Telugu Global
Others

పార్టీపైన, పాలనపైన పట్టు కొల్పోతున్న చంద్రబాబు!

తెలుగు దేశం పార్టీ అధినేత … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాను రాను పార్టీ పైనా… పాలన పైనా పట్టు కోల్పోతున్నాడా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కాదనలేం! ఎందుకంటే గతంలో టీడీపీలో అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు… నేడు అన్ని విషయాల్లోను ఇతరులపై ఆధారపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ప్రధాన లక్షణంగా చెప్పుకునే క్రమశిక్షణ ఆ పార్టీలో ఇప్పుడు కనుమరుగైంది. గతంలో పార్టీ నిర్ణయాన్ని అందరూ శిరసావహించేవారు. ఎవరైనా పార్టీ కార్యకలాపాలకు […]

పార్టీపైన, పాలనపైన పట్టు కొల్పోతున్న చంద్రబాబు!
X
తెలుగు దేశం పార్టీ అధినేత … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాను రాను పార్టీ పైనా… పాలన పైనా పట్టు కోల్పోతున్నాడా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కాదనలేం! ఎందుకంటే గతంలో టీడీపీలో అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు… నేడు అన్ని విషయాల్లోను ఇతరులపై ఆధారపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ప్రధాన లక్షణంగా చెప్పుకునే క్రమశిక్షణ ఆ పార్టీలో ఇప్పుడు కనుమరుగైంది. గతంలో పార్టీ నిర్ణయాన్ని అందరూ శిరసావహించేవారు. ఎవరైనా పార్టీ కార్యకలాపాలకు అడ్డొచ్చినా…తన నిర్ణయాలను వ్యతిరేకించినా వారిపై చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకునేవారు. కానీ నేడు టీడీపీలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే పార్టీ నాయకులకు చంద్రబాబంటే భయం పోయిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇదివరకు తెలుగుదేశం నాయకుల మధ్య ఎన్ని విభేదాలున్నా వారి మధ్య ఉన్న ఆధిపత్యపోరు బయట పెట్టేవారు కాదు. బాహాటంగా విమర్శిస్తే బాబు క్షేమించడని తక్షణమే తమపై చర్యలుంటాయని నాయకులు భావించేవారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతి జిల్లాలోను టీడీపీ నాయకులు తమ మధ్య విభేదాలను బహిరంగంగానే బయట పెట్టుకుంటున్నారు. ఉదాహరణకి మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, గౌతు శివాజీలు జిల్లా సమీక్ష సమావేశంలోనే ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీ పరువును బజారికీడ్చారు. అదే విధంగా విశాఖకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు…అయ్యన్నపాత్రు
డు మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగానే కొనసాగుతుంది. ఇలా శాసనసభ్యులు…మంత్రులే కాదు…పార్లమెంట్ సభ్యులు కూడా బాబు మాటను అసలు లెక్క చేయడం లేదు. మన రాష్ట్ర ఎంపీలు సరిగా పని చేయటం లేదనీ జనసేన అధినేత పవన్ విమర్శించినప్పుడు… ఆ విమర్శ పై ఎవరు స్పందించవద్దని చంద్రబాబు చెప్పినా విజయవాడ ఎంపీ కేశినేని నాని పవన్‌పై త్రీవ స్ధాయిలో విరుచుకు పడ్డాడు. మరో ఎంపీ జేసి దివాకర్ రెడ్డి నెలకొకసారైనా చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించకుండా ఉంటే ఆయనకు నిద్ర పట్టదు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అయితే ఏకంగా మహిళ ఎంఆర్‌ఓ పైనే దాడికి తెగబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలోను టీడీపీ నాయకులు తమకు నచ్చిన విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ అధినేత ఏ ఒక్కరి పైనా చర్యలు తీసుకోవడం కాదుకదా… వీళ్ళెవరినీ ఒక్క మాట కూడా అనలేదు. పైగా కొన్నిసందర్భాల్లో మద్దతుగా మాట్లాడారు కూడా. ఈ సంఘటనలాన్నింటిని గమనిస్తే చంద్రబాబునాయుడుకీ పార్టీపై పట్టు తగ్గిందని చెప్పవచ్చు.
దిక్చూచి అవుతాడనుకుంటే… చంద్రబాబు వేస్ట్‌!
చంద్రబాబుకి గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉండటంతో… దిక్కు మొక్కు లేకుండా ఉన్న రాష్టానికి దిక్సుచి అవుతాడని చంద్రబాబుకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 16 నెలలైనా రాష్ట్రంలో ఏ విషయంలోను ఎక్కడ కూడా చంద్రబాబు మార్క్ పాలన కనిపించలేదు. బాబు మంత్రిమండలిలో ఉన్న మంత్రులలో కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులకే చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని… వారు తమ శాఖలలో కూడా జోక్యం చేసుకుంటున్నారని మిగిలిన మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా ప్రభుత్వంతో ఏవిధమైన సంబంధం లేనివారి కనుసన్నలలోనే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు వలన రాష్ట్రంలో ఇసుక మాఫియా… భూ మాఫియాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే విధంగా ప్రజలకు సరైన వైద్యం అందించే విషయంలో శ్రద్ధ కొరవడిందనడానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనే నిదర్శనం. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలా విషయానికొస్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య సంఘటనలో కీలక నిందితుడిగా భావిస్తున్న ప్రిన్సిపాల్ బాబురావును ఇంతవరకు అరెస్టు చేయలేదు. నారాయణ విద్యాలయాలలో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిపై విచారణే లేదు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైన గోదావరి జిల్లాల ప్రజలను వణికిస్తున్న సైకో సూది గాడిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు. వీటిని బట్టి చూస్తే శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. పేదవాడికి కనీస అవసరాలను తీర్చడంలోను…సంక్షేమ పధకాలను అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది…ఈ విధంగా జరగడానికి చంద్రబాబు పరిపాలనపై పట్టు కొల్పోవడామే కారణం. చంద్రబాబునాయుడు పాలనపై పట్టును కొల్పోతున్నాడనటానికి ప్రత్యక్ష నిదర్శనమేమిటంటే రాష్ట్రంలో ఎంతో కీలకమైన రాజధాని భూములు విషయంలో చంద్రబాబుకి తెలియకుండా తానే భూసేకరణ నోటిసు ఇచ్చానని మంత్రిచెప్పడామే! ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబునాయుడుకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించి…​ ​ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాపాలనపై దృష్టి పెట్టక పోతే..రానున్న రోజుల్లో ఆయన మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొక తప్పదు.
– సవరం నాగేశ్వరరావు
First Published:  20 Sep 2015 12:06 AM GMT
Next Story