ఎప్పుడూ మాది తొలి బుల్లెట్‌ కానివ్వం: రాజ్‌నాథ్‌

భారత్‌ ఎప్పుడూ తొలి బుల్లెట్‌ ప్రయోగించదని, పొరుగు దేశాలతో శాంతినే తాము కోరుకుంటున్నామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం పాకిస్థాన్‌ రేంజర్లతో సమావేశమైన ఆయన తాము శాంతికాముక దేశంగానే ఉండాలనుకుంటున్నామని, సరిహద్దుల్లో శాంతి పరిఢవిల్లాలని కోరుకుంటున్నామని అన్నారు. పాకిస్థాన్‌ రేంజర్లకు డైరెక్టర్ జనరల్‌ మేజర్‌ ఉమర్‌ ఫరూఖ్‌ బుర్కి నేతృత్వం వహించారు. మంచి సంబంధాల వల్లనే శాంతి స్థాపన జరుగుతుందని, ఉగ్రవాదులను తుద ముట్టించడంలో తమతో సహకరించాలని ఆయన పాక్‌ అధికారులను కోరారు. కలిసికట్టుగా పోరాడినప్పుడే శత్రువు బలహీనమవుతాడని అన్నారు. పాకిస్థాన్ రేంజర్ల డిజి ఉమర్‌ మాట్లాడుతూ తాను కూడా శాంతినే కోరుతున్నామని, మంత్రి మాటలు తమకెంతో సంతోషాన్నిచ్చాయని అన్నారు. అయితే తాను అధికారినే కాబట్టి మంత్రి మాదిరిగా ఎటువంటి హామీ ఇవ్వలేనని, ఈ సమావేశ సారాంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.