ఆ ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం…పురుషాధిప‌త్య భావ‌జాల‌మా!!!!!

దేశ‌వ్యాప్తంగా అత్యంత దారుణంగా ప్రాణాలు తీసుకుంటున్న రైతుల సంఖ్య పెరిగిపోతున్న నేప‌థ్యంలో దీనిపై సామాజిక శాస్త్ర‌వేత్త‌లు, కార్య‌క‌ర్త‌లు, నిపుణులు విస్తృతంగా అధ్య‌య‌నాలు చేస్తున్నారు. వాన‌లు లేక‌పోవ‌డం, పంట‌లు పండ‌క‌పోవ‌డం, అప్పుల బాధలు…ఇవి మాత్ర‌మే రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణమా లేక వీటి వెనుక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా అనే కోణంలో వీరి ప‌రిశీల‌న సాగుతోంది.

ఈ ఏడాది మొద‌ట్లో పార్ల‌మెంటుకి స‌మీపంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడిన గ‌జేంద్ర సింగ్ విష‌యాన్ని లోతుగా ప‌రిశీలించిన అధ్య‌య‌న‌కారులు, ఆ ఆత్మ‌హ‌త్య‌లో ఉన్న భిన్న కోణాల‌ను వెల్ల‌డిస్తున్నారు.  గ‌జేంద్ర సింగ్ పురుషాధిప‌త్య స‌మాజంలో మ‌గ‌వాళ్లు ఎదుర్కొనే ఒత్తిడిని మాన‌సిక హింస‌ని త‌ట్టుకోలేకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని వారు చెబుతున్నారు.  మ‌గ‌వారికి ఆధిప‌త్యాన్ని క‌ట్ట‌బెట్టి ఇంటి భారం, ప‌రువు ప్ర‌తిష్ట‌లు లాంటివ‌న్నీ మోయ‌మంటుంది పితృస్వామ్య భావ‌జాలం. వారు కుటుంబాన్ని న‌డ‌ప‌డంలో విఫ‌ల‌మైతే అది వారి అభిజాత్యాన్ని బాగా దెబ్బ‌తీస్తుంది. త‌మ మ‌గ‌పుట్టుక‌కు అవ‌మాన‌మ‌ని కూడా భావిస్తుంటారు. ఒక వ‌ర‌క‌ట్న బాధితురాలి కంటే, ఒక గృహ హింస బాధితురాలి కంటే ఇలాంటి మ‌గ‌వారు అనుభ‌వించే ఈ ఆధిప‌త్య భావ‌జాలం తాలూకూ హింస మ‌రింత ఎక్కువ‌ని ఈ అధ్య‌య‌న వేత్త‌లు చెబుతున్నారు. గజేంద్ర‌సింగ్ ఆత్మ‌హ‌త్య వెనుక ఉన్న కార‌ణాలు ఇవేన‌ని వారంటున్నారు.

