ఇది విన్నారా! మెద‌డుకు ఆహారం గాలి!

దేహం ఆరోగ్యంగా ఉండ‌డానికి పోష‌కాహారం గురించి, ఆక‌లి తీరే దాకా క‌డుపు నిండా తిన‌డం గురించి, జిహ్వ కోరిన రుచితో దానిని త్రుప్తి ప‌ర‌చ‌డం వ‌ర‌కు బాగా ప‌ట్టించుకుంటాం. కానీ మెద‌డుకు కూడా ఆహారం ఇవ్వాల‌ని ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించి ఉండం. మ‌నం గుండె (శ్వాస‌కోశం) నిండా స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చుకుంటే అదే మెద‌డుకు ఆహారం.
మెద‌డు బ‌రువు మ‌నిషి బ‌రువులో మూడుశాతం ఉంటుంది. ఇది ఆరోగ్య‌క‌రంగా ఉండాల్సిన బ‌రువుతో పోల్చి చెప్పిన బ‌రువు మాత్ర‌మే. స్థూల‌కాయుల‌కు ఆ మేర‌కు మెద‌డు బ‌రువు కూడా పెరుగుతుంద‌ని కాదు. మ‌నిషి బ‌రువులో మూడు శాతం ఉండే మెద‌డు మ‌నిషి పీల్చుకున్న గాలిలో (ఆక్సిజెన్‌) 20 శాతానికి పైగా వాడుకుంటుంది.
మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తున్న‌ప్పుడు ఇంకా ఎక్కువ ఆక్సిజెన్ అందాలి. ప‌జిల్స్ పూరించ‌డం, చ‌ద‌వ‌డం, ఏకాగ్ర‌త‌తో విన‌డం వంటి స‌మ‌యాల్లో సాధార‌ణం కంటే ఎక్కువ గాలి కావాలి. అందుకే పిల్ల‌లు చ‌దువుకునే త‌ర‌గ‌తి గ‌దుల‌కు గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలంటారు.
ఆక్సిజెన్ త‌గినంత అంద‌క పోతే!
ఏకాగ్ర‌త లోపిస్తుంది. చ‌దివింది గుర్తుండ‌దు. మాన‌సిక స‌మ‌తుల్య‌త లోపిస్తుంది. గాలి త‌గినంత అంద‌న‌ప్పుడు ఊపిరితిత్తులు వేగంగా గాలి తీస‌సుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయి. ప‌రిశుభ్ర‌మైన గాలి అంద‌క‌పోతే ఇత‌ర రుగ్మ‌త‌లు చేర‌తాయి. రోజుకు ఒక గంట సేపు మంచి గాలి ఉన్న చోట (పార్కులు, తోట‌లు) గ‌డిపి త‌గినంత శ్వాసిస్తే అది రోజు వారీ మెద‌డు కార్య‌క‌లాపాల‌కు స‌రిపోతుంది.