Telugu Global
Others

కౌగిలించుకుని కత్తులు దూసుకుంటున్న 'మిత్రులు'!

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ-బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం కౌగిలించుకుని కత్తులు దూసుకునే కన్నా వేరుపడి పోరాటం చేస్తే ఎంతో కొంత ఫలితముంటుందనుకుంటున్నారు కమలదళం నేతలు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు వీరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అండగా ఉండడం… తమ అనుబంధ సభ్యుడిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ మాట చెల్లుబాటు కావడంతో గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ … ఆతర్వాత క్రమంలో మారిన తీరు బీజేపీ నాయకులకు […]

కౌగిలించుకుని కత్తులు దూసుకుంటున్న మిత్రులు!
X
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ-బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం
కౌగిలించుకుని కత్తులు దూసుకునే కన్నా వేరుపడి పోరాటం చేస్తే ఎంతో కొంత ఫలితముంటుందనుకుంటున్నారు కమలదళం నేతలు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు వీరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అండగా ఉండడం… తమ అనుబంధ సభ్యుడిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ మాట చెల్లుబాటు కావడంతో గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ … ఆతర్వాత క్రమంలో మారిన తీరు బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలోనూ పాలుపంచుకున్నంత వరకు బాగానే ఉన్నా రానురాను టీడీపీ, బీజేపీ నాయకులు మధ్య దూరం పెరుగుతూ…. బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకొనే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు, కమల దళం కలసి పని చేయడం లేదు. కలసి ఉంటూనే కత్తులు దూసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఉదాహరణకు గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లి నియోజకవర్గాలను… రెండు పార్లమెంటు స్ధానాలను టీడీపీ, బీజేపీ కూటమి గెలుచుకుంది. అలాంటి జిల్లాలోనే ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ ఎంపీ గోకరాజు గంగరాజుకి… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఏ ఒక్క విషయంలోను ఏకాభిప్రాయం కుదరడం లేదు. పుష్కరాల సమయంలో అయితే బీజేపీ ఎంపీ గంగరాజుకి… టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మధ్య మాటల యుద్ధం సాగింది. రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతాపార్టీ నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న పైడికొండల మాణిక్యాలరావు సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో టీడీపీకి చెందిన స్థానిక మున్సిపల్ ఛైర్మన్ బీజేపీతో దోస్తీ కట్ అని ప్రకటించేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన రాజకీయ కేంద్రమైన రాజమండ్రిలో అయితే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. ఈ యుద్ధ వాతావరణం ఎర్పడతానికి తెలుగుదేశం నాయకుల అనుసరిస్తున్న విధానాలే కారణమని భారతీయ జనతాపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న దేవాదాయ కమిటిలలోగాని… మార్కెట్ కమిటీలలోగాని బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వక పొగా… కనీసం తమతో సంప్రదించకుండా అవమానిస్తున్నారని రాష్ట్ర కమళదళం బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల తరువాత చంద్రబాబునాయుడులో వచ్చిన మార్పును గమనించిన కాషాయదళ పెద్దలు ఇంక తమ దారి తము చూసుకోవాలనే నిర్ణయానికి దాదాపు వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే భారతీయ జనతాపార్టీ… తెలుగుదేశం పార్టీల మధ్య దోస్తీ కటీఫ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.!
– సవరం నాగేశ్వరరావు
First Published:  21 Sep 2015 10:05 AM GMT
Next Story