 స్త్రీని అణ‌చివేసే స‌మాజంలో అంత‌కంటే ఎక్కువ ఒత్తిడి పురుషుని మీద ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. గ‌జేంద్ర సింగ్‌కి భార్య ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. వ్య‌వ‌సాయం విష‌యంలో సింగ్ న‌ష్టాలు తెచ్చాడ‌నే కార‌ణంతో తండ్రి అత‌డ్ని ఇంట్లోంచి గెంటేశాడు. ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు, మ‌రొక వైపు న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోలేక‌పోవ‌డం, అవమానం ఇవ‌న్నీ క‌లిసి అత‌డిని ఆత్మ‌హ‌త్య‌కు పురికొల్పాయ‌ని ఈ అధ్య‌య‌న వేత్త‌లు చెబుతున్నారు. సామాజిక శాస్త్ర‌వేత్త ఆర్ ఎస్ దేశ్‌పాండే …ఈ మ‌ధ్య‌కాలంలో మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, పంజాబ్‌, తెలుగు రాష్ట్రాల్లో సంభ‌వించిన 142 ఆత్మ‌హ‌త్య‌ల వెనుక ఉన్న కార‌ణాల్లో ఇది కూడా ప్ర‌ధాన అంశ‌మే అంటున్నారు. అప్పులు ఇచ్చిన‌వాళ్ల నుండి, బ్యాంకుల నుండి ఎదురైన అవ‌మానాల‌ను ఒక మ‌గ‌వాడిగా నేను భ‌రించ‌లేను… అనే ఆలోచ‌నే రైతుల‌ను ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేస్తున్న‌ద‌ని పాండే అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌గ‌వాడు అధికుడు…అవమానాలను భ‌రించ‌లేడు…అనే వంద‌ల ఏళ్ల‌నాటి  భావ‌జాలం  వారిలో అప‌జయాల‌ను త‌ట్టుకునే శ‌క్తిని హ‌రించి వేస్తోంద‌ని ఈ సామాజిక శాస్త్ర నిపుణుడు చెబుతున్నారు. క‌వితాబాల్ అనే ఫిల్మ్ మేక‌ర్ విద‌ర్భ‌లో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప‌త్తిరైతుల క‌థ‌ల‌పై ఒక చిత్రాన్ని, ఆత్మ‌హ‌త్య‌ల పాలైన రైతుల భార్యలపై మ‌రొక సినిమాని తీశారు. ఇవి రెండూ 61వ జాతీయ సినీ అవార్డుల కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక గుర్తింపుని పొందాయి. స‌మాజం లింగ వివ‌క్ష‌, లింగ‌భేదం లాంటివాటిని ఎంత ఎక్కువ‌గా పాటిస్తుంటే అంత ఎక్కువ‌గా స్త్రీ పురుషుల మీద ఒత్తిడి పెరుగుతుంద‌ని క‌విత చెబుతున్నారు.

మ‌గ‌వాడు మాత్ర‌మే ఇంటిని పోషించాలి అనే దృక్ప‌థం ఉన్నపుడు అందులో విఫ‌లం అయిన సంద‌ర్భాల్లో మ‌గ‌వాళ్లు అవ‌మానం, డిప్రెష‌న్ లాంటి భావాల‌కు గుర‌వుతార‌ని ఆమె అంటున్నారు. ముఖ్యంగా వ్య‌వ‌సాయంలో స్త్రీ పురుషుల పాత్ర గురించి ప్ర‌స్తావిస్తూ, వ్య‌వ‌సాయ ప‌నుల్లో మ‌హిళలు సైతం శ్ర‌మ‌ప‌డుతున్నా వారికి రైతు అనే గుర్తింపు, భ‌ర్త‌తో స‌మానంగా వ్య‌వ‌సాయ బాధ్య‌త‌ల్లో భాగ‌స్వామ్యం ఉండ‌ద‌ని, దుర‌దృష్టవ‌శాత్తూ భ‌ర్త మ‌ర‌ణించిన‌పుడు మాత్రం ఆమె ఒక్క‌సారిగా ఆ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాల్సి వ‌స్తున్న‌ద‌ని,  అలా ఆమె మ‌గ‌వాడి పాత్ర‌లోకి మారి బాధ్య‌త‌లు త‌ల‌కెత్తుకున్నా, ఆమెను వెన‌క్కులాగే ఆచార‌వ్య‌వ‌హారాలు ఉంటున్నాయ‌ని క‌విత విశ్లేషిస్తున్నారు.

మ‌గ‌వాడి స్టేట‌స్‌, అధికారం అనే నాణేనికి రెండోవైపే ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌ని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సైకియాట్రి ప్రొఫెస‌ర్ వివేక్ బెనెగ‌ల్ చెబుతున్నారు. మొత్తానికి పితృస్వామ్య స‌మాజం సృష్టిస్తున్న స్టీరియో టైప్ ఆడా మ‌గా పాత్ర‌లు ఆడ‌వారిపై హింస‌ని, మ‌గ‌వారికి అప‌జ‌యాన్ని త‌ట్టుకునే శ‌క్తి లేమిని మిగులుస్తున్నాయ‌ని వీరు భావిస్తున్నారు.

