్య

First Published:  9 Sep 2015 1:02 PM GMT
Next Story