Telugu Global
Others

వలస పక్షులకు టీఆర్‌ఎస్‌లో గడ్డుకాలం!

ఇతర రాజకీయ పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లోకి మారిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి సహజంగానే అధికారపక్షంలోకి వలసలు జరుగుతాయి. నియోజకవర్గానికి మేలు చేద్దామనో, సొంత పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందనో, అధికార దర్పం దక్కుతుందనో ప్రభుత్వానికి సారధ్యం వహించే పార్టీలోకి వెళ్లడం సహజం. ఎమ్మెల్యేల్లో ఉన్న ఈ బలహీనతలనే ఆసరా చేసుకుని టీఆర్‌ఎస్‌ కూడా వలవేసి కొంతమందిని పార్టీలోకి ఆకర్షించింది. ఇలా చేయడం వల్ల ఇటీవల […]

వలస పక్షులకు టీఆర్‌ఎస్‌లో గడ్డుకాలం!
X

ఇతర రాజకీయ పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లోకి మారిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి సహజంగానే అధికారపక్షంలోకి వలసలు జరుగుతాయి. నియోజకవర్గానికి మేలు చేద్దామనో, సొంత పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందనో, అధికార దర్పం దక్కుతుందనో ప్రభుత్వానికి సారధ్యం వహించే పార్టీలోకి వెళ్లడం సహజం. ఎమ్మెల్యేల్లో ఉన్న ఈ బలహీనతలనే ఆసరా చేసుకుని టీఆర్‌ఎస్‌ కూడా వలవేసి కొంతమందిని పార్టీలోకి ఆకర్షించింది. ఇలా చేయడం వల్ల ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి లబ్ది చేకూరింది. కాని ఇలా టీఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్ళిన వారెవరూ ప్రస్తుతం హ్యాపీగా లేరన్నది నిజం. ఇలా వలసపోయిన వారిలో చాలామందికి పార్టీ అధినేత అపాయింట్‌మెంట్‌ కూడా ఇప్పుడు దొరకడం లేదు. సామాన్య ప్రజలు టీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ కోసం ఎలా పడిగాపులు పడుతున్నారో ఇప్పుడు వీరి పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఇప్పటికే తెలుగుదేశం నుంచి తలసాని, ధర్మారెడ్డి, తీగల, ప్రకాష్‌గౌడ్‌, కిషన్‌రెడ్డి వెళ్ళిపోగా కాంగ్రెస్‌ నుంచి యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి, రెడ్యానాయక్‌లు టీఆర్‌ఎస్‌ నీడకు చేరిపోయారు. ఈ రెండు పార్టీల నుంచే కాకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా కొందరు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఇందులో చాలామంది ఇపుడు హ్యాపీగా లేరు. వివిధ పార్టీల నుంచి వెళ్ళిన టాప్‌ క్యాడర్‌కే… అంటే పార్టీలు మారిన కె.కేశవరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్‌, డి. శ్రీనివాస్‌, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారికే అక్కడ అధినేత ఎప్పుడూ అందుబాటులో ఉండి అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు. సాదాసీదా ఎమ్మెల్యేలకు మాత్రం కొన్నివారాలపాటు తిరిగినా కేసీఆర్‌ దర్శనం లభించడం లేదు. ఎక్కడ దాకానో ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కొండా సురేఖ తనకంటూ ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న నాయకురాలు. ఆమెకు కూడా కొన్నాళ్ళ వరకు అపాయింట్‌మెంట్‌ లభించ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు యాదయ్య, కనకయ్యలు కూడా అధినేత దర్శనం కోసం పడిగాపులు పడిన సందర్భాలున్నాయి.
సాదాసీదా జనం మాదిరే మిగిలిన ఎమ్మెల్యేలు పడిగాపులు కాయాల్సి ఉంటుందని, అధినేతను చూడడానికి, ప్రసన్నం చేసుకోడానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వీరెవరూ ఊహించలేదు. పార్టీలో చేరి అవసరానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపయోగపడిన ఎమ్మెల్యేలు కూడా ఇపుడేం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌లో తమని పలకరించే నాధుడే లేడని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కొంచెం ముందు హారతి పట్టి ఆహ్వానించి గులాబీ కండువా కప్పిన నాయకులు ఇపుడు కనీసం పలకరించడం లేదని, కనీసం ఫోన్‌లు చేసిన నాయకులు, మంత్రులు లిఫ్ట్‌ కూడా చేయడం లేదని ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అడుగుతుంటే మొగం చాటేస్తూ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారని, వైసీపీలో ఉండగా తమకు ఏ పని కావాల్సి వచ్చినా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేదోడువాదోడుగా ఉండేవారని, ఇపుడు తమ బతుకు దిక్కూదివానం లేనట్టు తయారైందని ఎమ్మెల్యేలు మదన్‌లాల్‌, తాడికొండ వెంకటేశ్వర్లు ఆవేదన చెందుతున్నారు. పార్టీ మారక ముందు అరచేతిలో స్వర్గాన్ని చూపించిన టీఆర్‌ఎస్‌ నేతలు ఇపుడు నరకం చూపెడుతున్నారని, కొంతకాలం వేచిచూసి పరిస్థితిలో మార్పు రాకపోతే ‘బ్యాక్‌ టు పెవీలియన్‌’ అంటున్నారీ ఎమ్మెల్యేలు.

First Published:  18 Sep 2015 5:19 AM GMT
Next Story