అయితే ఇదంతా ఆమోద‌యోగ్యంగానే అనిపిస్తున్నా పురుషాహంకారం ఒక్క‌టే ఈ ఆత్మ‌హ‌త్య‌ల వెనుక ఉన్న కార‌ణంగా భావించ‌లేము. ఎందుకంటే వ్యాపారంలో ల‌క్ష‌లు కోట్లు పోగొట్టుకుంటున్న‌వారు సైతం ఇలాంటి దారుణానికి పాల్ప‌డ‌డం అరుదు. ధైర్యంగా ఆ అప‌జ‌యాల‌ను ఎదుర్కొంటున్నారు. బ‌తికేందుకు అన్ని మార్గాలు మూసుకుపోయిన‌పుడు మాత్ర‌మే మ‌నిషి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తాడు. త‌న‌ శ‌క్తికంటే త‌న‌ని బాధ‌పెడుతున్న అంశాల బ‌లం ఎక్కువ‌గా  ఉన్న‌పుడే ఇలాంటి ఆలోచ‌న‌లు చేస్తాడు. వ్య‌వ‌సాయాన్ని భారంగా మారుస్తున్న అంశాలెన్నో క‌లిసి రైతుల వెన్ను విరుస్తున్నాయ‌న్న‌ది కాద‌న‌లేని నిజం. జీవితాన్ని కోల్పోయేంత నిరాశా నిస్పృహ‌లు ఏ అర్థరాత్రో ఒక్క‌సారిగా ఆవ‌హించేవి కావు. వ‌రుస‌గా కొన్నేళ్లపాటు దెబ్బ‌మీద దెబ్బ తింటూ వ‌చ్చిన‌పుడు క‌లిగే చావు తెగింపు అది. బ‌య‌ట‌కు క‌నిపించే అప్పులు, బాధ్య‌త‌ల‌ను మాత్ర‌మే ప్ర‌పంచం చూస్తుంది. కానీ క‌నిపించ‌ని నిస్పృహ‌ని, గుండె బ‌రువుని కొలిచే సాధ‌నం ఏదీ లేదు. భూమిని న‌మ్ముకోవ‌డ‌మే పాప‌మ‌న్నంత దారుణంగా రైతుల ప‌రిస్థితులు ఉంటున్నాయి.

వ్య‌వ‌సాయం… వంద చిల్లులున్న కుండ‌తో నీళ్లు మోయ‌డం గా మారిపోవ‌డం, వ్య‌వ‌సాయం కాక ఇంకేం చేయాలో తెలియ‌క‌పోవ‌డం…. ప‌డ‌ని వాన‌లు, పెరుగుతున్న పెట్టుబ‌డులు,  ఇంటి ఖ‌ర్చులు, పిల్లల చ‌దువులు, చేతికంద‌ని పంట‌లు…ఒక్కో రైతు ఆత్మ‌హ‌త్య‌  వెనుక ఉన్న ప‌రిస్థితుల‌ను  పోస్ట్ మార్ట‌మ్ చేస్తే ఇలాంటి కార‌ణాలు ఎన్నో క‌న‌బ‌డ‌తాయి. అలాంటి అధ్య‌య‌నాలు చేయ‌కుండా, వాటి ప‌రిష్కారాలు ఆలోచించ‌కుండా చివ‌రికి… ఎక‌రాకు ఎన్ని బ‌స్తాలు, ఎంత పంట అని లెక్కేసుకున్నంత తేలిగ్గా సంవ‌త్స‌రానికి ఎన్ని ఆత్మ‌హ‌త్య‌లో లెక్కేసుకునేంత‌గా మ‌న ప్ర‌భుత్వాలు మొద్దుబారిపోయాయి.

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