తెలంగాణలో స్మార్ట్‌ స్కూళ్ళకు ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్‌ స్కూళ్ళకు శ్రీకారం చుట్టనుంది. పెన్ను, పేపర్‌ లేకుండా కేవలం ట్యాబ్‌ల ద్వారానే విద్యను బోధిస్తూ ప్రయోగం చేయదలచుకుంది. ఈ పథకాన్ని ముందుగా హైదరాబాద్‌లోని రెండు స్కూళ్ళలో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలు చూసిన తర్వాత పూర్తిస్థాయిలో ముందడుగు వేయాలని నిర్ణయించింది. ప్రతి తరగతి గదిలోను స్మార్ట్‌ బోర్డులు ఏర్పాటు చేసి కంప్యూటర్‌ ఆధారంగా పాఠాలు బొధించనున్నారు. ఈ విధానాన్ని 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అమలు చేసి ఆపైన పైతరగతుల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఈమేరకు విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తారు. స్మార్ట్‌ బోర్డుల ద్వారా తరగతులు నిర్వహించేందుకు రెండు స్కూళ్ళను ఎంపిక చేసి అందులో ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు అర్హతలున్న అధ్యాపకులను నియమిస్తారు. ఒకవేళ అర్హతల్లో లోపాలున్నా వారికి ఐటి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారు. అవసరమైతే ఐటి శాఖ సహాయాన్ని తీసుకుంటారు.