ఆ నిద్ర మ‌ధురం కాదు…మ‌ధుమేహానికి దారి!

మ‌ధ్యాహ్న‌పు నిద్ర మంచిదా, కాదా అనే విష‌యంపై శాస్త్ర‌వేత్త‌లు ఇంకా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూనే ఉన్నారు. మిట్ట‌మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌రువాత ఒక‌ చిన్న‌పాటి కునుకు తీస్తే ఆరోగ్యానికి మంచిదేన‌ని, దాని వ‌ల‌న హాని ఏమీ ఉండ‌ద‌ని కొన్ని ప‌రిశోధ‌న‌లు ఇంత‌కుముందే చెప్పాయి. అయితే ఆ నిద్ర కాస్తా గంట, అంత‌కంటే ఎక్కువ సేపు పొడిగిస్తే మాత్రం అది ఆరోగ్యానికి చేటు తెస్తుంద‌ని, మ‌ధుమే హాన్ని (సుగ‌ర్‌) తెచ్చిపెడుతుంద‌ని ఇప్పుడు చెబుతున్నారు. టోక్యోలోని తొమోహిద్ య‌మాదా యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు, ప‌గ‌ట నిద్ర, మ‌ధుమేహం ఈ రెండు అంశాల మ‌ధ్య ఉన్న సంబంధంపై గ‌త ఏడాది వ‌ర‌కు చేసిన అధ్య‌య‌నాల‌న్నింటినీ విశ్లేషించి చివ‌రికి ఈ నిర్దార‌ణ‌కు వ‌చ్చారు.

ఆసియా, ప‌శ్చిమ దేశాల‌కు చెందిన 2,61,365 మందిపై నిర్వ‌హించిన 600 అధ్య‌య‌నాల‌ను వీరు విశ్లేషించారు. ఒక గంట‌పాటు నిద్ర‌పోతే మ‌ధుమేహం వ‌చ్చే ప్ర‌మాదం 46శాతం పెరుగుతుంద‌ని, అంత‌కంటే ఎక్కువ‌గా నిద్ర‌పోతే ఆ రిస్క్ 56శాతం ఉంటుంద‌ని వీరు చెబుతున్నారు. అయితే మ‌ధ్యాహ్నం పూట న‌ల‌భై నిముషాల వ‌ర‌కు నిద్ర‌పోవ‌డం వ‌ల‌న ఎలాంటి ఆరోగ్య హానీ ఉండ‌ద‌ని, పైగా ఈ నిద్ర మ‌నిషిలో చురుకుద‌నాన్ని పెంచుతుంద‌ని చెబుతున్నారు. అయితే ఈ చిన్న‌పాటి కునుకు అనేది గాఢ నిద్ర‌లోకి వెళ్ల‌క‌ముందే ముగించి, మెల్కోంటే మంచిద‌ని, అలా కాకుండా గాఢ‌నిద్ర‌లోని వెళ్లి, ఆ నిద్రని ముగించ‌కుండా మేల్కొంటే… మ‌త్తు, ఏకాగ్ర‌తాలోపం లాంటి స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వీరు చెబుతున్నారు. ఇది నిద్ర‌పోక‌ముందు ఉన్న మ‌త్తు కంటే ఎక్కువ‌గా ఉంటుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

చిన్న‌పాటి నిద్ర మ‌ధుమేహాన్ని దూరంగా ఉంచుతుందా అనే విష‌యంపై ఎలాంటి స్ప‌ష్ట‌తా రాలేద‌ని, కానీ మ‌ధ్యాహ్న‌పు నిద్రాకాలంలో తేడాలు మ‌నిషి ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌నే విష‌యంలో త‌మ ప‌రిశోధ‌న‌లు కొంత‌వ‌ర‌కు ఫ‌లించాయ‌ని వారు చెబుతున్నారు. స్వీడ‌న్‌లోని స్టాక్‌హామ్ లో జ‌రిగిన యురోపియ‌న్ అసోసియేష‌న్ ఫ‌ర్ ది స్ట‌డీ ఆఫ్ డ‌యాబెటిస్ సంస్థ సాంవ‌త్స‌రిక స‌మావేశంలో ఈ విశ్లేష‌ణా ఫ‌లితాల‌ను శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. మొత్తానికి మ‌ధ్యాహ్నం వేళ క‌మ్మ‌ని కునుకు తీస్తున్న‌పుడు… మ‌త్తు వ‌ద‌ల‌రా నిద్దుర మ‌త్తు వ‌ద‌ల‌రా… అనే పాట‌ని గుర్తు తెచ్చుకుని, వేళ‌మీర‌కుండా మేలుకునేందుకు రెప్ప‌ల‌ను ఒప్పించాల్సిందేన‌ని ఈ అధ్య‌య‌నాల సారం చెబుతోంది.